అంతా పసిడిమయం
మన
దేశంలో ముఖ్యంగా దక్షిణభారతంలో బంగారం లేని ఇల్లు అంటూ వుండదు. పండగలప్పుడు, వేడుకలలో
బంగారం తళుక్కుమనకపోతే ఆ పండగ పండగేకాదు, ఆ వేడుక వేడుకే కాదు. బంగారు నగల పైన మనకున్న
మోజును పక్కనపెడితే, చాలామంది బంగారాన్ని ఒక పెట్టుబడిగా కూడా కొంటుంటారు. అయితే ఇందులో
ఒక తిరకాసు వుంది. బంగారాన్ని ఆభరణంగా కొన్నప్పుడు దాని మీద మనం పెట్టే ఖర్చులో బంగారం
విలువతో పాటు మజూరీ, వేస్టేజ్ రూపంలో మరికొంత అదనంగా చెల్లిస్తాం. అదే ఆభరణాన్ని తిరిగి
అమ్మాలని వెళ్ళినప్పుడు తరుగు వగైరా మినహాయించుకోని మిగిలిన విలువనే తిరిగి పొందుతాం.
అంటే ఒక బంగారు నగను కొన్న మరుక్షణం దాని విలువ పదిపోతుంది. అందుకే ఆభరణంగా కొన్న బంగారం,
ఖర్చే తప్ప పెట్టుబడి కాదు అని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. (బిస్కెట్ల రూపంలోనో,
నాణాల రూపంలోనో కొన్న బంగారానికి కొంతవరకు పెట్టుబడి లక్షణం వుంటుంది.) అదీకాక ఒకసారి
నగలు కొన్న తరువాత మరీ అవసరమైతే తాకట్టు పెడతాం తప్ప దానిని అమ్ముకోడానికి సిద్ధపడము.
అందువల్ల మన ఇళ్ళలో వుండే టీవీలాగానో, ఫ్రిజ్ లాగానో బంగారం ఆభరణం కూడా ఒక వస్తువులా
మిగిలిపోతుంది. అందుకే నగలరూపంలో కొన్న బంగారం పెట్టుబడి కాదని (Dead investment) చెప్తారు.
ఈ
పరిస్థితిలో కొంత మార్పు తీసుకొచ్చే ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.
“గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్” (బంగారం నగదీకరణ పథకం / బంగారాన్ని నగదుగా మార్చే పథకం)
పేరుతో ఈ పథకం త్వరలో మన ముందుకు రాబోతోంది. ఈ పథకం విధి విధానాలను వివరించే పత్రాన్ని
ప్రభుత్వం విడుదల చేసింది. నిజానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇలాంటి పథకం ఒకటి రాబోతోందని
ఈ సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించారు. “ఈ కొత్త పథకం ద్వారా ఖాతాదారులు బంగారు
ఖాతా ద్వారా వడ్డీ పొందవచ్చు, నగల వ్యాపారులు బాంకు నుంచి అప్పుగా బంగారాన్ని తీసుకోవచ్చు”
అని స్థూలంగా అప్పుడే వెల్లడించారు. ఇప్పుడు మరికొంత వివరంగా ఆ పథకం గురించిన ప్రకటన
వెలువడింది.
అసలు ఎందుకిదంతా?
సుమారు
ఇరవై వేల టన్నుల బంగారం మన దేశంలోనే వుంది (అంటే ప్రస్తుత విలువ ప్రకారం అరవై లక్షల
కోట్లు). ప్రతి సంవత్సరం దేశంలో బంగారం వినియోగం పెరుగుతూనే వుంది. కేవలం నగలకోసంమే
కాక కొన్ని కర్మాగారాలలో ముడిసరుకుగా, మందుల తయారిలో ఇంకా అనేక పరిశోధనల్లో బంగారాన్ని
వాడాల్సి వుంటుంది. ఇంత బంగారం మన దేశ గనుల్లో ఉత్పత్తి కాదు కాబట్టి సంవత్సరానికి
సుమారు వెయ్యి టన్నుల బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఒక వైపు ఎంతో బంగారం
నగల రూపంలో, బిస్కెట్ల రూపంలో మన ఇంట్లో, బాంకు లాకర్లలో పడి మూలుగుతుంటే, మరో వైపు
టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాము. దీనిని సరిదిద్దే ఆలోచనే ఈ పథకం.
