Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, December 13, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 25

నాది ఒక చిత్రమైన సమస్య. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి కొనకుండా వుండలేను. ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ వచ్చిన తరువాత ఈ సమస్య మరీ ఎక్కువైపోయింది. దీని వల్ల చాలా డబ్బులు ఖర్చుపెట్టేస్తున్నాను. దీని నుంచి బయటపడటం ఎలాగో అర్థం కావటం లేదు.

ఇది ఒక మానసిక సమస్య. దీనిని కంపల్సివ్ బయ్యింగ్ లేదా ఒనియోమానియా అంటారు. ఈ సమస్య ఇంతకు ముందు పాశ్చాత్య సంపన్న దేశాలలో మాత్రమే వుండేది. ఇప్పుడిప్పుడే భారతదేశం వంటి చోట కూడా తరచుగా కనపడుతోంది. నిజానికి ఇది చాలా మందికి వుండే సమస్యే కానీ ఎవరూ అంత తొందరగా ఒప్పుకోరు. మీరు మీ సమస్యని గుర్తించటమే దీన్ని అధిగమించడంలో మొదటి మెట్టు. సాధారణంగా ఏదో ఒకటి కొనాలి అన్న ఆలోచన కొన్ని ప్రత్యేక సందర్భాలలో కలుగుతుంటుంది. కొంతమందికి సంతోషంగా వున్నప్పుడు, కొంతమందికి బాధ కలిగినప్పుడు ఇలా రకరకాలుగా వుంటుంది. అదేమిటో గుర్తించి, అలాంటి సందర్భం వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా వుండటం మంచిది. ముఖ్యంగా మీ దగ్గర డబ్బులు ఉంచుకోకండి. క్రెడిట్ కార్డులు కత్తిరించి ముక్కలు చేసేయండి. మీ మొబైల్ లో వున్న షాపింగ్ అప్లికేషన్లు తీసేయండి. అసలు మీ బ్యాంక్ ఎకౌంట్లో డబ్బులు వుంచకండి. మొత్తం జీతం కుటుంబంలో ఎవరికైనా ఇచ్చి, ఖర్చు పెట్టే బాధ్యత మొత్తం వారిదే అని చెప్పండి. మీకు ఏదైనా అవసరం వస్తే వాళ్ళని అడిగి తీసుకునేలా ఏర్పాటు చేసుకోండి. ఇవన్నీ చేస్తే మీలో మార్పు వచ్చే అవకాశం వుంది. అలా కూడా జరగకపోతే వెంటనే ఒక సైక్రియాటిస్ట్ ని కలవండి.

మీ సలహా పాటించి ఇన్సూరెన్స్ తీసుకున్నాను. నామినీగా నా కూతురి పేరు రాశాను. ఆమె ఇంకా చిన్నది కాబట్టి గార్డియన్ గా నా భార్య పేరు రాశాను. ఇప్పుడు ప్రమాదవశాత్తు నాకేమైనా జరిగితే, నా ఇన్సూరెన్స్ డబ్బు నా కూతురికి ఇస్తారా లేక నా భార్యకి ఇస్తారా? ఇన్సూరెన్స్ పాలసీలో నామినీ పేరు మార్చుకునేందుకు అవకాశం వుందా?

మీ కూతురు ఇంకా మైనర్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ఆమెకు డబ్బు ఇవ్వదు. ఆ డబ్బుని మీ భార్యకే ఇస్తారు. అయితే ఆ డబ్బుని మీ కూతురికి ఇవ్వాల్సిన బాధ్యత ఆమె మీద వుంటుంది. గార్డియన్ మైనర్ డబ్బుని వాడుకోడానికి వీల్లేదు. నామీని పేరు మార్చుకోడానికి దాదాపు అన్ని ఇన్సూరెన్స్ పాలసీలలో అవకాశం వుంటుంది. ఆయా కంపెనీ బ్రాంచికి వెళ్ళి, ఒక ఫార్మ్ నింపు అలా మార్పించుకోవచ్చు. అంతే కాదు, నామినీగా కేవలం ఒక్క పేరే కాకుండా ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా రాసుకునేందుకు అవకాశం వుంది.

మీరు రాసిన బేతాళ కథలు చదివాను. అందులో ఒక చోట మీరు అత్యవసరాల కోసం కొంత డబ్బు పక్కన పెట్టమని అన్నారు. అలాంటి డబ్బుని మార్కెట్ లో కానీ మ్యూచువల్ ఫండ్ లో కానీ పెట్టుబడి పెట్టచ్చా?

పెట్టకూడదు. అత్యవసరాల కోసం అని అంటున్నాం కదా? అత్యవసరం అంటే చెప్పకుండా వస్తుంది. అప్పటికప్పుడు ఆ డబ్బుని బయటికి తీసే అవకాశం వుండాలి. స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్ లోనూ డబ్బుని వెంటనే వెనక్కి తీసుకునే అవకాశం వుంది (లాకిన్ వున్న బాండ్స్ తప్ప). కానీ మీరు బయటికి తీసే రోజే మార్కెట్ కుదేలైతే? అందుకని అత్యవసర అవసరాలకు డబ్బు లిక్విడ్ గా వుంచుకోవడం మంచిది. సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ వంటి చోట పెట్టుకోవచ్చు. అయితే ఈ పథకాలలో తక్కువ వడ్డీ వస్తుందని తెలుసుకోని అందులో వుంచండి. బంగారం కొనడం కూడా మంచిదే. ఇప్పుడు బంగారు రుణాలు సులభంగానే దొరుకుతున్నాయి కాబట్టి, అత్యవసరం వస్తే ఆ బంగారాన్ని తాకట్టి పెట్టచ్చు. అయితే మొత్తం డబ్బు మొత్తం పెట్టి బంగారం కొనడం కూడా మంచిది కాదు.

మీతో సహా చాలా మంది కోటి కోటిన్నరకి ఇన్సూరెన్స్ తీసుకోమని సలహా ఇస్తుంటారు. ఇంత ఇన్సూరెన్స్ అవసరమంటారా? నేను కోటి రూపాయల ఇన్సూరెన్స్ తీసుకుంటే నాకు ఇస్తారా?


అందరినీ కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ తీసుకోమని ఎవ్వరూ చెప్పరూ. ఒక వ్యక్తి తన కుటుంబానికి ఎంత విలువ చేస్తాడో అంతే ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తాము. ఉదహరణకి ఎవరైనా నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగంలో వుంటే అతని వయసుని బట్టి అతని విలువ కోటి పైనే వుంటుంది. రేపో మాపో చనిపోడానికి సిద్ధంగా వున్న వ్యక్తి విలువ దాదాపు ఏమీ వుండదు. ఇదంతా చదివి మనిషిని డబ్బుతో విలువ కట్టడం ఏంటని అనుకోకూడదు. ఒక వ్యక్తి మీద ఆ కుటుంబం ఆర్థికంగా ఎంత ఆధారపడి వున్నదో తెలుసుకోడానికి ఈ లెక్క వేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అలా లెక్క వేసి, ఒక వ్యక్తికి ఎంత వరకు ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వవచ్చో అంతే ఇస్తుంది. అలాగని తక్కువ ఇన్సూరెన్స్ తీసుకుంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ వుండది.

No comments:

Post a Comment