Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, July 12, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 4

మా అబ్బాయి పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుండేవాడు. లక్షల్లో జీతం వచ్చేది. అక్కడ ఏదో పొరపాటు వల్ల అతని ఉద్యోగం పోయింది. మూడు నెలలుగా వేరే ఉద్యోగం దొరకలేదు. ఇంటిల్లిపాదీ దిగులుపడుతున్నాము.

మీ అబ్బాయి చేసిన పొరపాటు ఒకటి కాదు. రెండు. ఇప్పటి కార్పొరేట్ ఉద్యోగాలలో చిన్న తప్పు కూడా పెద్ద శిక్షేపడుతుంది. ఇక పెద్ద తప్పులు – అంటే కంపెనీ డబ్బు స్వంతానికి వాడుకోవడం, పైరవీలు చెయ్యడం, యాజమాన్యానికి వ్యతిరేకంగా పని చెయ్యడం, సహౌద్యోగులతో ముఖ్యంగా స్త్రీలతో అభ్యంతరకరంగా ప్రవర్తించడం  - ఇలాంటివి మొత్తం కెరీర్ నే నాశనం చేస్తాయి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఇక నేను చెప్పిన రెండో తప్పు – ఉద్యోగంలో ఇలాంటి రిస్క్ వుందని తెలిసి కూడా ముందుజాగ్రత్త లేకపోవటం. ఎలాంటి ఉద్యోగమైనా కనీసం మూడు నెలల ఖర్చులకు సరిపడా డబ్బు అందుబాటులో ఉంచుకోవాలి. దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడమే ఇది. నెల ఖర్చులలో కనీసం కొంత భాగానికైనా సరిపోయేలా మరో ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోని వుండాలి. మీ అబ్బాయి టెక్ ఉద్యోగి కాబట్టి ఆయనకు వచ్చిన సాఫ్ట్ వేర్ నేర్పించే ఏదైనా సంస్థలో ట్రైనర్ గా అప్పుడప్పుడు వెళుతూవుంటే ఇప్పుడు అదే ఆదుకునేది. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. వెంటనే చేయాల్సిన పనులు కొన్ని వున్నాయి. మొదటిది ఇంట్లో ఖర్చులు తగ్గించుకోవడం. కారు మానేసి బండి మీద తిరగటం మొదలుపెట్టవచ్చు. మరీ అవసరమైతే కారు అమ్మేయవచ్చు. మరో ఉద్యోగం దొరికిన తరువాత మరో కారు కొనుక్కోవచ్చు. మీకు ఇబ్బంది కాదనుకుంటే కేబుల్ టీవీ తీసేయండి, సినిమాలు, షాపింగ్ లు మానేయండి. పండగలకి, ప్రయాణాలకీ ఖర్చు పెట్టకండి. మీరు ఉండేది అద్దె ఇల్లు అయితే వూరి చివర కొంచెం చిన్న ఇంటికి మారిపోండి. అద్దెలో వుండే వ్యత్యాసం వల్ల మీకు డబ్బు మిగులుతుంది. మరీ అవసరం అనుకుంటే ఇంట్లో వున్న బంగారం తాకట్టు పెట్టండి. అత్యంత సులువుగా, అనుకోని ఆర్థిక ఇబ్బందులు వున్నప్పుడు బంగారం ఎమర్జెన్సీ ఫండ్ గా ఉపయోగపడుతుంది. అయితే నెలనెలా వడ్డీ కట్టుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోగానే ఆ బంగారం తిరిగి తెచ్చుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేస్తే మరో మూడు నాలుగు నెలలు గడిచిపోతాయి. ఈ లోగా ధైర్యం కోల్పోకుండా ఉద్యోగప్రయత్నాలు ముమ్మరం చేసి అవసరం అయితే తక్కువ జీతానికైనా ఏదో ఒక ఉద్యోగం వచ్చేలా చూసుకోమని చెప్పండి. పైన చెప్పిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా నియంత్రించండి.

ఈక్వీటీలో డబ్బులు పెడితే రిస్క్ కదా బేతాళా?

ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. ఇంకా అడుతునే వుంటారు. రిస్క్ లేనిదే లాభం రాదు అన్నది ప్రపంచంలో ఆ ఆర్థిక నిపుణుణ్ణి అడిగినా చెప్పే మాట. “జయం కోరి సాహసం శాయరా రాజకుమారి లభించేను” అంటాడు కదా నేపాలీ మాంత్రికుడు! అది ఆర్థిక విషయాలకు అక్షరాలా వర్తిస్తుంది. సంపద సాధించాలంటే ఈక్విటీలో డబ్బు పెట్టక తప్పదు. అయితే అది నేరుగా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, దీర్ఘకాలానికి పెట్టినట్లైతే చాలా వరకు నష్ట భయాన్ని తగ్గించుకోవచ్చు. ఈక్విటీలో డబ్బు పెట్టడం రిస్కే కానీ పెట్టకపోవడం ఇంకా పెద్ద రిస్క్ అని గుర్తుపెట్టుకోవాలి.

