Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, December 20, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 26

నెలకి అరవై వేలు జీతం అని ఒప్పుకోని కొత్తగా ఈ ఉద్యోగంలో చేరాను. టాక్స్ అని పది వేలు తగ్గించారు. అసలు ఈ టాక్స్ ఎలా లెక్క వేస్తారో అర్థం కావటం లేదు. ఈ టాక్స్ లేకుండా మొత్తం జీతం వచ్చే మార్గం చెప్తారా?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అది ఒక రెండువందల పేజీల పుస్తకం అవుతుంది. చాలా స్థూలంగా చెప్తాను. మీ జీతంలో బేసిక్, స్పెషల్ ఎలవన్స్ వంటి వాటి మీద టాక్స్ పడుతుంది. ట్రావెల్ ఎలవన్స్, టెలిఫోన్ ఎలవన్స్ వంటి వాటి మీద టాక్స్ వుండదు. ముందు వేటి మీద టాక్స్ పడుతుందో, వేటి మీద పడదో మీ ఆఫీసులో కనుక్కోండి. కొంత తికమకగా లెక్కలు వుండేది హెచ్.ఆర్.ఏ. విషయంలో. మీకు హెచ్. ఆర్. ఏ. గా ఇచ్చే సొమ్ములో కొంత భాగానికి మాత్రం టాక్స్ పడే అవకాశం వుంది. ఇలా టాక్స్ వెయ్యాల్సిన మొత్తం ఎంతో (టాక్సబుల్ ఇన్కమ్) లెక్క వేస్తారు. వీటిలో నుంచి మినహాయింపులు తీసేస్తారు. 80C కింద ప్రావిడెంట్ ఫండ్ కి కట్టిన డబ్బు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన డబ్బు, పోస్టాఫీస్ పథకాలు, ఐదు సంవత్సరాలకు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు, పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి రుణం వడ్డీ చెల్లింపు వగైరాలు వుంటాయి. 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలకు కట్టిన ప్రీమియం వుంటుంది. 80E ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోని వుంటే దానికి చేసిన చెల్లింపులు వుంటాయి. ఇలాంటివి ఇంకా కొన్ని సెక్షన్లు వున్నాయి. ఇవన్నీ కలిపి మీ టాక్సబుల్ ఇన్కమ్ లో నుంచి తొలగిస్తారు. అలా తొలగించగా వచ్చిన సొమ్ము పైన స్లాబుల ప్రకారం టాక్స్, ఆ పైన సెస్ విధించి జీతంలో తగ్గిస్తారు. మొదట మీరు చెయ్యాల్సిన పని పైన చెప్పిన పథకాలలో డబ్బులు పొదుపు చెయ్యబోతున్నానని మీ కంపెనీ (ఎకౌంట్స్/పేరోల్స్) విభాగానికి చెప్పడం. అలా మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంగా టాక్స్ లెక్క వేస్తారు కాబట్టి కొంత టాక్స్ తగ్గుతుంది. రెండో పని మీరు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం పొదుపు చెయ్యడం. టాక్స్ తగ్గించుకోడానికి మార్గాలు వున్నాయి కానీ టాక్స్ ఎగవేయడానికి మార్గాలు లేవు. వుంటే అవి చట్టవ్యతిరేకమైనవి.

నమస్తే. క్రెడిట్ కార్డ్ వాడటం మంచిది కాదని మీరు తరచుగా చెప్తున్నారు. ఈ కార్డుల వల్ల లాభాలే లేవంటారా? రివార్డ్ పాయింట్ల ద్వారా లాభం వుంటుంది కదా?

క్రెడిట్ కార్డ్ అంటే అప్పు. అప్పు లేకుండా వుండటం ఎప్పుడూ మంచిదే కదా. అయితే ఒకోసారి అనుకోని అవసరాలు వుంటాయి. అలాంటప్పుడు క్రెడిట్ కార్డ్ వాడటంలో తప్పేమీ లేదు. క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు మీరు వాడిన తేదీ నుంచి బిల్ తయారయ్యే రోజు వరకు ఎలాంటి వడ్డీ వుండదు. ఇది గరిష్టంగా యాభై రోజులు దాకా వుంటుంది. అంటే వడ్డీ లేని అప్పు యాభై రోజులు దొరకడం చాలా మంచి ఉపయోగమే. కానీ, ఒకసారి వడ్డీ పడటం అంటూ మొదలైతే ఇరవై నాలుగు నుంచి ముఫై ఆరు శాతం వరకు వాడ్డీ వడ్డిస్తారు. అందువల్ల వడ్డి పడకుండా యాభై రోజుల్లో వాడుకోగలిగితే ఉపయోగమే. రివార్డ్ పాయింట్ విలువ చాలా తక్కువ. మీరు నూటాయాభై రూపాయలు ఖర్చు పెడితే ఒక అర్థరూపాయి విలువ చేసే పాయింట్లు ఇస్తారు. మీరు కొనే షాపులోనే డబ్బు నగదుగా ఇస్తానని బేరం చేస్తే అంతకన్నా ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది.

