Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, November 1, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 19

ఖర్చు పెట్టడం తప్పు అనుకుంటే, సంపాదనకి అర్థం ఏముంది?

ఖర్చు పెట్టడం తప్పు అని నేను ఎప్పుడూ చెప్పలేదు.ఖర్చు ఎందుకు పెడుతున్నామో ఒకసారి బేరీజు వేసుకోని, ముందు వెనక చూసుకోని ఖర్చు పెట్టమని చెప్తున్నాను.మనలో చాలా మంది ధనవంతుల్లా కనపడాలని ప్రయత్నం చేస్తుంటాము.బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన చెప్పులు, డిజైనర్ పర్సులు ఇవన్నీ డబ్బు వున్నవాళ్ళు కొనుక్కుంటే అర్థం వుంది. వాళ్ళలాగే మనం కూడా వుండాలని సామాన్యులుమధ్యతరగతి మనుషులు అనుకుంటేనే సమస్య. దానికి ఇంకో కారణం కూడా వుంది. బాగా డబ్బు వున్నప్పుడు దాన్ని తెలివిగా పెట్టుబడి పెడితే, డబ్బు మరింత డబ్బుని సంపాదిస్తుంది.ధనికులు అలా డబ్బు మీద వచ్చిన ఆదాయాన్ని ఖర్చుపెడతారు.సామాన్యులు సంపాదనని ఖర్చుపెడతారు. తేడాని అర్థం చేసుకోవాలి.కోటి రూపాయలు వుంటే కోటి నెల నెలా లక్ష రూపాయలు సంపాదిస్తుంది. డబ్బంతా ఖర్చుపెట్టినా, వెనక కోటి అలాగే వుంటుంది.అదే లక్ష రూపాయల జీతం వున్నా, దాన్నంతా ఖర్చుపెడితే వెనక ఏమీ వుండదు.సంపాదన ఖర్చు పెడితే ఆదా చేసే అవకాశం పోతుంది.అందుకని ఖర్చులని నియంత్రించుకోని సంపాదనని సంపదగా మార్చుకోవాలి. తరువాత సంపద సంపాదించే ఆదాయాన్ని అనుభవించాలి.ఇదే నేను చెప్పిన ఆర్థిక సూత్రం.

బంగారం ధర తగ్గింది కదా

బంగారం గురించి ప్రతి వారం ఉత్తరాలు వస్తున్నాయి.అవును బంగారం ధర తగ్గిన మాట నిజమే.ఇంకా తగ్గుతుందని కూడా కొందరు అంటున్నారు.అయితే తగ్గిన వెంటనే చేతిలో వున్న డబ్బు మొత్తంపెట్టి కొనేసుకోవడం మంచి పద్ధతి కాదు.మీ ఆర్థిక పోర్ట్ ఫోలియోలో బంగారం ఇరవై శాతం కన్నా ఎక్కువ వుండకుండా చూసుకోండి.భోజనానికి కూర్చున్నప్పుడు అన్నీ తినాలి.సాంబార్ బాగుందని సాంబారే తింటూ కూర్చుంటే తరువాత అది అనారోగ్యానికి దారి తీస్తుంది. ఆర్థిక ప్రణాలిక అయినా అంతే!

సంపాదనలో సగ భాగం ఇంటి అద్దెకే సరిపోతోంది.ఇల్లు కొనుక్కుంటే మేలని అనిపిస్తోంది. - హైదరాబాద్

పెద్ద పెద్ద పట్టణాలలో ఇంటి అద్దె అన్నింటికన్నా పెద్ద ఖర్చు.పైగా తప్పనిది కూడా.అయితే ఇల్లు కొనుక్కోడానికి ఇదొక్కటే కారణం అయితే సరిపోదు.ఇప్పుడు మీరు ఇల్లు కొనాలంటే సిటీ బయట కొనాల్సి వస్తుంది.దానివల్ల మీకు కలిగే ఆర్థిక భారం ఏమైనా వుందా? ఉదాహరణకు మీరు ఆఫీస్ వెళ్ళిరాడానికి అయ్యే ఖర్చు, మీరు బాగా అలవాటుపడిన డాక్టర్, హోటల్, మాల్ వంటివి తరచుగా సందర్శించడానికి అయ్యే ఖర్చు..ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.ప్రస్తుతం మీకు హెచ్చారే కింద వస్తున్న రిబేటు పోతుంది.అది కూడా లెక్కవేయండి.ఇక మీరు హోమ్ లోన్ తీసుకుంటారు కనక, దాని వల్ల ఆదా అయ్యే టాక్స్ ఎంతో లెక్కవేసుకోండి.వీటి ఆధారంగా నిర్ణయం తీసుకోండి.

చీటీపాటలు మంచివేనా?మా ఆవిడ నెలనెల పదివేలు పైనే కడుతోంది.నాకు ఎందుకో ఆమె డబ్బు వృధా చేస్తోందని అనిపిస్తోంది.మీరేమంటారు?


మీ ఆవిడ చీటీలు మానేస్తే డబ్బు మీరు ఇన్వెస్ట్ చేస్తారా?లేకపోతే అవి కూడా మీ మిగితా డబ్బు లాగానే ఖర్చైపోతాయా?చీటీ పాటలు వద్దనే చెప్తాం కానీ డబ్బు ఆదా చెయ్యడానికి అదొక మార్గం.కాదనలేము. అయితే వాటిల్లో స్థిరమైన  లాభం వుండదు. మీరు ఎప్పుడు పాడతాన్నారు?పాడిన డబ్బు ఏం చేస్తున్నారు?మీతో పాటు వున్న మిగిలిన సభ్యులు ఎలాంటివారు?వీటన్నింటి మీదా ఆధారపడి చీటీపాటలలో లాభం వుంటుంది.చీటీ మొదలైన మొదట్లోనే డబ్బు తీసేసుకోని, డబ్బుని అత్యధిక వడ్డీ వచ్చేలా వాడగలిగితే మంచిదే. మనకి డబ్బుతో మాత్రం అవసరం లేక, మిగిలిన సభ్యులందరికీ డబ్బుతో చాలా అవసరం వున్నప్పుడు (వాళ్ళు చాలా తక్కువకు పాడటం వల్లమనకు ఎక్కువ లాభం వస్తుంది. ఇవన్నీ మన కంట్రోల్ లో వుండేవి కావు.పైగా నమ్మకమైన సంస్థల నుంచి కాకుండా, వ్యక్తులదగ్గర వేసే చీటీలకు భరోసా వుండదు.అందుకని చీటీలు వద్దని చాలామంది సలహా ఇస్తారు. బ్యాంకు సేవింగ్స్ ఎకౌంట్లో డబ్బులు ఊరికే ఉంచడం కన్నా, నియంత్రణ లేకుండా ఖర్చుపెట్టేయడం కన్నా చీటీ పాటద్వారా కాస్త దాచుకోవడం మంచిదే అని నా అభిప్రాయం.

No comments:

Post a Comment