Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, November 29, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 23

ఎన్.ఏ.వి. అంటే ఏమిటి? అది ఎలా కొనాలి?

ఎన్.ఏ.వి అంటే నెట్ ఎసట్ వాల్యూ. ఇది మ్యూచువల్ ఫండ్ లేదా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ సంబంధించిన పదం. మీరు పెట్టిబడి పెట్టినప్పుడు మీకు యూనిట్స్ అలాట్ చేయబడతాయి. ఫండ్ మొదలు పెట్టినప్పుడు ఒక్కో యూనిట్ విలువ పది రూపాయలు వుంటుంది. ఆ ఫండ్ లో డబ్బులు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన తరువాత ఆ యూనిట్ విలువ పెరుగుతూ వస్తుంది. అలా పెరుగుతున్న యూనిట్ల విలువ తెలియజేయడానికే ఎన్.ఏ.వి అనే పదాన్ని వాడతారు. కాబట్టి ఎన్.ఏ.వి. అనేది విడిగా అమ్మేది కాదు. మ్యూచువల్ ఫండ్స్ లేదా యూలిప్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు లభిస్తుంది.

క్రెడిట్ కార్డ్ లలో బాలన్స్ ట్రాన్సఫర్ విధానంలో ఒక క్రెడిట్ కార్డ్ నుంచి మరో క్రెడిట్ కార్డ్ కి అప్పుని బదలాయించుకునే విధానం వుంది కదా? అది మంచిదేనా? అలా చేస్తే అప్పు భారం తగ్గుతుంది కదా?

సాధారణంగా క్రెడిట్ కార్డ్ వడ్డీ కన్నా, బాలన్స్ ట్రాన్సఫర్ వడ్డీ తక్కువగానే వుంటుంది. క్రెడిట్ కార్డ్ పైన దాదాపు ముఫై ఆరు శాతం వడ్డీ వుంటే, బాలన్స్ ట్రాన్సఫర్ మీద సుమారు పదహారు శాతం వడ్డీ పడుతుంది. అందువల్ల బాలన్స్ ట్రాన్సఫర్ తీసుకోవడం మంచిదే. అయితే బాలన్స్ ట్రాన్సఫర్ తీసుకున్నప్పుడు రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది మీరు అప్పుని ఏ కార్డ్ లోకి బదలాయించుకున్నారో ఆ కార్డ్ వాడకండి. ఉదహారణకు మీరు ఎస్.బీ.ఐ. కార్డ్ నుంచి ఐ.సి.ఐ.సి.ఐ కార్డుకు అప్పు బదలాయించారనుకోండి. అప్పుడు మీరు ఐ.సి.ఐ.సి.ఐ కార్డ్ వాడకుండా వుండటం మంచిది. ఒకవేళ వాడి, తరువాత డబ్బు కడితే మీరు వాడిన దానికి చెల్లు వేస్తారు తప్ప బాలన్స్ ట్రాన్సఫర్ చేసుకున్న మొత్తానికి చెల్లు వేయరు. అందుకని ఆ కార్డు వాడకూడదు. రెండవది – మీరు ఎలాగూ అత్యధిక వడ్డీ వున్న కార్డు నుంచి తక్కువ వడ్డీ వున్న కార్డుకు మారుతున్నారు కదా? అలాంటప్పుడు మళ్ళీ అత్యధిక వడ్డీ వుండే కార్డ్ వాడటం ఎందుకు? అందుకని మొదటి కార్డును కూడా వాడకండి. మొత్తంగా కలిపి చెప్పాలంటే బాలన్స్ ట్రాన్సఫర్ తరువాత ఇక క్రెడిట్ కార్డ్ వాడనని ఒట్టు పెట్టుకోండి. చేసిన బాలన్స్ ట్రాన్సఫర్ బాకీని సకాలంలో పూర్తి చేసి రుణవిముక్తులుగా మారండి.

డబ్బు కన్నా ముఖ్యమైనవి ఈ ప్రపంచంలో లేవా?