ఫార్మ్ 12B అంటే ఏమిటి? నేను ఈ మధ్య ఉద్యోగం మారాను. దీనివల్ల నా ఆదాయపన్ను మీద ఏదైనా ప్రభావం వుంటుందా?

మీరు ఒక సంస్థలో ఆరు నెలలు పని చేశారనుకుందాం. అక్కడ మీ జీతాన్ని బట్టి వార్షిక ఆదాయం లెక్కవేసి అందుకు అనుగుణంగా టాక్స్ తగ్గించి జీతం ఇస్తుంటారు. ఆరు నెలలకే మీరు వదిలేస్తే, మీ ఆదాయం సగానికి పడిపోయినట్లు. అప్పటి దాకా మీ జీతంలో నుంచి తగ్గించిన టాక్స్ మీ ఆదాయానికి చాలా ఎక్కువగా వుంటుంది. ఇలాంటప్పుడు మీరు మరో కంపెనీలో చేరారనుకోండి. వాళ్ళ లెక్క ప్రకారం మీరు సంవత్సరం మధ్యలో చేరారు కాబట్టి ఆరు నెలల జీతమే తీసుకుంటారు. దాని బట్టి టాక్స్ లెక్క వేసి నెల నెల తగ్గిస్తారు. సంవత్సరం చివర్లో మీరు టాక్స్ రిటర్న్స్ కోసం లెక్క వేస్తే అటు ఆరు నెలలు ఒక కంపెనీలో, మరో ఆరు నెలలు మరో కంపెనీలో కలిపి పన్నెండు నెలల జీతం లెక్కలోకి వస్తుంది. స్లాబ్ మారటం వల్ల టాక్స్ పెరుగుతుంది. ఇదంతా మీరు మీ చేతిలో నుంచి, ఒక్కసారిగా కట్టాల్సివస్తుంది. ఇది తప్పించడం కోసం మీ కొత్త కంపెనీ మీ పాత కంపెనీలో మీ జీతం, టాక్స్ ఎంత కట్టారు వంటి వివరాలను తీసుకుంటుంది. ఆ వివరాలు పొందుపరిచేందుకే ఫార్మ్ 12B వాడతారు.

ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాల్సినప్పుడు త్వరగా ఇవ్వరని విన్నాను. ఇది నిజమేనా?


ఏ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఇవ్వకుండా చెడ్డ పేరు తెచ్చుకోవాలని అనుకోదు. కానీ కొన్ని కారణాల వల్ల క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం వుంది. అన్నింటికన్నా ముఖ్యంగా పాలసీ కండీషన్స్ తెలియకపోవడం. ఒక క్రిటికల్ ఇల్ నెస్ పాలసీ తీసుకోని, అది హెల్త్ ఇన్సూరెన్స్ అనుకునే వాళ్ళు వున్నారు. కేవలం కొన్ని నిర్ణీత వ్యాధ్యులు/అనారోగ్యాలు సంభవించినప్పుడే ఆ పాలసీ పనిచేస్తుంది. అలాంటి పాలసీతో ఫ్రాక్చర్ అయినప్పుడు హాస్పిటల్ ఖర్చులు ఇవ్వమని అడగడం సరికాదు కదా! అలాగే డాకుమెంటేషన్ సరిగా చెయ్యకపోవటం మరో సమస్య. భార్యని నామినీగా పెడుతూ ఆమె పేరు బ్యాంక్ లో వున్నట్లు కాక మరో రకంగా రాస్తే ఆ డబ్బు క్లెయిమ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది నిజాలు దాచడం. మెటీరియల్ ఫాక్ట్స్ అంటారు వీటిని. ఉదాహరణకు సిగరెట్లు తాగే అలవాటు వున్నా దాని గురించి పాలసీలో చెప్పకపోవటం. ఆ వ్యక్తి రేపు సిగరెట్ల కారణంగా చనిపోయినట్లు నిర్ధారణ అయితే ఆ క్లెయిమ్ చేతికి అందదు. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అన్ని వివరాలు పూర్తిగా తెలియజేయడం వల్ల క్లెయిమ్ సమయంలో ఇబ్బంది రాకుండా వుంటుంది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునే ముందు, వాళ్ళ క్లెయిమ్ సెటిల్ మెంట్ రికార్డ్ ను కూడా పరిశీలించడం మంచిది.

No comments:

Post a Comment