Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, December 6, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 24

మాకు వ్యవసాయ భూములు వున్నాయి. అమ్మా నాన్నా నా పెళ్ళి కోసం పొలం తాకట్టు పెట్టి డబ్బు తెస్తున్నారు. తక్కువ వడ్డీ దొరికే మార్గమేదైనా వుంటే చెప్పండి.                                 చంద్ర, ఈమెయిల్ ద్వారా

చంద్ర గారూ, మన దేశంలో దొరికే అన్ని అప్పులలో అన్నింటికన్నా చౌకైన అప్పు వ్యవసాయ రుణం. చాలా తక్కువ వడ్డీ పైన అప్పు లభిస్తుంది. వ్యక్తులని నమ్మడం కన్నా మీకు దగ్గరలో వున్న, లేదా మీరు తరచుగా లావాదేవీలు జరిపే బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడితే పూర్తి వివరాలు చెప్తారు. అయితే భూమిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో పెళ్ళి చేయడం అంత మంచి ఆలోచన కాదు. వ్యవసాయ రుణం వ్యవసాయానికే పెట్టడం మంచి పద్ధతి. ఇంకేదైనా వ్యాపారమో, పెట్టుబడి పెట్టడమో చేస్తే ఫర్లేదు. కానీ ఖర్చు పెట్టేస్తే అది మంచిది కాదు. పెళ్ళి అంటేనే ఖర్చు కదా! పైగా మీకు పెళ్ళి చేస్తున్నారు అంటే మీ తల్లిదండ్రుల వయసు ఊహించవచ్చు. మరి ఈ వయసులో అప్పు చేస్తే అది తీర్చేదాకా సంపాదించే ఓపిక వుంటుందా లేదా అని చూసుకోవాలి.

క్రెడిట్ కార్డ్ బాగా వాడేశాను. నెల నెల మినిమమ్ కడుతున్నాను. ఇలాగైతే ఈ అప్పు ఎప్పటికి తీరుతుందో అర్థం కావటం లేదు. కార్డ్ ఇచ్చిన బ్యాంక్ తో సెటిల్మెంట్ చేసుకుంటే మంచిదిని సలహా ఇస్తున్నారు. అది నిజంగా మంచిదేనా?

క్రెడిట్ కార్డ్ ని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మనకి దొరికే అత్యంత అధిక వడ్డీ రుణం క్రెడిట్ కార్డే. పైగా మీరు కేవలం మినిమమ్ ఎమౌంట్ కడుతున్నానని చెప్తున్నారు. ఇలాగైతే మీ బాకీ తీరడానికి ఒక జీవిత కాలం పడుతుంది. ఈ లోగా మీరు మళ్ళీ కార్డ్ వాడారంటే మరో జన్మ ఎత్తినా ఈ క్రెడిట్ కార్డ్ బిల్లే కడుతూ వుండాల్సి వస్తుంది. కేవలం మినిమమ్ మొత్తం కట్టడం ఎంత మాత్రం మంచిది కాదు. మీకు వీలైనంత ఎక్కువ కట్టండి. సెటిల్మెంట్ చేసుకోవడం కూడా మీ ఆర్థిక ప్రగతికి మంచిది కాదు. కేవలం మినిమమ్ సొమ్ము కట్టడం, సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిని, ముందు ముందు మీకు ఎలాంటి లోన్లు దొరకవు. అవకాశం వుంటే ఇంకో క్రెడిట్ కార్డ్ తీసుకోండి. మొదటి కార్డ్ బాలన్స్ ని రెండో కార్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేయించండి. అందులో కూడా ఈఎంఐ విధానం వుంటే ఆ రకంగా ఏర్పాటు చేసుకోండి. ట్రాన్స్ఫర్ జరిగిన తరువాత “రెండు కార్డులను కత్తిరించి పక్కన పడేయండి” – ఇదే అత్యంత కీలకం. ఆ తరువాత రెండో కార్డ్ పైన నెల నెల కట్టాల్సిన మొత్తం కట్టేయండి. బాలన్స్ ట్రాన్స్ఫర్ మీద వడ్డీ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు లాభపడతారు.