చాలా వున్నాయి. సంపద అంటే డబ్బు మాత్రమే కాదు. ఆరోగ్యం, ఆనందం, సుఖం, సంతోషం, అనుబంధాలు, ప్రేమ ఇవన్నీ ఆస్థులే. అయితే వీటి గురించి మాట్లాడినప్పుడు ఆరోగ్యం/ఆనందం/ప్రేమ కన్నా ముఖ్యమైనవి ఈ ప్రపంచంలో లేవా? అని మీరు అనగలరా? ఏది ముఖ్యమైనదో అని బేరీజు వేయడం ఎందుకు చెప్పండి? డబ్బు కూడా సంపదే అనుకొని ఆలోచించండి.

డబ్బులు దాచిపెట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఒక పది పదిహేను వేలు పోగైన తరువాత ఏదో ఒక పెద్ద ఖర్చు వస్తుంది. దాంతో మళ్ళీ మొదటికి వస్తోంది. ఇలాగైతే ఎప్పటికి మేము అనుకున్నది సాధించేట్లు?


మనం ప్రతి నెల వచ్చే ఆదాయం, ఆ నెల వుండే ఖర్చులకు పోను మిగిలింది ఆదా చేయచ్చు అనుకుంటాము. అద్దె, ఈఎంఐ, కరెంట్ బిల్లు లాంటివి నెల నెలా వచ్చే రెగులర్ ఖర్చులు. రెగులర్ కానీ ఖర్చులు కొన్ని వుంటాయి. పిల్లల స్కూల్ ఫీజులు సంవత్సరంలో నాలుగు సార్లు వస్తాయి. కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. దగ్గర బంధువులింట్లో పెళ్ళికి మీరు పెట్టాల్సిన ఖర్చు అనుకోకుండా వస్తుంది. వీటిలో చాలా వరకు మనకి ముందే తెలుసు. ఆ ఖర్చు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తాము. సరిగ్గా ఇలాంటి ఖర్చు వచ్చినప్పుడే, అప్పటి దాకా దాచిపెట్టిన డబ్బు తీసి వాడేస్తాము. ఒక రకంగా చెప్పాలంటే అదేమీ తప్పేమి కాదు. కాకపోతే మీరు ఇల్లు కొనుక్కోవాలి అని అనుకోని దాచిపెట్టడం మొదలుపెట్టి, ఆ డబ్బుని ఇలాంటి ఖర్చులకు వాడేస్తే బాధగా అనిపిస్తుంది. ఏం చెయ్యాలంటే, ఒక చిన్న కాగితం మీద పన్నెండు నెలల పేర్లు రాయండి. నెల ఖర్చులు కానివి ఏ నెలలో ఎంత వస్తాయో రాయండి. ఇందాక చెప్పినట్లు స్కూలు ఫీజులు, ఇన్సూరెన్స్, పుట్టినరోజులు, పండగలు వగైరా. వీటన్నింటిని కలిపి పన్నెండుతో భాగారిస్తే నెలసరి ఎంత డబ్బు ఈ ఖర్చులకోసం పక్కన పెట్టాలో తెలిసిపోతుంది. అంత డబ్బు ’వేరే’ బ్యాంక్ ఎకౌంట్లో విడిగా వుంచడం అలవాటు చేసుకోండి. ఆ ఖర్చు వచ్చినప్పుడు అందులో నుంచే తీసుకోండి. నెల నెల పక్కన పెట్టాల్సిన సొమ్ము కన్నా కొంచెం ఎక్కువ దాచిపెట్టుకుంటే అనుకోని ఖర్చులు కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోతాయి. ఈ సొమ్ము పక్కన పెట్టిన తరువాత మిగిలే డబ్బుతో మీ సేవింగ్స్, ఇన్వస్ట్మెంట్ చేయండి.

Sunday, November 22, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 22

డబ్బు సంపాదించడం ఎలా? లాంటి పుస్తకాలు షాపుల్లో చాలా కనిపిస్తున్నాయి. ఇవి రాసినవాళ్ళంతా డబ్బులు బాగా సంపాదించారంటారా? లేకపోతే ఇలాంటి పుస్తకాలు అమ్మేసుకుంటూ సంపాదిస్తున్నారా?

ఇవి తెలుగు పుస్తకం మీద రచయితలు బతికే రోజులు కావులెండి. అయినా రాసేదంతా ఆచరించిన విషయాలే కానక్కర్లేదుగా. దెబ్బలు తిన్న అనుభవం కూడా కావచ్చు. కలెక్టర్ కు పాఠాలు చెప్పిన గురువు ఐఏయస్ చదివి వుంటారా చెప్పండి?

