Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, September 27, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 14

పదిహేనేళ్ళ క్రితం కొన్నఇల్లు.ఇప్పుడు మంచి ధర వస్తోందని అమ్మేశాను.నా స్నేహితుడు దాని మీద టాక్స్ కట్టాలని అంటున్నాడు.అది నిజమేనా?

నిజమే.మూడేళ్ళకు పైగా ఇల్లు, భూమి వంటివి మీ పేరు మీద వుంటే వాటిని దీర్ఘకాలిక ఆస్థులుగా పరిగణిస్తారు.షేర్ల విషయంలో సంవత్సరం పాటు మీదగ్గరున్న షేర్లను దీర్ఘకాలిక ఆస్థులుగా పరిగణిస్తారు.ఇలాంటి దీర్ఘకాలిక ఆస్థుల్ని అమ్మినప్పుడు వాటి మీద వచ్చేలాభాన్ని కాపిటల్ గెయిన్స్ (Capital Gains).చట్టాప్రకారం వీటి మీద టాక్స్ కట్టాలి.అయితే ఇంటి విషయంలో కొన్ని మినహాయింపులు వున్నాయి.ఒక ఇల్లు అమ్మిన మూడేళ్ళలో మరో ఇల్లు కట్టించినా, సంవత్సరం క్రితం కానీ, రెండేళ్ళలోపు కానీ ఇల్లు కొన్నా, టాక్స్ వర్తించదు.మిగిలిన ఆస్థుల అమ్మకాలకి, ఒకొక్క ఆస్థికి ఒకో రకమైన టాక్స్ ట్రీట్మెంట్ వుంది.వాటిని ఎవరైనా ఛార్టెడ్ ఎకౌంటెంట్ ని అడిగి తెలుసుకోవచ్చు.కొన్ని మ్యూచువల్ ఫండ్స్ తప్ప మిగిలినవి టాక్స్ పరిథిలోకి రావు.

ఇంటి రుణం తీసుకున్నప్పుడు వీలైనంత ఎక్కువ కాలం వ్యవధి వుండేలా తీసుకోమంటారు అది కరెక్టేనా?

ప్రస్తుతం ఇంటి రుణం 9.5% వడ్డీకే దొరుకుతోంది.పైగా ఇంటి రుణం తీర్చే సొమ్ముకు పన్ను రాయితీ కూడా వుంది. రకంగా చూస్తే ఇంటి రుణం చాలా చవకైన రుణం.అందుకని ఎక్కువ కాలవ్యవధి పెట్టుకోమని చాలామంది సలహా ఇస్తారు.అయితే నిర్ణయం వయసుని బట్టి కూడా వుంటుంది.ఇరవైల్లో గృహరుణం తీసుకుంటే ముఫై ఏళ్ళ వ్యవధి పెట్టుకోవచ్చి.నలభైల్లో తీసుకుంటే పదేళ్ళకన్నా ఎక్కువ కాల వ్యవధి వుండకూడదు.

నేను నాలుగేళ్ళ క్రితం రిటైర్ అయ్యాను.నా రిటైర్మెంట్ డబ్బులో పన్నెండు లక్షలు బ్యాంక్ ద్వారా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలలో, మ్యూచువల్ ఫండ్లో పెట్టాను.ఇప్పుడు వాటి విలువ పది లక్షలు దాటలేదు.రెండు లక్షలు పోగొట్టుకున్నాను.ఇప్పుడేమి చెయ్యాలి?

చేతులు కాలిన తరువాత ఏం చెయ్యగలం?బ్యాంక్ ద్వారా చాలామంది ఇలాంటి పథకాలలో పెట్టి మోసపోయారు.కేవలం బ్యాంక్ మీద/ బ్యాంక్ ఉద్యోగి మీద నమ్మకంతో ఇలాంటి పథకాలలో డబ్బులు పెట్టారు.ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఉద్యోగి అమ్మినంత మాత్రాన అది మీకు సరిపోయే పథకం అని నమ్మకండి.అలాంటి ఉద్యోగులు తమ తమ టార్గెట్ కోసం అమ్ముతారు.వాళ్ళ టార్గెట్ లో ఇన్సూరెన్స్ ఎక్కువ వుంటే ఇన్సూరెన్స్ అమ్ముతారు, మ్యూచువల్ ఫండ్స్ వుంటే మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతారు.మీ విషయానికి వస్తేమీ మొత్తం ఆస్థి ఆదాయం వివరాలు ఇవ్వలేదు.వాటి ఆధారంగా ప్లానింగ్ చెయ్యాలి.పెద్దగా ఆస్థులు లేవని, పెన్షన్ తప్ప వేరే ఆదాయం లేదని అనుకుంటున్నాను.మీరు పెట్టుబడి పెట్టిన పథకాలలో ఎక్కువ శాతం మూడేళ్ళ లాకిన్ వుండి వుంటాయి.మీరు పెట్టుబడి పెట్టి మూడేళ్ళు అయ్యింది కాబట్టి వాటిని వెనక్కి తీసుకునే అవకాశం వుంది.ప్రస్తుతం స్టాక్ మార్కెట్ బాగా ఒడిదుడుకులలో వుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా, సమయం చూసి విత్ డ్రా చేసేయండి.వచ్చిన డబ్బుతో మీ కోసం ఆరోగ్య బీమా తీసుకోండి.కొంత లిక్విడ్ రూపంలో అందుబాటులో వుంచుకోండి.మిగిలిన సొమ్ముని డిపాజిట్లలో పెట్టుకోండి.అన్నట్టు మీ డబ్బు మొత్తం వెనక్కి తీసుకోనవసరం లేదు.ఒక లక్షో, లక్షన్నరో మ్యూచువల్ ఫండ్ లోనే వుంచేయండి.