ఒకసారి ఈ పథకం అమలులోకి వస్తే ప్రపంచంలోనే ఇలాంటి ఆలోచన చేసిన మొదటి దేశం మనదేశమే అవుతుంది.
ఎలా పని చేస్తుంది?
ప్రస్తుతం
ప్రభుత్వం విడుదల చేసిన విధానాలలో ఈ పథకం ఎలా పనిచేస్తుందో వివరంగా వుంది. ఈ
పథకాన్ని వాడాలనుకున్న వ్యక్తి లేదా సంస్థ తమ దగ్గర వున్న బంగారాన్ని (కనీసం 30 గ్రా అంటే సుమారు
మూడున్నర సవర్లు) ప్రభుత్వం నిర్థారించిన వెరిఫికేషన్ సెంటర్ లో ఇవ్వాలి. వాళ్ళు ఆ
బంగారం విలువని పరీక్షించి ఆ వివరాలతో ఒక సర్టిఫికేట్ ఇస్తారు.
వెరిఫికేషన్
సెంటర్ ఇచ్చిన సర్టిఫికేట్ ని బ్యాంకులో ఇచ్చి ఎకౌంట్ ప్రారభించవచ్చు. సర్టిఫికేట్
లో వున్న బంగారం విలువ ఈ ఎకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. వడ్డీ డబ్బు రూపంలో కాకుండా
బంగారం రూపంలో లభిస్తుంది. ఉదాహరణకు వంద గ్రాముల బంగారం డిపాజిట్ చేస్తే, వడ్డీ ఒక
శాతం అయితే బంగారం విలువ నూటొక్క గ్రాము అవుతుంది.
ఇలా
బంగారం విలువకు వడ్డీని జోడిస్తూ వెళ్తారు. డిపాజిట్ చేసిన 30 రోజుల తరువాత నుంచి ఎప్పుడైనా
ఈ డిపాజిట్ వెనక్కి తీసుకోవచ్చు. బంగారంగా కావాలంటే బంగారం రూపంలో, డబ్బుగా కావాలంటే
డబ్బు రూపంలో వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఏ రూపంలో తీసుకోవాలనుకుంటున్నారో డిపాజిట్
చేసినప్పుడే చెప్పాల్సివుంటుంది.
మరోవైపు
వెరిఫికేషన్ సెంటర్లో సేకరించిన బంగారాన్ని రిఫైనరీలో కరిగించి బంగారం బార్లగా తయారు
చేస్తారు. వీటిని ప్రభుత్వ అధీనంలో వున్న లాకర్లలో వుంచుతారు. వీటిపైన అధికారం బ్యాంకుకే
వుంటుంది. ఈ బంగారాన్ని నగల వ్యాపారులకు అప్పుగా ఇవ్వచ్చు. వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్
తీసుకోని బంగారం కొనుక్కునే బదులు నేరుగా బంగారాన్నే తీసుకోని ఆ విలువ ప్రకారం వడ్డీ
కట్టుకోవచ్చు.
డిపాజిట్
చేసిన బంగారంపై వడ్డీ ఎంత ఇవ్వాలో, అప్పుగా ఇచ్చిన బంగారంపైన ఎంత వడ్డీ తీసుకోవాలో
బ్యాంక్ నిర్ణయించుకుంటుంది. ఒకవేళ ఆ బంగారాన్ని నగల వ్యాపారులకు ఇవ్వనట్లైతే దాన్ని
CRR, SLR గా చూపించుకునే అవకాశం వుంటుంది. (మన దగ్గర తీసుకున్న డిపాజిట్ డబ్బులో కొంత
శాతాన్ని బ్యాంక్ తమ దగ్గరే వుంచుకోవాలి. కొంత డబ్బుని ప్రభుత్వ బాండ్లలో పెట్టాలి.