పర్సనల్ లోన్ తీసుకోని వాటిని చెల్లెలు పెళ్ళికి, వాడేశాను. ఒక కార్ లోన్ నడుస్తోంది. ఇవన్నీ తీరాక పెట్టుబడులు పెడదామని అనుకున్నాను. అవి తీరేలోగా క్రెడిట్ కార్డ్ అప్పులు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇంకా కొంత కాలం పట్టేట్లుంది. నేను త్వరగా ఈక్విటీ ఇన్వస్ట్మెంట్ మొదలుపెట్టాలంటే మార్గం చెప్తారా?

అప్పులు వుంటే ఈక్విటీ ఇన్వస్ట్మెంట్ చెయ్యకూడదని ఎందుకు అనుకుంటున్నారు? మీకు అవసరానికి మించి అప్పులు వున్న మాట నిజమే కానీ, నెల నెలా ఒక్క ఐదువందలు ఇన్వెస్ట్ చెయ్యలేరా? మీరు ఉద్యోగి అంటున్నారు కాబట్టి టాక్స్ మినహాయింపు కోసం ఏదో ఒక చోట ఇన్వెస్ట్ చెయ్యాలి కదా? ఒక వేళ మీరు పన్ను మినహాయింపు కోసం కేవలం ఇన్సూరెన్స్ పాలసీలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు చేస్తుంటే వెంటనే వాటిని ఆపేయండి. మీకు సరిపోయేంత ఇన్సూరెన్స్ వుంచుకోని మిగిలిన డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. ఇంకో కిటుకు చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్ లో జాగ్రత్తగా ముదుపు చేస్తే, ఆ వచ్చే లాభాలతో మీ అప్పులు త్వరగా తీర్చుకోవచ్చు. ఆ తరువాత మీ నెలసరి పెట్టుబడిని పెంచుకుంటూ త్వరగా సంపద సాధించవచ్చు.

నేను మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు ఈసీయస్ విధానంలో నెల నెలా ఐదు వేలు నా సేలరీ ఎకౌంట్ నుంచి వెళ్ళేలా ఏర్పాటు చేసుకున్నాను. కానీ ప్రతినెలా ఐదు వేలు వుంచడం కష్టం అవుతోంది. దాని వల్ల ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్ లోకి డబ్బులు వెళ్ళటం లేదు. దీని వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా?

దీని వల్ల మూడు ఇబ్బందులు వస్తాయి. మొదటిది మీ బాంక్ ఖాతాలో ఈసియస్ కి సరిపడ సొమ్ము పెట్టట్లేదు కాబట్టి బ్యాంక్ మీకు కొంత పెనాల్టీ వేసే అవకాశం వుంది. రెండొవది మీ ఖాతాలో తరచుగా ఈసియస్ బౌన్స్ అవటం వల్ల మీ ఆర్థిక చరిత్ర పరిశీలించినప్పుడు అది అంత బాగుండదు. దీని వల్ల ముందు ముందు మీకు లోన్లు దొరకడం కష్టమౌతుంది. సిబిల్ దాకా వెళ్తే మీ క్రెడిట్ రేటింగ్ దెబ్బతిని ఇంకా ఇబ్బంది కలగవచ్చు. మూడొవది ముఖ్యమైనది, మీరు అనుకుంటున్న సంపద సాధించడం ఆలస్యమైపోతుంది. మీరు అనుకున్న (సంపద) టార్గెట్ చేరడం చాలా కష్టమైపోతుంది. దీనికి రెండు సలహాలు చెప్తాను. మొదటిది ఐదు వేలకు ఒకటే మ్యూచువల్ ఫండ్ కాకుండా రెండు మూడు ఫండ్స్ ఎంచుకోండి. కనీసం ఒకటి కాకపోతే ఒకటైనా నడుస్తుంటుంది కాబట్టి కాస్తైనా పెట్టుబడిగా నిలబడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీతో మాట్లాడి ఈసియస్ విధానం నుంచి స్టాండింగ్ ఇన్స్టక్షన్ (Standing Instruction) విధానంలోకి మార్పించుకోండి. అందులో మీరు ఎకౌంట్ లో డబ్బులు వుంచితేనే డిడక్ట్ అవుతాయి. మీరు సరిపడ డబ్బు వుంచకపోయినా పెనాల్టీ పడదు.

ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యడానికి ఏ బ్యాంక్ అయితే మంచిదని మీ సలహా?


ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యడానికి ఏ బ్యాంక్ అత్యధిక వడ్డీ ఇస్తుందో అదే మంచిది. ప్రత్యేకంగా ఈ బ్యాంక్ మంచిదని ఈ శీర్షికలో చెప్పడం కుదరదు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యాలనుకున్నప్పుడు మీరు గమనించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావిస్తాను. ముందు మీరు ఎంత డిపాజిట్ చెయ్యాలనుకుంటున్నారో చూసుకోండి, అలాగే ఎంత కాలవ్యవధికి మీరు డిపాజిట్ చెయ్యాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఈ రెండింటి ఆధారంగా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు వుంటుంది. ఐదు సంవత్సరాలు డిపాజిట్ చేస్తే పన్ను మినహాయింపు కూడా వుంటుంది. అలాగే మీరు సీనియర్ సిటిజన్ అయితే 0.25 నుంచి 0.5 శాతం వరకు అదనపు వడ్డీ లభించే అవకాశం వుంది. ప్రస్తుతం 7% నుంచి 8.3% వరకు వడ్డీ రేట్లు వున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, బ్యాంకులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

Sunday, November 15, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 21

నాకు సంపాదనకు ఇబ్బందిలేదు. ఇంట్లో ఖర్చులు మితంగానే చేస్తాము. వున్నదేదో బంగారంలోనూ, స్థిరాస్థుల్లోనూ పెడుతున్నాను. మిగిలిన పెట్టుబడుల గురించి, ఆర్థిక ప్రణాలికల గురించి నాకు అవసరమంటారా?

మిత్రమా, ఆర్థిక ప్రణాలిక అంటే కేవలం పెట్టుబడులే అని ఎందుకు అనుకుంటున్నారు? మీ సంపాదనకు ఇబ్బంది లేదు సరే, విధివశాత్తు మీరే లేకుండా పోతే మీ కుటుంబం నిలదొక్కుకోగలదా? అందుకు సరిపడ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో ఆర్థిక ప్రణాలిక నేర్పుతుంది. మీకు అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే మీరు కొన్న భూముల్ని, ఇళ్ళని ఉన్నపళంగా నష్టపోకుండా అమ్మగలరా? అందుకే లిక్విడిటీ గురించి తెలుసుకోవాలి. మీ రిటైర్మెంట్ కి సంపాదన ఆగిపోయాక నెల నెల ఎంత అవసరమౌతుందో ఆలోచించారా? ఆ ఆలోచనని ఆర్థిక ప్రణాలిక అలవాటు చేస్తుంది. ఆర్థిక ప్రణాలిక మన డబ్బు గురించి మనం తెలుసుకునేందుకు పనికొచ్చే ఉపకరం. దానిని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోని ఆచరించడం అవసరం.

మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక అడ్వైజర్ కొత్త ఫండ్ వచ్చినప్పుడు పెడితే పది రూపాయలకే యూనిట్లు వస్తాయని చెప్తున్నాడు. అది మంచి ఆలోచనేనా?