వ్యవసాయం కోసం బ్యాంక్ రుణం తీసుకున్నాను.అనుకున్నట్లు వర్షాలు లేవు. రుణ మాఫీ వస్తుందేమోనని..


రుణ మాఫీలు రాజకీయానికి సంబంధించినవి.జరగచ్చు జరగకపోవచ్చు. వస్తుందో రాదో తెలియని రుణమాఫీ  కోసం ఇపుడు వాయిదాలు కట్టకపోతే అసలుకే మోసం రావచ్చు. పొలం,ఇల్లు జప్తు కావటం వంటివి జరగచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా బ్యాంకు మిమ్మల్ని ఎగవేతదారుడిగా భావించి ముందు ముందు లోన్లు ఇవ్వకపోవచ్చు.అందువల్ల అప్పు ఒకసారి తీసుకున్న తరువాత ఎగవేద్దాం అన్న ఆలోచనే రాకూడదు.

Sunday, September 20, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 13

మా పిల్లలు బాగానే బాగానే బతుకుతున్నారు.నాకు జీతం, మా వారికి పెన్షన్ పెద్ద మొత్తంలోనే వస్తాయి. రెండింటిలో ఏదో ఒకటి మాకిచ్చేయమని పిల్లలు అడుగుతున్నారు.వాళ్ళకు మేము ఒక ఆదాయాన్ని ఇవ్వాలా?వద్దా?దాచిపెట్టి చివర్లో ఇస్తే మంచిదా?అసలు ఇవ్వకుండా దానధర్మాలు చేయ్యాలా?                   – భారతి, రామన్నపాళెం

ఒక్కమాటలో చెప్పాలంటే మీ డబ్బు, మీ ఇష్టం.ఇందులో మరొకరి ప్రమేయమే అవసరం లేదు.మీ జీతాన్ని ఏం చెయ్యాలనుకుంటే అది చేసుకోవచ్చు.అందుకు మీ ఆయన కూడా అభ్యంతరపెట్టడానికి లేదు.కాకపోతే, ఇద్దరూ కలిసి సంసారాన్ని నడపాలి కాబట్టి సంప్రదించుకోవడం అవసరం.ఇక పిల్లలు అంటారా?వాళ్ళు ఆర్థికంగా స్థిరపడి వుండకపోతే అప్పుడు మీరు సహాయం చెయ్యచ్చు.అది బాధ్యత.వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు, మీ సహాయన్ని ఆశించడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఇవ్వాల్సి వస్తే బయట బ్యాంకు రేటు కన్నా తక్కువ వడ్డీతో  నెల నెలా ఈయంఐ రూపంలో తిరిగి ఇచ్చే ఒప్పందం మీద ఇవ్వండి. పిల్లలు అప్పు చెయ్యక తప్పనప్పుడు, బయట వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి మీరు ఇవ్వడం ద్వారా సహాయం చేసినట్లే అవుతుంది. డబ్బు పైన వాళ్ళకి బాధ్యత వుండేలా చేస్తుంది.రేపెప్పుడో అన్నం పెడతారని రోజు డబ్బులు ధారపోయడం అవివేకం. డబ్బుని జాగ్రత్తగా దాచుకుంటే రేపు అవే మీకు అన్నం పెడతాయి.మీకు ముందు ముందు అవసరాలకు సరిపోయేలా డబ్బు దాచుకోని మిగిలిన డబ్బు వాడుకోండి.యాత్రలకు వెళ్ళండి.దానధర్మం చేయండి.అయితే పూర్తిగా పిల్లల్ని కాదని ఇంకెవరికో పెట్టడం కూడా మంచిది కాదు కాబట్టి కొంత పిల్లలకు కూడా మిగిలేలా ప్లాన్ చేసుకోండి.

కొన్ని కంపెనీలు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాయి.వీటిని నమ్మచ్చా?

