Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, November 29, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 23

ఎన్.ఏ.వి. అంటే ఏమిటి? అది ఎలా కొనాలి?

ఎన్.ఏ.వి అంటే నెట్ ఎసట్ వాల్యూ. ఇది మ్యూచువల్ ఫండ్ లేదా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ సంబంధించిన పదం. మీరు పెట్టిబడి పెట్టినప్పుడు మీకు యూనిట్స్ అలాట్ చేయబడతాయి. ఫండ్ మొదలు పెట్టినప్పుడు ఒక్కో యూనిట్ విలువ పది రూపాయలు వుంటుంది. ఆ ఫండ్ లో డబ్బులు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన తరువాత ఆ యూనిట్ విలువ పెరుగుతూ వస్తుంది. అలా పెరుగుతున్న యూనిట్ల విలువ తెలియజేయడానికే ఎన్.ఏ.వి అనే పదాన్ని వాడతారు. కాబట్టి ఎన్.ఏ.వి. అనేది విడిగా అమ్మేది కాదు. మ్యూచువల్ ఫండ్స్ లేదా యూలిప్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు లభిస్తుంది.

క్రెడిట్ కార్డ్ లలో బాలన్స్ ట్రాన్సఫర్ విధానంలో ఒక క్రెడిట్ కార్డ్ నుంచి మరో క్రెడిట్ కార్డ్ కి అప్పుని బదలాయించుకునే విధానం వుంది కదా? అది మంచిదేనా? అలా చేస్తే అప్పు భారం తగ్గుతుంది కదా?

సాధారణంగా క్రెడిట్ కార్డ్ వడ్డీ కన్నా, బాలన్స్ ట్రాన్సఫర్ వడ్డీ తక్కువగానే వుంటుంది. క్రెడిట్ కార్డ్ పైన దాదాపు ముఫై ఆరు శాతం వడ్డీ వుంటే, బాలన్స్ ట్రాన్సఫర్ మీద సుమారు పదహారు శాతం వడ్డీ పడుతుంది. అందువల్ల బాలన్స్ ట్రాన్సఫర్ తీసుకోవడం మంచిదే. అయితే బాలన్స్ ట్రాన్సఫర్ తీసుకున్నప్పుడు రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది మీరు అప్పుని ఏ కార్డ్ లోకి బదలాయించుకున్నారో ఆ కార్డ్ వాడకండి. ఉదహారణకు మీరు ఎస్.బీ.ఐ. కార్డ్ నుంచి ఐ.సి.ఐ.సి.ఐ కార్డుకు అప్పు బదలాయించారనుకోండి. అప్పుడు మీరు ఐ.సి.ఐ.సి.ఐ కార్డ్ వాడకుండా వుండటం మంచిది. ఒకవేళ వాడి, తరువాత డబ్బు కడితే మీరు వాడిన దానికి చెల్లు వేస్తారు తప్ప బాలన్స్ ట్రాన్సఫర్ చేసుకున్న మొత్తానికి చెల్లు వేయరు. అందుకని ఆ కార్డు వాడకూడదు. రెండవది – మీరు ఎలాగూ అత్యధిక వడ్డీ వున్న కార్డు నుంచి తక్కువ వడ్డీ వున్న కార్డుకు మారుతున్నారు కదా? అలాంటప్పుడు మళ్ళీ అత్యధిక వడ్డీ వుండే కార్డ్ వాడటం ఎందుకు? అందుకని మొదటి కార్డును కూడా వాడకండి. మొత్తంగా కలిపి చెప్పాలంటే బాలన్స్ ట్రాన్సఫర్ తరువాత ఇక క్రెడిట్ కార్డ్ వాడనని ఒట్టు పెట్టుకోండి. చేసిన బాలన్స్ ట్రాన్సఫర్ బాకీని సకాలంలో పూర్తి చేసి రుణవిముక్తులుగా మారండి.

డబ్బు కన్నా ముఖ్యమైనవి ఈ ప్రపంచంలో లేవా?

చాలా వున్నాయి. సంపద అంటే డబ్బు మాత్రమే కాదు. ఆరోగ్యం, ఆనందం, సుఖం, సంతోషం, అనుబంధాలు, ప్రేమ ఇవన్నీ ఆస్థులే. అయితే వీటి గురించి మాట్లాడినప్పుడు ఆరోగ్యం/ఆనందం/ప్రేమ కన్నా ముఖ్యమైనవి ఈ ప్రపంచంలో లేవా? అని మీరు అనగలరా? ఏది ముఖ్యమైనదో అని బేరీజు వేయడం ఎందుకు చెప్పండి? డబ్బు కూడా సంపదే అనుకొని ఆలోచించండి.

