Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, November 15, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 21

నాకు సంపాదనకు ఇబ్బందిలేదు. ఇంట్లో ఖర్చులు మితంగానే చేస్తాము. వున్నదేదో బంగారంలోనూ, స్థిరాస్థుల్లోనూ పెడుతున్నాను. మిగిలిన పెట్టుబడుల గురించి, ఆర్థిక ప్రణాలికల గురించి నాకు అవసరమంటారా?

మిత్రమా, ఆర్థిక ప్రణాలిక అంటే కేవలం పెట్టుబడులే అని ఎందుకు అనుకుంటున్నారు? మీ సంపాదనకు ఇబ్బంది లేదు సరే, విధివశాత్తు మీరే లేకుండా పోతే మీ కుటుంబం నిలదొక్కుకోగలదా? అందుకు సరిపడ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో ఆర్థిక ప్రణాలిక నేర్పుతుంది. మీకు అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే మీరు కొన్న భూముల్ని, ఇళ్ళని ఉన్నపళంగా నష్టపోకుండా అమ్మగలరా? అందుకే లిక్విడిటీ గురించి తెలుసుకోవాలి. మీ రిటైర్మెంట్ కి సంపాదన ఆగిపోయాక నెల నెల ఎంత అవసరమౌతుందో ఆలోచించారా? ఆ ఆలోచనని ఆర్థిక ప్రణాలిక అలవాటు చేస్తుంది. ఆర్థిక ప్రణాలిక మన డబ్బు గురించి మనం తెలుసుకునేందుకు పనికొచ్చే ఉపకరం. దానిని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోని ఆచరించడం అవసరం.

మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక అడ్వైజర్ కొత్త ఫండ్ వచ్చినప్పుడు పెడితే పది రూపాయలకే యూనిట్లు వస్తాయని చెప్తున్నాడు. అది మంచి ఆలోచనేనా?

కాదు. ఇది అర్థం కావాలంటే ముందు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. ఫండ్ మొదలు పెట్టినప్పుడు మొత్తం డబ్బుని పది రూపాయలు విలువ చేసే భాగాలుగా విభజిస్తారు. అంటే లక్ష రూపాయలు మొత్తం ఫండ్ లో వుంటే అవి పది వేల భాగాలుగా విభజించబడతాయి. ఈ భాగాలనే యూనిట్లు అంటారు. మీరు వెయ్యి రూపాయలు ఇస్తే మీకు వంద యూనిట్లు అలాట్ చేస్తారు. ఈ ఫండ్ లో వున్న లక్ష రూపాయల్ని స్టాక్ మార్కెట్లోనూ, డెట్/మనీ మార్కెట్లలో ఫండ్ మేనేజర్ పెట్టుబడిగా పెడతాడు. అలా పెట్టుబడిగా పెట్టిన లక్ష లక్షన్నర అయ్యిందనుకుందాం. మొత్తం యూనిట్ల సంఖ్య పది వేలు కాబట్టి, యూనిట్ విలువ పదిహేను అవుతుంది. అంటే మీరు పెట్టిన వెయ్యి రూపాయలు పదిహేను వందలు విలువ చేస్తాయి.
ఇప్పుడు మీరు ఫండ్ మొదలు పెట్టినప్పుడు కాకుండా యూనిట్ విలువ వంద రూపాయలు వున్నప్పుడు పెట్టుబడి పెట్టారనుకోండి. అంటే మీరు ఇచ్చే వెయ్యి రూపాయలకి పది యూనిట్లే వస్తాయి. అప్పుడు కూడా లక్ష లక్షన్నర అయ్యిందనుకోండి. మీ యూనిట్ విలువ వంద నుంచి నూటాయాభై అవుతుంది. అంటే మీ మొత్తం పెట్టుబడి వెయ్యి, పదిహేను వందలు అవుతుంది. కాబట్టి యూనిట్ విలువ తక్కువ వున్నప్పుడే పెట్టుబడి పెట్టాలి అనుకోవడం సరికాదు. మీరు పెట్టే పెట్టుబడి విలువ ఫండ్ పెరుగుదల మీద ఆధారపడి వుంటుంది తప్ప, మీరు కొన్నప్పుడు యూనిట్ విలువ మీద ఆధారపడి వుండదు.