నా ఖర్చులన్నీ ఎప్పటికప్పుడు ఒక ఎక్సెల్ షీట్ లో వేస్తున్నాను. గత నెలలో పెట్టిన ఖర్చులన్నీ మీకు పంపుతున్నాను. వీటిలో ఏ ఖర్చు తగ్గించుకోవచ్చని మీరు సలహా ఇస్తారు? అలాగే పెట్టుబడి ఎక్కడ పెట్టాలో కూడా చెప్పండి. – దేవేందర్, ఈ మెయిల్ ద్వారా

దేవేందర్ గారూ, మీరు తయారు చేసిన ఎక్సెల్ షీట్ చూశాను. ప్రయత్నం మంచిదే. కాకపోతే ఇందులో చిట్టాపద్దు లాగా పెట్టిన ప్రతి ఖర్చు రాసుకుంటూ వెళ్ళారు. అలా రాయటం వల్ల పెద్ద ఉపయోగం వుండదు. వాటిని స్థూలంగా విడగొట్టండి. ఉదాహరణకి మీ షీట్ లో వున్న రెంటు, కరెంట్, బిల్లులు వగైరా ఒక భాగం చేయండి. సినిమా, రెస్టారెంట్లు, పార్టీలు ఒక భాగం చేయండి. అలాగే మీరు చేస్తున్న సీవింగ్స్, పెట్టుబడిలో ఒక భాగం చేయండి. ఇలా చేసిన తరువాత ఏ భాగంలో తగ్గించుకోవాలో మీకే అర్థం అవుతుంది. మీకే అర్థం అవ్వాలనే ఈ ప్రయత్నమంతా. ఇంటర్ నెట్ వాడుతున్నట్లైతే పర్సనల్ బడ్జెట్ ప్లానర్ వంటి పేర్లతో అనేక షీట్లు దొరుకుతున్నాయి వాటిని వాడితే కొంత ఎనాలిసిస్ కూడా వుంటుంది కాబట్టి నిర్ణయం తీసుకోవచ్చు. ఇక మీ రెండో ప్రశ్న పెట్టుబడి ఎక్కడ పెట్టాలి అని కదా – పెట్టుబడి ఎక్కడెక్కడ పెట్టే అవకాశం వుందో అక్కడంతా పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టడంలో రిస్క్, రివార్డ్, లిక్విడిటీ, మీ వయసు ఈ నాలుగింటినీ గమనించుకోని ఒక పోర్ట్ ఫోలియో నిర్మించుకోండి. ప్రస్తుతం మీకు ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి అత్యధిక శాతం ఈక్విటీలో పెట్టండి.


పుస్తకాలు కొనడం నా హాబీ. దాని కోసం ఎక్కువగా ఖర్చుపెట్టేస్తున్నానేమో అని అనిపిస్తుంటుంది – మహి, కావలి

నన్ను విడిగా అడిగితే పుస్తకాల కోసం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు అని చెప్తాను. ఎందుకంటే నేను కూడా పుస్తకాలు కొంటుంటాను. ఆర్థిక సలహా ఇవ్వాల్సివస్తే మాత్రం నా సమాధానం వేరుగా వుంటుంది. పుస్తకాలు కొనడం హాబీనా, పుస్తకాలు చదవటం హాబీనా? ఎందుకంటే పుస్తకాలలో ఒకసారి చదవాల్సిన పుస్తకాలు, చదివిన తరువాత దాచుకోదగ్గ పుస్తకాలు వేరు వేరు. ఒకసారి చదవడానికైతే నేను సెకండ్ హ్యాండ్ పుస్తకాలను కొంటాను. చదివిన తరువాత మళ్ళీ అమ్మేస్తాను. అద్దెకు తెచ్చుకోవడం, లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం ఇవన్నీ ఖర్చు తగ్గిస్తాయి. నగరాలలో బుక్ ఎక్స్ ఛేంజ్ (పుస్తకాల మార్పిడి) చేసుకునేందుకు సంస్థలు వున్నాయి. వాటిలో సభ్యులుగా చేరచ్చు. మొత్తం మీద చెప్పొచ్చేది ఏమిటంటే – హాబీలో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఇవి కూడా సంపదే. పుస్తకం జ్ఞానమనే సంపద ఇస్తుంది. కేవలం డబ్బు అనే సంపద మీదే ధ్యాస పెట్టడం మంచిది కాదు. ఆనందం ద్వారా వచ్చే ఆరోగ్యం, జ్ఞానం వంటి సంపదల కోసం కొంత డబ్బు ఖర్చుపెట్టినా తప్పులేదు, కానీ అదేపనిగా ఖర్చు చేయకూడదు

No comments:

Post a Comment