డబ్బులు దాచిపెట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఒక పది పదిహేను వేలు పోగైన తరువాత ఏదో ఒక పెద్ద ఖర్చు వస్తుంది. దాంతో మళ్ళీ మొదటికి వస్తోంది. ఇలాగైతే ఎప్పటికి మేము అనుకున్నది సాధించేట్లు?


మనం ప్రతి నెల వచ్చే ఆదాయం, ఆ నెల వుండే ఖర్చులకు పోను మిగిలింది ఆదా చేయచ్చు అనుకుంటాము. అద్దె, ఈఎంఐ, కరెంట్ బిల్లు లాంటివి నెల నెలా వచ్చే రెగులర్ ఖర్చులు. రెగులర్ కానీ ఖర్చులు కొన్ని వుంటాయి. పిల్లల స్కూల్ ఫీజులు సంవత్సరంలో నాలుగు సార్లు వస్తాయి. కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. దగ్గర బంధువులింట్లో పెళ్ళికి మీరు పెట్టాల్సిన ఖర్చు అనుకోకుండా వస్తుంది. వీటిలో చాలా వరకు మనకి ముందే తెలుసు. ఆ ఖర్చు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తాము. సరిగ్గా ఇలాంటి ఖర్చు వచ్చినప్పుడే, అప్పటి దాకా దాచిపెట్టిన డబ్బు తీసి వాడేస్తాము. ఒక రకంగా చెప్పాలంటే అదేమీ తప్పేమి కాదు. కాకపోతే మీరు ఇల్లు కొనుక్కోవాలి అని అనుకోని దాచిపెట్టడం మొదలుపెట్టి, ఆ డబ్బుని ఇలాంటి ఖర్చులకు వాడేస్తే బాధగా అనిపిస్తుంది. ఏం చెయ్యాలంటే, ఒక చిన్న కాగితం మీద పన్నెండు నెలల పేర్లు రాయండి. నెల ఖర్చులు కానివి ఏ నెలలో ఎంత వస్తాయో రాయండి. ఇందాక చెప్పినట్లు స్కూలు ఫీజులు, ఇన్సూరెన్స్, పుట్టినరోజులు, పండగలు వగైరా. వీటన్నింటిని కలిపి పన్నెండుతో భాగారిస్తే నెలసరి ఎంత డబ్బు ఈ ఖర్చులకోసం పక్కన పెట్టాలో తెలిసిపోతుంది. అంత డబ్బు ’వేరే’ బ్యాంక్ ఎకౌంట్లో విడిగా వుంచడం అలవాటు చేసుకోండి. ఆ ఖర్చు వచ్చినప్పుడు అందులో నుంచే తీసుకోండి. నెల నెల పక్కన పెట్టాల్సిన సొమ్ము కన్నా కొంచెం ఎక్కువ దాచిపెట్టుకుంటే అనుకోని ఖర్చులు కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోతాయి. ఈ సొమ్ము పక్కన పెట్టిన తరువాత మిగిలే డబ్బుతో మీ సేవింగ్స్, ఇన్వస్ట్మెంట్ చేయండి.

2 comments:

  1. >>>మొత్తంగా కలిపి చెప్పాలంటే బాలన్స్ ట్రాన్సఫర్ తరువాత ఇక క్రెడిట్ కార్డ్ వాడనని ఒట్టు పెట్టుకోండి. చేసిన బాలన్స్ ట్రాన్సఫర్ బాకీని సకాలంలో పూర్తి చేసి రుణవిముక్తులుగా మారండి.

    ఆ పై నిబద్ధత తో క్రెడిట్ కార్డ్ ఉపయోగించ గలిగితే చెయ్యండి లేకుంటే కార్డ్ ని డిస్కార్డ్ చెయ్యండి :)

    సిటీ లైఫ్ లో బతుకులు కార్డు మాయలో మయానానికి తీసుకెళు తున్నాయ్ :)

    మయానం లో కాల్చాలంటే క్రెడిట్ కార్డ్ తో పే చెయ్య వచ్చా :)

    జిలేబి


    :)

    ReplyDelete
    Replies
    1. మరే!!
      ఈ కథలన్నీ చెప్పే భవదీయుడు కూడా క్రెడిట్ కార్డ్ వాడుతున్నాడు...!!

      Delete