ప్రపంచంలో సంస్థ లాభం లేకుండా పని చెయ్యదు.ఇది అన్నింటికి మూలమైన సూత్రం.కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ముఖ్యంగా వైట్ గూడ్స్ అంటే టీవీ, వాషింగ్ మెషీన్ వగైరా వస్తువుల పైన 0% వడ్డీతో ఫైనాన్స్ సదుపాయం ఇస్తామని చెప్తాయి.నెల నెలా ఈయంఐ చూస్తే కూడా అంతే వుంటుంది.కానీ అసలు తిరకాసు వేరే వుంది.అది ప్రాససింగ్ ఫీజ్.మీరు తీసుకునే లోన్ మొత్తం పైన కొంత శాతం ప్రాససెంగ్ ఫీజుగా తీసుకుంటారు.ఇది 2 నుంచి 5 శాతం దాకా వుంటుంది.ఇది కాక ఇలాంటి వస్తువుల పైన మీకు ఇచ్చే డిస్కౌంట్ ఏదన్నా వుంటే అది మీకు లభించదు.ఉదాహరణకి యాభై వేలు ఖరీదు చేసే టీవీ కొంటే, మీకు లభించే రెండు వేల డిస్కౌంట్ మీకు ఇవ్వరు.ఒక వెయ్యి రూపాయల దాకా ప్రాసెసింగ్ ఫీజు. అంటే మీకు నలభై ఎనిమిది వేలకు దొరకే టీవీని  యాభై ఒక్క వేలకి కొంటారు. అడ్వాన్స్ ఈఎంఐ వుంటే దాని వడ్డీ అదనం.అయితే ఇలా కట్టే డబ్బు మొత్తాన్ని వడ్డీగా లెక్కేస్తే, క్రిడిట్ కార్డ్ లేదా పర్సనల్ లోన్ కన్నా తక్కువ వడ్డీనే పడుతుంది.అందువల్ల అప్పుచేసి కొనాలనుకున్నవాళ్ళకి పథకం మంచిదే.

బేతాళా! చాలా వరకు ప్రశ్నలలో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టమని సలహా ఇస్తున్నారు.దాని బదులు నేరుగా షేర్లే కొనుక్కోవచ్చు కదా?

నిజమే.ఏదో ఒక రూపంలో ఈక్విటీలో డబ్బులు పెట్టకుండా సంపద సాధించడం దాదాపు అసాధ్యం.అలా పెట్టేందుకు రెండు రకాల మార్గాలు వున్నాయి.మ్యూచువల్ ఫండ్ లేదా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ విధానంలో ఏదైనా ఫండ్ లో ఇన్వెస్ట్ చెయ్యడం ఒక పద్ధతి.నేరుగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం. నేరుగా షేర్లు కొనుక్కోడానికి వాటి గురించి పరిజ్ఞానం కావాలి, రకరకాల షేర్లు కొనుక్కోడానికి చాలా డబ్బు కావాలి, అవసరమైనప్పుడు/పెట్టుబడి విలువ పెరిగినప్పుడు డబ్బులు వెనక్కి తీసుకోకుండా నియంత్రణ కావాలి. మ్యూచువల్ ఫండ్ లో ఫండ్ మేనేజర్ అనే అనుభవజ్ఞుడు వుంటాడు, రకరకాల షేర్లు కొనేందుకు చాలామంది ఇచ్చిన డబ్బు వుంటుంది, లాకిన్ విధానం వల్ల వెనక్కి తీసుకునే అవకాశం వుండదు. అదీ సంగతి!

నేను గత ఇరవై ఏళ్ళుగా రకరకాల పథకాలలో డబ్బు పెట్టాను.దేవుడి దయవల్ల బాగా లాభపడ్డాను.ఇప్పుడు నా కొడుకు సంపాదిస్తున్నాడు.అతన్ని కూడా నేను డబ్బులు పెట్టిన పథకాలలోనే పెట్టమని సలహా ఇస్తున్నాను. ఆలోచన కరెక్టేనా?


మీ ఆలోచన కరెక్ట్ కాదు.అన్నింటికీ ఒకే మత్రం పనిచెయ్యనట్లే, అందరికీ ఒకే స్ట్రాటజీ పని చెయ్యదు.ఒకరి విలాసవంతమైన ఖర్చు, మరొకరికి అవసరం కావచ్చు.కొంతమంది ఎంత నష్టం వచ్చినా కోలుకోగలరు.కొంతమంది మాత్రం నష్టం రాని సురక్షిత పథకాలనే ఎన్నుకుంటారు.ముఖ్యంగా పెట్టుబడి పెట్టే వ్యక్తి వయస్సు కూడా పెట్టుబడి వ్యూహాన్ని ప్రభావితం చేస్తుంది.వయసు తక్కువగా వున్నవాళ్ళు ఎక్కువ శాతం ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు ముఫై ఏళ్ళు వున్న వ్యక్తి పొదుపు చేసే మొత్తం డబ్బులో డెభై శాతం దాకా ఈక్విటీలో పెట్టచ్చు, అదే అరవై ఏళ్ళ వ్యక్తి తన పొదుపు మొత్తంలో నలభై శాతం కన్నా ఎక్కువ ఈక్విటీలో ఉంచకూడదు.