రిటైర్మెంట్ ప్లానింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలి?

ఈ క్షణమే. మీరు పెట్టే పెట్టుబడి మీద అత్యధిక లాభాలు రావాలంటే, అత్యధిక కాలం ఆ డబ్బుని పెట్టుబడి రూపంలో వుంచాలి. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు కొంత కాలానికి లాభం సంపాదిస్తుంది. ఆ లాభం మళ్ళీ పెట్టుబడిగా మారి ఇంకా ఎక్కువ లాభం సంపాదిస్తుంది. ఇలా అదే డబ్బు ఇబ్బడి ముబ్బడిగ పెరుగుతూ వెళ్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఎనిమిదేళ్ళకి రెండింతలు అవుతుందనుకోండి. పదహారు సంవత్సరాలకు మీరు పెట్టిన పెట్టుబడి నాలుగు రెట్లు అవుతుంది. మరో ఎనిమిదేళ్ళకు ఎనిమిది రెట్లు అవుతుంది. ముఫై రెండేళ్ళకు పదహారు రెట్లు అవుతుంది. అరవై ఏళ్ళకు రిటైర్మెంట్ అనుకుంటే, ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో ఈ పెట్టుబడి పెట్టి వుండాలి. ఇంకో ఎనిమిదేళ్ళు కావాలనుకుంటే ఇరవై ఏళ్ళకే పెట్టుబడి పెట్టి వుండాలి. అప్పుడు ముఫై రెండు రెట్లు వస్తుంది. అందుకని, ఉద్యోగంలో చేరిన మొదటిరోజే రిటైర్మెంట్ కోసం డబ్బులు దాచుకోమని సలహా ఇస్తాను.

నాది తరచుగా ట్రాన్స్ ఫర్లు అయ్యే ఉద్యోగం. కొత్త ఊరికి వెళ్ళిన ప్రతిసారి అద్దె ఇంటి బాధలు తప్పడం లేదు. ఒక చోట ఇల్లు కొనేసి కొంతకాలమన్నా సుఖంగా వుండి, వెళ్ళేటప్పుడు అద్దెకు ఇచ్చేస్తే, పెట్టుబడిగా వుండిపోతుంది కదా....


మీరు ఇల్లు కొనడం గురించి రాసిన సుదీర్ఘమైన ఉత్తరం చదివాను. నేను మీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇస్తే అంత కన్నా పెద్దది అవుతుంది. అందుకని మీరు అడిగిన ఒకే ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. ఇల్లు కొనాలా వద్దా అనే చాలా పెద్ద సమస్య. ఇల్లు ఒక పెట్టుబడి, ఒక ఖర్చు, సుదీర్ఘమైన అప్పు, ఒక స్టేటస్ సింబల్, ఒక సెంటిమెంటల్ అవసరం... ఇలా ఒకొక్కరిది ఒకో అభిప్రాయం. అందువల్ల ఎవరి నిర్ణయం వారే తీసుకోవాలి. నేను అడిగే ఈ నాలుగు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు కనీసం పది పదిహేనేళ్ళు ఆ ఇంటిలో వుంటారా? హోమ్ లోన్ ద్వారా మీకు పన్ను రాయితీ వస్తుందా? ఇంటి విలువలో కనీసం పది నుంచి ఇరవై శాతం డౌన్ పేమెంట్ కట్టడానికి చేతిలో డబ్బు వుందా? నెల నెలా మీ జీతంలో ముఫై నుంచి నలభై శాతం మధ్యలో ఈఎంఐ వస్తుందా? ఈ నాలుగు ప్రశ్నలకూ మీ సమాధానం అవును అయితే మీరు ఇల్లు కొనుక్కోవచ్చు. కాదు అన్న సమాధానం ఎక్కువగా వుంటే కొనకండి.

2 comments:

  1. చాలా బాగుందండీ !

    రిటైర్ మెంట్ ప్లాన్ లో ఇన్ఫ్లేషన్ గురించి వ్రాయలేదు ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఈ ప్రశ్నకి ప్లానింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలి అన్న విషయం ఒక్కటే ప్రస్తావించాను. రిటైర్మెంట్ సమయానికి ఎంత డబ్బు కావాలి అన్న లెక్క వేసుకునేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

      Delete