వచ్చే నెల నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో యెస్.ఐ.పి. చేద్దామని అనుకుంటున్నాను. ఎలాంటి ఫండ్ లో పెడితే మంచిదో చెప్తారా?

తప్పకుండా పెట్టండి. ఈక్విటీలో డబ్బులు పెట్టడానికి అత్యంత సులువైన, చవకైన, రిస్క్ తక్కువ వున్న అవకాశం ఎస్.ఐ.పీ.నే. కాకపోతే ఒకటే అనుమానం. వచ్చే నెల నుంచి ఎందుకు? ఈ నెల నుంచే ఎందుకు చెయ్యటం లేదు? మీరు ఆన్ లైన్ లో మ్యూచువల్ ఫండ్స్ ఎస్.ఐ.పి ద్వారా కొంటున్నట్లైతే మీరు దరఖాస్తు పెట్టుకున్న మూడు నెలలకు కానీ ఎస్.ఐ.పీ మొదలు కాదు. మీరు వచ్చే నెల అనుకుంటున్నారు అంటే ఇంకో నాలుగు నెలల దాకా అది మొదలుకాదు. మీరు నెలకి రెండు వేలు పెట్టాలనుకుంటున్నారు అనుకుంటే, మరో ముఫై ఏళ్ళకి మీరు కోల్పోయే లాభం విలువ ఎంతో తెలుసా? కనీసం మూడు లక్షలు పైనే. అందువల్ల వెంటనే మొదలుపెట్టండి. ఇక ఏ స్కూమ్ అంటారా? మొదటిసారి కాబట్టి టాక్స్ ఆదా చేసే మ్యూచువల్ ఫండ్ పథకం ఏదైనా ఎన్నుకోని దానితో ప్రారంభించండి. ఆలస్యం అమృతం విషం.

ఎందుకండీ ఈ ప్లానింగ్? నేను సంపాదించిన మొదటి జీతం మా నాన్న రిటైరెంట్ రోజున జీతం కన్నా ఎక్కువ. ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. నాకు ప్రపంచం అంతా చుట్టి రావాలని కోరిక. కొండలు ఎక్కడం అంటే సరదా. కొత్త కొత్త గాడ్జెట్స్(ఎలక్ట్రానిక్ పరికరాలు) అంటే పిచ్చి. ఇవన్నీ అనుభవించకుండా రూపాయి రూపాయి కూడబెట్టడం అవసరం అంటారా?


అవసరం లేదు. కానీ అవసరమైనప్పుడు డబ్బు లేదు అనుకోకుండా చూసుకోండి. కొన్ని నాలాంటి వాళ్ళు చెప్తే నేర్చుకోవచ్చు. కొన్ని అనుభవం మీద నేర్చుకోవచ్చు. అనుభవం ఆలస్యమైతే “చేతులు కాలాక...” అన్న సామెతలా అవుతుంది పరిస్థితి. మీ సరదాలు తీర్చుకుంటూనే సంపద కూడా కూడబెట్టచ్చు. ఆ దిశగా ఆలోచించండి. మనసు మారితే సలహా కోసం మళ్ళీ ఇదే కాలమ్ కి రాసి పంపించండి.

డబ్బు కూడబెట్టడం ఎలా? అని బేతాళ కథల ద్వారా భలే నేర్పించారు. తరువాత “పైసల పంచతంత్రం” రాస్తారా?

మీరు సూచించిన పేరు భలే వుంది. బేతాళ కథల్లో చెప్పినా, పంచతంత్రంలో చెప్పినా విషయం అదే కదండీ! అయినా మీరు అడిగారు కాబట్టి ఓ పంచతంత్రం కథ చెప్తాను వినండి. ఓ అడవిలో ఒక జిరాఫి, ఒక చీమ, ఒక జీబ్రా వున్నాయి. జిరాఫి పుట్టిన కొన్ని నిముషాలలోనే లేచి నిలబడి తనంతట తానుగా ఆకులు తినేస్తుంది. చీమ జీవితాంతం ఆహారం సేకరింస్తూనే వుంటుంది. జీబ్రా దొరికినదంతా తినేసి, పొట్టలో వున్న మరో సంచిలో దాచిపెట్టుకోని అవసరం అయినప్పుడు తీసి నెమరువేస్తుంది.డబ్బు విషయంలో మనం కూడా ఈ మూడు జంతువుల్లాగా ప్రవర్తించాలి. జిరాఫీలాగా చిన్నప్పుడే పొదుపు చేయడం మొదలుపెట్టాలి. చీమలాగా సంపాదన వున్నంతకాలం దాచిపెడుతూనే వుండాలి. ఇక జీబ్రాలాగా అవసరం వచ్చినప్పుడే దాచుకున్న డబ్బుని తీసి వాడుకోవాలి. అదీ కథ! ఎలా వుందంటారు?

No comments:

Post a Comment