ఈ మధ్యకాలంలో, వాలెట్స్ అని తరచుగా వినిపిస్తున్నాయి. ఎయిర్ టెల్ మనీ, పేటీయం, ఓలా మని ఇలాంటివి. వీటి గురించి చెప్తారా?
మనం ఏదైనా వస్తువు కొన్న తరువాత డబ్బులు ఇస్తాం. ఇది
సాధారణం. ఆ డబ్బుని డబ్బుగా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఇచ్చేందుకు అనేక అవకాశాలు
వచ్చేశాయి. సొడేక్సో పాస్ ఉదాహరణ. మీ కంపెనీ మీకు ఇవ్వాల్సిన డబ్బుని డబ్బుగా
కాకుండా గిప్ట్ వోచర్లుగానో, సొడెక్సో
పాస్ లు గానో ఇవచ్చు. వీటిని అంగీకరించే షాపుల్లో వీటిని మీరు వాడుకోవచ్చు. అలాగే
మరికొన్ని పథకాలు వున్నాయి. మీరు ముందు గానే కొంత డబ్బు ఒక కంపెనీలో జమ చేస్తారు.
వాళ్ళ సేవల్ని లేదా ఉత్పత్తుల్ని మీరు వాడుకున్నప్పుడు ఆ డబ్బులో నుంచి పేమెంట్
చెయ్యవచ్చు. దీని వల్ల మీకు కలిగే లాభం, చేతులో డబ్బులు
ఉంచుకోవాల్సిన అవసరం తగ్గడం, ఇలాంటి పేమెంట్ కంపెనీల వివిధ
స్కీముల ద్వారా లాభం (పేబ్యాక్ లాంటివి). కంపెనీకి కలిగే ఉపయోగం ఏమిటంటే, మీరు ఒకసారి డిపాజిట్ చేసిన తరువాత ఆ కంపెనీ సేవలనే వాడుకుంటారు. పదే పదే
మీరు వారి సేవలనే వాడినప్పుడు డిస్కౌంట్లు, స్కీములు
ఇవ్వడంలో తప్పేముంది. ఇప్పుడు ఇలాంటి పథకాలు ఆటో ప్రయాణానికి కూడా వాడుకునే దాకా వచ్చింది.
ఇది ముందు ముందు ఇంకా విస్తరించబోయే విధానమిది.
దేవుడి కోసం డబ్బు ఖర్చు పెట్టడంలో తృప్తి వుంటుంది కదా?
దేవుడి కోసం డబ్బు ఖర్చు పెట్టడంలో తృప్తి వుండదు. మీరు
దేవుణ్ణి నమ్మి, మీరు చేస్తోంది పుణ్యకార్యమని
నమ్మినప్పుడు, పుణ్యకార్యం చేశాను అన్న తృప్తి మీకు
వుంటుంది. ఒకవేళ మీరు నాస్తికులైనా తిరుపతి ప్రయాణం మీకు తృప్తిని ఇవ్వచ్చు.
కుటుంబాన్ని తిరుపతి తీసుకెళ్ళినందుకు భార్య ఎంతో సంతోషిస్తే, భార్య ఆనందానికి కారణమయ్యానని తృప్తి కలుగుతుంది. ఎక్కడా, ఎప్పుడూ ఖర్చు పెట్టడంలో తృప్తి, ఆనందం వుండదు. ఆ
ఖర్చుకు కారణం నెరవేరినందుకు, అవసరం తీరినందుకు ఆనందం
కలుగుతుంది. ఇది అర్థం అయితే ఖర్చు పెట్టకుండా కూడా ఆనందం పొందవచ్చు అని
తెలుసుకుంటారు. డబ్బులు ఖర్చుపెట్టకుండా పుణ్యం సంపాదించడం లాంటిదే ఇది. రెండూ
సాధ్యమే. తెలుసుకోవాలి. అవలంబించాలి.
స్టాక్ మార్కెట్ ఏ మాత్రం అంచనాలు అందడంలేదు. ఇన్ని
ఒడుదుడుకులు ఎందుకు వున్నాయి?
స్టాక్ మార్కెట్ మొదలైన దగ్గర్నుంచి ఈ రోజు వరకూ ఏ రోజూ
అంచనాలకు అందలేదు. ఒడుదుడుకులు వుండటమే దాని లక్షణం. అంత సులభంగా అంచనాలకు అందితే
అందరమూ కోటీశ్వరులమే అయ్యేవాళ్ళం. స్టాక్ మార్కెట్ గురించి ఖచ్చితంగా చెప్పగలిగిందేమిటంటే, దీర్ఘ కాలం పెట్టుబడి పెడితే ఈ ఒడిదుడుకుల
ప్రభావం చాలా తక్కువ వుంటుంది అని.
డిస్కౌంట్
పథకాలను నమ్మచ్చా? ఒకటి కొంటే ఒకటి ఉచితం అని చెప్పేవన్నీ నిజాలేనా?
కొంత నిజం వుంది,
కొంత అబద్దం కూడా వుంది. చాలాకాలంగా వుండిపోయిన సరుకును వదిలించుకోడానికి డిస్కౌంట్
పథకాలు పెడతారు. ఇది నిజం. అమ్మకాలు పెంచుకోవడం కోసం ధర పెంచి, దాని మీద డిస్కౌంట్
ఇచ్చినట్లు చూపిస్తారు. ఇది ప్రలోభం. వ్యాపారి వదిలించుకోవాలనుకున్న సరుకు
కొనుకున్నా, డిస్కౌంట్ ముసుగులో అదే ధరకి కొనుకున్నా, మీకు పెద్ద లాభం వుండదు. మరి
లాభం ఎప్పుడు వుంటుంది అంటే – మీకు ఒక వస్తువు కొనాల్సిన అవసరం వుండి, సరిగ్గా అదే
వస్తువు వ్యాపారి త్వరగా వదిలించుకోవలనుకుంటున్న సందర్భంలో డిస్కౌంట్ ఇస్తే మీరు
లాభపడ్డట్టు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. దాదాపు అన్నిసార్లు ఖచ్చితంగా
జరిగేదేమిటంటే – వ్యాపారి లాభపడటం.