కాదు. ఇది అర్థం కావాలంటే ముందు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. ఫండ్ మొదలు పెట్టినప్పుడు మొత్తం డబ్బుని పది రూపాయలు విలువ చేసే భాగాలుగా విభజిస్తారు. అంటే లక్ష రూపాయలు మొత్తం ఫండ్ లో వుంటే అవి పది వేల భాగాలుగా విభజించబడతాయి. ఈ భాగాలనే యూనిట్లు అంటారు. మీరు వెయ్యి రూపాయలు ఇస్తే మీకు వంద యూనిట్లు అలాట్ చేస్తారు. ఈ ఫండ్ లో వున్న లక్ష రూపాయల్ని స్టాక్ మార్కెట్లోనూ, డెట్/మనీ మార్కెట్లలో ఫండ్ మేనేజర్ పెట్టుబడిగా పెడతాడు. అలా పెట్టుబడిగా పెట్టిన లక్ష లక్షన్నర అయ్యిందనుకుందాం. మొత్తం యూనిట్ల సంఖ్య పది వేలు కాబట్టి, యూనిట్ విలువ పదిహేను అవుతుంది. అంటే మీరు పెట్టిన వెయ్యి రూపాయలు పదిహేను వందలు విలువ చేస్తాయి.
ఇప్పుడు మీరు ఫండ్ మొదలు పెట్టినప్పుడు కాకుండా యూనిట్ విలువ వంద రూపాయలు వున్నప్పుడు పెట్టుబడి పెట్టారనుకోండి. అంటే మీరు ఇచ్చే వెయ్యి రూపాయలకి పది యూనిట్లే వస్తాయి. అప్పుడు కూడా లక్ష లక్షన్నర అయ్యిందనుకోండి. మీ యూనిట్ విలువ వంద నుంచి నూటాయాభై అవుతుంది. అంటే మీ మొత్తం పెట్టుబడి వెయ్యి, పదిహేను వందలు అవుతుంది. కాబట్టి యూనిట్ విలువ తక్కువ వున్నప్పుడే పెట్టుబడి పెట్టాలి అనుకోవడం సరికాదు. మీరు పెట్టే పెట్టుబడి విలువ ఫండ్ పెరుగుదల మీద ఆధారపడి వుంటుంది తప్ప, మీరు కొన్నప్పుడు యూనిట్ విలువ మీద ఆధారపడి వుండదు.

రిటైర్మెంట్ ప్లానింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలి?

ఈ క్షణమే. మీరు పెట్టే పెట్టుబడి మీద అత్యధిక లాభాలు రావాలంటే, అత్యధిక కాలం ఆ డబ్బుని పెట్టుబడి రూపంలో వుంచాలి. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు కొంత కాలానికి లాభం సంపాదిస్తుంది. ఆ లాభం మళ్ళీ పెట్టుబడిగా మారి ఇంకా ఎక్కువ లాభం సంపాదిస్తుంది. ఇలా అదే డబ్బు ఇబ్బడి ముబ్బడిగ పెరుగుతూ వెళ్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఎనిమిదేళ్ళకి రెండింతలు అవుతుందనుకోండి. పదహారు సంవత్సరాలకు మీరు పెట్టిన పెట్టుబడి నాలుగు రెట్లు అవుతుంది. మరో ఎనిమిదేళ్ళకు ఎనిమిది రెట్లు అవుతుంది. ముఫై రెండేళ్ళకు పదహారు రెట్లు అవుతుంది. అరవై ఏళ్ళకు రిటైర్మెంట్ అనుకుంటే, ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో ఈ పెట్టుబడి పెట్టి వుండాలి. ఇంకో ఎనిమిదేళ్ళు కావాలనుకుంటే ఇరవై ఏళ్ళకే పెట్టుబడి పెట్టి వుండాలి. అప్పుడు ముఫై రెండు రెట్లు వస్తుంది. అందుకని, ఉద్యోగంలో చేరిన మొదటిరోజే రిటైర్మెంట్ కోసం డబ్బులు దాచుకోమని సలహా ఇస్తాను.

నాది తరచుగా ట్రాన్స్ ఫర్లు అయ్యే ఉద్యోగం. కొత్త ఊరికి వెళ్ళిన ప్రతిసారి అద్దె ఇంటి బాధలు తప్పడం లేదు. ఒక చోట ఇల్లు కొనేసి కొంతకాలమన్నా సుఖంగా వుండి, వెళ్ళేటప్పుడు అద్దెకు ఇచ్చేస్తే, పెట్టుబడిగా వుండిపోతుంది కదా....


మీరు ఇల్లు కొనడం గురించి రాసిన సుదీర్ఘమైన ఉత్తరం చదివాను. నేను మీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇస్తే అంత కన్నా పెద్దది అవుతుంది. అందుకని మీరు అడిగిన ఒకే ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. ఇల్లు కొనాలా వద్దా అనే చాలా పెద్ద సమస్య. ఇల్లు ఒక పెట్టుబడి, ఒక ఖర్చు, సుదీర్ఘమైన అప్పు, ఒక స్టేటస్ సింబల్, ఒక సెంటిమెంటల్ అవసరం... ఇలా ఒకొక్కరిది ఒకో అభిప్రాయం. అందువల్ల ఎవరి నిర్ణయం వారే తీసుకోవాలి. నేను అడిగే ఈ నాలుగు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు కనీసం పది పదిహేనేళ్ళు ఆ ఇంటిలో వుంటారా? హోమ్ లోన్ ద్వారా మీకు పన్ను రాయితీ వస్తుందా? ఇంటి విలువలో కనీసం పది నుంచి ఇరవై శాతం డౌన్ పేమెంట్ కట్టడానికి చేతిలో డబ్బు వుందా? నెల నెలా మీ జీతంలో ముఫై నుంచి నలభై శాతం మధ్యలో ఈఎంఐ వస్తుందా? ఈ నాలుగు ప్రశ్నలకూ మీ సమాధానం అవును అయితే మీరు ఇల్లు కొనుక్కోవచ్చు. కాదు అన్న సమాధానం ఎక్కువగా వుంటే కొనకండి.

