డబ్బు సంపాదించడం ఎలా? లాంటి పుస్తకాలు షాపుల్లో చాలా కనిపిస్తున్నాయి. ఇవి
రాసినవాళ్ళంతా డబ్బులు బాగా సంపాదించారంటారా? లేకపోతే ఇలాంటి పుస్తకాలు
అమ్మేసుకుంటూ సంపాదిస్తున్నారా?
ఇవి తెలుగు పుస్తకం మీద రచయితలు
బతికే రోజులు కావులెండి. అయినా రాసేదంతా ఆచరించిన విషయాలే కానక్కర్లేదుగా. దెబ్బలు
తిన్న అనుభవం కూడా కావచ్చు. కలెక్టర్ కు పాఠాలు చెప్పిన గురువు ఐఏయస్ చదివి
వుంటారా చెప్పండి?
పర్సనల్ లోన్
తీసుకోని వాటిని చెల్లెలు పెళ్ళికి, వాడేశాను. ఒక కార్ లోన్ నడుస్తోంది. ఇవన్నీ
తీరాక పెట్టుబడులు పెడదామని అనుకున్నాను. అవి తీరేలోగా క్రెడిట్ కార్డ్ అప్పులు
పెరిగిపోయాయి. ఇప్పుడు ఇంకా కొంత కాలం పట్టేట్లుంది. నేను త్వరగా ఈక్విటీ
ఇన్వస్ట్మెంట్ మొదలుపెట్టాలంటే మార్గం చెప్తారా?
అప్పులు వుంటే ఈక్విటీ
ఇన్వస్ట్మెంట్ చెయ్యకూడదని ఎందుకు అనుకుంటున్నారు? మీకు అవసరానికి మించి అప్పులు
వున్న మాట నిజమే కానీ, నెల నెలా ఒక్క ఐదువందలు ఇన్వెస్ట్ చెయ్యలేరా? మీరు ఉద్యోగి
అంటున్నారు కాబట్టి టాక్స్ మినహాయింపు కోసం ఏదో ఒక చోట ఇన్వెస్ట్ చెయ్యాలి కదా? ఒక
వేళ మీరు పన్ను మినహాయింపు కోసం కేవలం ఇన్సూరెన్స్ పాలసీలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు
చేస్తుంటే వెంటనే వాటిని ఆపేయండి. మీకు సరిపోయేంత ఇన్సూరెన్స్ వుంచుకోని మిగిలిన
డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. ఇంకో కిటుకు చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్ లో
జాగ్రత్తగా ముదుపు చేస్తే, ఆ వచ్చే లాభాలతో మీ అప్పులు త్వరగా తీర్చుకోవచ్చు. ఆ
తరువాత మీ నెలసరి పెట్టుబడిని పెంచుకుంటూ త్వరగా సంపద సాధించవచ్చు.
నేను మ్యూచువల్
ఫండ్ తీసుకున్నప్పుడు ఈసీయస్ విధానంలో నెల నెలా ఐదు వేలు నా సేలరీ ఎకౌంట్ నుంచి
వెళ్ళేలా ఏర్పాటు చేసుకున్నాను. కానీ ప్రతినెలా ఐదు వేలు వుంచడం కష్టం అవుతోంది.
దాని వల్ల ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్ లోకి డబ్బులు వెళ్ళటం లేదు. దీని వల్ల ఏమైనా
ఇబ్బంది వస్తుందా?
దీని వల్ల మూడు ఇబ్బందులు వస్తాయి.
మొదటిది మీ బాంక్ ఖాతాలో ఈసియస్ కి సరిపడ సొమ్ము పెట్టట్లేదు కాబట్టి బ్యాంక్ మీకు
కొంత పెనాల్టీ వేసే అవకాశం వుంది. రెండొవది మీ ఖాతాలో తరచుగా ఈసియస్ బౌన్స్ అవటం
వల్ల మీ ఆర్థిక చరిత్ర పరిశీలించినప్పుడు అది అంత బాగుండదు. దీని వల్ల ముందు ముందు
మీకు లోన్లు దొరకడం కష్టమౌతుంది. సిబిల్ దాకా వెళ్తే మీ క్రెడిట్ రేటింగ్
దెబ్బతిని ఇంకా ఇబ్బంది కలగవచ్చు. మూడొవది ముఖ్యమైనది, మీరు అనుకుంటున్న సంపద
సాధించడం ఆలస్యమైపోతుంది. మీరు అనుకున్న (సంపద) టార్గెట్ చేరడం చాలా
కష్టమైపోతుంది. దీనికి రెండు సలహాలు చెప్తాను. మొదటిది ఐదు వేలకు ఒకటే మ్యూచువల్
ఫండ్ కాకుండా రెండు మూడు ఫండ్స్ ఎంచుకోండి. కనీసం ఒకటి కాకపోతే ఒకటైనా
నడుస్తుంటుంది కాబట్టి కాస్తైనా పెట్టుబడిగా నిలబడుతుంది. మ్యూచువల్ ఫండ్స్
కంపెనీతో మాట్లాడి ఈసియస్ విధానం నుంచి స్టాండింగ్ ఇన్స్టక్షన్ (Standing
Instruction) విధానంలోకి మార్పించుకోండి. అందులో మీరు ఎకౌంట్ లో
డబ్బులు వుంచితేనే డిడక్ట్ అవుతాయి. మీరు సరిపడ డబ్బు వుంచకపోయినా పెనాల్టీ పడదు.
ఫిక్స్డ్
డిపాజిట్ చెయ్యడానికి ఏ బ్యాంక్ అయితే మంచిదని మీ సలహా?
ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యడానికి ఏ
బ్యాంక్ అత్యధిక వడ్డీ ఇస్తుందో అదే మంచిది. ప్రత్యేకంగా ఈ బ్యాంక్ మంచిదని ఈ
శీర్షికలో చెప్పడం కుదరదు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యాలనుకున్నప్పుడు మీరు
గమనించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావిస్తాను. ముందు మీరు ఎంత డిపాజిట్
చెయ్యాలనుకుంటున్నారో చూసుకోండి, అలాగే ఎంత కాలవ్యవధికి మీరు డిపాజిట్
చెయ్యాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఈ రెండింటి ఆధారంగా ఫిక్స్డ్ డిపాజిట్
వడ్డీ రేటు వుంటుంది. ఐదు సంవత్సరాలు డిపాజిట్ చేస్తే పన్ను మినహాయింపు కూడా
వుంటుంది. అలాగే మీరు సీనియర్ సిటిజన్ అయితే 0.25 నుంచి
0.5 శాతం వరకు అదనపు వడ్డీ లభించే అవకాశం వుంది. ప్రస్తుతం 7%
నుంచి 8.3% వరకు వడ్డీ రేట్లు వున్నాయి. ఇవి
ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, బ్యాంకులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
No comments:
Post a Comment