వీటినే CRR, SLR అంటారు)
ఎవరెవరికి ఉపయోగం?
ముందు
వినియోగదారులుగా మనకి వచ్చే ప్రయోజనం గమనిద్దాం. – మన దగ్గర కొంత బంగారం వుంది. ఇది
ముందే చెప్పినట్లు ఇంట్లో ఒక టీవీలాగ, ఫ్రిజ్ లాగా ఒక వస్తువుగా వుండిపోయిందే తప్ప
దాని వల్ల మనకి వస్తున్న లాభమంటూ ఏమీ లేదు. బంగారం ధర పెరుగుతుందని అనుకున్నా, అది
మొదట మనం కట్టిన ఎక్కువ డబ్బు (మజూరి, వేస్టేజ్ వగైరా), అమ్మేటప్పుడు నష్టపోయే డబ్బుతో
కలిపి చూసుకుంటే పెద్ద లాభం కనిపించదు. మరీ విచిత్రమేమిటంటే అదే బంగారాన్ని మనం బాంక్
లాకర్లో పెట్టి, అదనంగా లాకర్ చార్జీలు కడుతుంటాము. మనం పెట్టిన డబ్బుమీద కొంతైనా లాభం
తెచ్చిపెడితేనే దాన్ని మనం పెట్టుబడి అనాలి. అలా చూస్తే బంగారం మనకి లాభాన్ని తెచ్చిపెట్టకపోగా,
మన చేత ఇంకా ఖర్చు పెట్టిస్తోంది. ఇప్పుడు ఈ విధానం వల్ల మన దగ్గర వున్న బంగారానికి
వడ్డీ కూడా లభిస్తుంది. అంతే కాకుండా ఈ వడ్డీ మీద పన్ను రాయితీ కూడా ఇచ్చే అవకాశం కూడా
వుంది.
రెండో
వైపు వున్నది నగల వ్యాపారులు. వీరు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న బంగారాన్ని కొనుక్కుంటున్నారు.
ఈ బంగారాన్ని నగల రూపంలోకో, నాణాల రూపంలోకో మార్చడానికి అదనంగా కొంత ఖర్చు అవుతుంది.
ఆ తరువాత ఆ ఆభరణం అమ్ముడయ్యేదాకా అది వారి షోరూమ్ లోనే వుంటుంది. అంటే అప్పటిదాకా ఆ
నగ తయారికి పెట్టిన ఖర్చంతా వెనక్కి రాని పెట్టుబడిలా వుండిపోతుంది. ఆదాయం లేకపోగా,
ఆలస్యమైతే నష్టం వచ్చే పరిస్థితులు ఇప్పటిదాకా వున్నాయి. ఈ పథకం ప్రకారం బాంకు నుంచి
నేరుగా బంగారాన్నే అప్పుగా తీసుకోవటం వల్ల వాళ్ళకు కొంత కలిసొస్తుంది. ఈ పథకం విజయవంతం
అయితే బంగారం దిగుమతి కూడా తగ్గిపోతుంది. అంటే మరి కాస్త ఖర్చు తగ్గినట్లే కదా? ఫలితంగా
బంగారం ధర కిందకు దిగే అవకాశం వుంది. బ్యాంక్ వేసే వడ్డీ మరీ ఎక్కువగా లేకపోతే ఖచ్చితంగా
బంగారం ధర తగ్గే అవకాశం వుంది.
మూడొవది
బ్యాంకులు. వీళ్ళు సామాన్యంగా డిపాజిట్ల పైన తక్కువ వడ్డీ ఇస్తూ, ఇచ్చిన అప్పుల మీద
ఎక్కువ వడ్డీ తీసుకుంటూ వుంటారు. ఈ రెండు వడ్డీలలో వ్యత్యాసమే బ్యాంక్ కి మిగిలే లాభం.