Sunday, November 8, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 20

అనుకోకుండా ఒక రెండు లక్షలు కలిసివచ్చాయి. డబ్బుని ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో పెడదామని అనుకుంటున్నాను.ఏదైనా మంచి పథకం సూచిస్తారా బేతాళుడుగారూ?

శీర్షికలో ప్రత్యేకంగా పథకాల గురించి చెప్పనని నియమం పెట్టుకున్నాను.మీకు పథకం సరిపోతుందో మీరే కొంత పరిశ్రమ చేసి తెలుసుకోవాలి.ఆన్ లైన్ లోనూ, ఆర్థిక విషయాల గురించి ప్రచురించే అనేక పత్రికలలోనూ వివరాలు మీకు లభిస్తాయి.మీ విషయంలో ఒక్క సూచన మాత్రం చెయ్యగలను.మీ దగ్గర వున్న డబ్బు మొత్తం ఒకేసారి మ్యూచువల్ ఫండ్ లో పెట్టకండి.అది ఎప్పుడూ శ్రేయస్కరం కాదు.సిస్టమాటిక్ ట్రాన్స్ ఫర్ ప్లాన్ అనే పథకాల గురించి కనుక్కోండి. పథకంలో మీరు ఇచ్చిన డబ్బు మొత్తం ఏదైనా డెట్ పథకంలో వుంచుతారు.దీనివల్ల ఎక్కువ వడ్డీ లాభం రాకపోయినా, మూలధనం స్థిరంగా వుంటుంది.అక్కడ్నుంచి నెల నెల ఒక మొత్తాన్ని యెస్..పి (SIP) ద్వారా మీరు కోరుకున్న ఏదైనా ఈక్విటీ పథకంలోకి పంపుతారు.ఇలా చేయడంవల్ల ఒడిదుడుకులు వున్నా, మీ మూల ధనం చెక్కుచెదరదు.

మీరు ఎప్పుడూ ఇన్సూరెన్స్ కన్నా మ్యూచువల్ ఫండ్ మంచిదని చెప్తారు.నా ఇన్సూరెన్స్ వివరాలు పంపుతున్నాను.యూనిట్ లింక్డ్ పథకాలలో పెట్టుబడులు పెట్టాను. లాభాలు బాగానే వున్నాయి

మీ ఇన్సూరెన్స్ వివరాలు చూశాను.పదేళ్ళ క్రితం, మీ వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళు వున్నప్పుడు తీసుకున్న యూలిప్ పథకాలు కూడా వున్నాయి.ఇప్పుడు మీ వయసు ముఫై ఎనిమిది.అప్పుడు మీరు మొత్తం డబ్బుని ఈక్విటీలో వుంచారు.ఇప్పటికీ అలాగే వున్నాయి.వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలో పెట్టుబడులు తగ్గాలని ఆర్థిక నిపుణుల సలహా.మీ పథకంలో వున్న స్విచ్ ఆప్షన్ మీరు ఎందుకు వాడుకోలేదు?ఈక్విటీ ఫండ్ నుంచి బాలన్స్ డ్ ఫండ్ లోకి బదలాయింపు చేసుకోవచ్చు కదా?ఇంతా చేస్తే మీ సంపాదనకు సరిపోయినంత ఇన్సూరెన్స్ వుందా అంటే అదీ లేదు.వున్నదేదో వుంది అనుకుంటే దాని కోసం మీ ఫండ్ లో నుంచి డబ్బులుమోర్టాలిటీ ఛార్జెస్పేరుతో తీసుకుంటున్నారు చూడండి.అదే ఇన్సూరెన్స్ కి ఒక టర్మ్ పాలసీ తీసుకుంటే ఎంతౌతుందో కనుక్కోండి. రెండింటి తేడా చూడండి.మూడో విషయం- మీరు పదేళ్ళ క్రితం కట్టి ప్రీమియంలో ఛార్జీల కింద ఎంత డబ్బు పోయిందో చూడండి. డబ్బు మీద వడ్డీ లెక్క వేసుకోని ఇప్పటికి ఎంత అయ్యుండేదో లెక్కవేయండి.పైన నేను చెప్పినవన్నీ కలిపి చూస్తే ఇన్సూరెన్స్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ మంచివని మీకు అనిపించట్లేదా? అయితే ఒక్క హెచ్చరిక: మ్యూచువల్ ఫండ్స్ గురించి అసలు అవగాహనే లేనివాళ్ళు, నేర్చుకోవాలన్న్ ఉద్దేశ్యమే లేనివాళ్ళు అందులో దిగడం అనవసరం. అలాంటప్పుడు గుడ్డిలో మెల్లలా యూలిప్ ఇన్సూరెన్స్ అయినా మంచిదే.