ఇప్పుడు డబ్బు బదులు బంగారాన్ని వాడి కూడా ఇదే విధంగా లాభాలు సంపాదించవచ్చు. మనం పెట్టిన
బంగారం పైన తక్కువ వడ్డీ ఇస్తూ, నగల వ్యాపారికి ఎక్కువ వడ్డీకి అప్పు ఇవ్వడం ద్వారా
లాభాలు సంపాదించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటిదాకా డబ్బుల రూపంలో జరుగుతున్న
లావాదేవీలకు ఇవి అదనంగా జరుగుతాయి. మరోలా చెప్పాలంటే బంగారం రూపంలో కొత్తరకం డబ్బు
వచ్చినట్లే. అందువల్ల బ్యాంక్ మాత్రమే కాకుండా మొత్తం ఎకానమీ మొత్తం లాభపడే అవకాశం
వుంది.
అంతా మంచికేనా?
అంతా
మంచికే అని చెప్పలేము. ఇలాంటి పథకం మనకి కొత్తేమీ కాదు. 1999 గోల్డ్ డిపాజిట్ స్కీమ్
లాంటిదే ఇది కూడా. అది అంతగా విజయవంతం కాలేదు. అందుకు ప్రధానకారణం బంగారం అంటే ప్రజలలో
వుండే సెంటిమెంట్, వ్యామోహం. నగలు అవసరానికి తాకట్టి పెట్టడం వేరు, డిపాజిట్ గా ఇవ్వటం
వేరు. తాకట్టు పెట్టినప్పుడు నగ రూపం మారదు. కానీ, ఇప్పుడు ప్రతిపాదించిన పథకం ప్రకారం
నగను తీసుకోగానే కరిగించేస్తారు. ఇది సామాన్య ప్రజలు ఎట్టిపరిస్థితిలోనూ జీర్ణించుకోలేని
విషయం. మన బంగారం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి అందుతూ వచ్చే ఆస్థి. మనకి బంగారం అంటే
స్టేటస్ సింబల్. అలాంటి బంగారాన్ని కరగించి డిపాజిట్ గా మార్చుకోడానికి ఒప్పుకుంటారా
అనేది వేచి చూడాలి.
బంగారం
నగల రూపంలో కన్నా బిస్కెట్ రూపంలోనో, నాణాల రూపంలో వుంచుకున్న వాళ్ళకు ఈ పథకం బాగా
ఉపయోగపడుతుంది. అదే నిజమైతే చాలామంది బంగారం
రూపంలో దాచుకున్న నల్లధనాన్ని బయటకు తీయవచ్చు. ఎంత వరకు బంగారాన్ని డిపాజిట్ చేయవచ్చు?
వాటి విలువ మరీ ఎక్కువగా వుంటే ఆదాయపన్ను శాఖ ఎలా వ్యవహరిస్తుంది? అన్న వివరాలు ప్రస్తుతానికి
లేవు.
ఓకే బంగారం
ఇది
ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ప్రతిపాదన మాత్రమే. పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్లలో
ప్రకటించారు. జూన్ 2 లోగా ఈ పథకం గురించి ప్రజలు/సంస్థలు తమ తమ అభిప్రాయాలు చెప్పే
వీలుంది. అవన్నీ పరిగణించి, మార్పులేమైనా వుంటే వాటిని చేసిన తరువాతే ఈ పథకం అమలులోకి
వస్తుంది.
ఏది
ఏమైనా ఈ పథకం వల్ల సామాన్య ప్రజలకు బంగారం మీద వ్యామోహం తగ్గే అవకాశం వుంది. నగల రూపంలో
బంగారం dead investment అనుకునేవాళ్ళకి అది లాభాలను ఇచ్చే పెట్టుబడిగా మారబోతోంది.
బంగారంతో ఒక కరెన్సీలా పరిమితమైన లావాదేవీలు జరగబోతున్నాయి. దీని ఫలితాలు ఎలా వున్నా
బంగారం కొత్త రూపాన్ని చూడబోతున్నాం. ఈ కొత్త రూపం మనకి ఆనందాన్ని ఇస్తుందా? లేక బంగారం
మనిషి వ్యామోహం మీద తన ఆధిపత్యాన్ని సాధిస్తుందా? వేచి చూద్దాం… ఓకేనా బంగారం?
(ఆంధ్రభూమి వారపత్రిక ప్రత్యేక వ్యాసం)
No comments:
Post a Comment