ఎంత సంపాదించినా టాక్స్ కట్టి కట్టి

మిత్రమా, మీరు కబడ్డీ ఆడటానికి వెళ్ళారనుకోండి.“ఛీ ఛీ ఇంతమంది ఒక మనిషి మీద పడిపోవటమేమిటి?ఇది బాలేదు మార్చేయండిఅంటారా? గేమ్ ఆడేటప్పుడు గేమ్ రూల్స్ కి లోబడే ఆట ఆడాలి.ఆడి గెలవాలి.ఇది కూడా అంతే.ప్రభుత్వం రకరకాల పన్నుల రూపంలో సుమారు నలభై నుంచి యాభై శాతం వరకు జీతాన్ని లాగేసుకుంటుంది.కానీ ప్రభుత్వం లాక్కోకుండా వుండాలంటే, కొంత టాక్స్ ప్లానింగ్ అవసరం.టాక్స్ పరిధిలోకి రాని పథకాలలో పెట్టుబడి పెట్టి, పెట్టుబడి మీద వచ్చే లాభాలను కూడా టాక్స్ పరిధిలోకి రాకుండా ప్లాన్ చెయ్యవచ్చు. అంటే ఆట నియమాలకు లోబడే గెలిచే అవకాశాలను పెంచుకోడం అన్నమాట !!

పదేళ్ళ తర్వాత అవసరాలకు 25 లక్షలు రావాలంటే సిప్ పద్ధతిలో ఎంత చెల్లించాల్సి వుంటుంది.ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉపకరిస్తాయా లేక ఈక్విటీ, డెట్ ఫండ్స్ అంటున్నారు, అవి బెస్టా? – బెహార నారాయణ, కావలి (-మెయిల్ ద్వారా)


నారాయాణగారూ, ముందు మీ రెండో ప్రశ్నకు సమాధానం చెప్తాను.జ్వరం వచ్చిందని దగ్గు మందు వేసుకుంటే తగ్గుతుందా? అవసరానికి అవసరం కోసం నిర్దేశించినదే వాడాలి కదా?ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కోసమే కొనాలి.పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించడానికి కాదు.ఇన్సూరెన్స్ పథకాలలో వుండే ఛార్జీల వల్ల, మరెన్నో కారణాల వల్ల లాభాలు తగ్గే అవకాశం ఎక్కువ. అందువల్ల మ్యూచువల్ ఫండ్ విధానమే బెస్ట్.పదేళ్ళలో పాతిక లక్షలు కావాలంటే నెలకి సుమారు పదివేలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది (15% లాభం లెక్కేస్తే 26 లక్షలు అవుతుంది).అయితే పదిహేను శాతం లాభం వస్తుందని గ్యారంటీ వుండదు.డెట్ ఫండ్ అయితే సుమారుగా ఎనిమిది నుంచి పన్నెండు శాతం మధ్యలో, ఈక్విటీ పథకం అయితే పదిహేను నుంచి ఇరవై శాతం మధ్యలో లాభాలు ఇచ్చిన దాఖలాలు వున్నాయి.జాగ్రత్తగా వాటిని పరిశీలించి, ఒక రెండు మూడు పథకాలలో పెట్టండి.