Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, July 5, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 3


గత ఆర్థిక సంవత్సరానికి గాను బోనస్ వచ్చే నెల వస్తోంది. ఆ డబ్బుతో ఏం చేస్తే బాగుంటుందో సలహా చెప్తావా బేతాళా?

తప్పకుండా. బోనస్ లాగా అనుకోకుండా వచ్చే డబ్బుని తెలివిగా దాచుకుంటే మీ ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. డబ్బు చేతికి రాగానే అన్నింటి కన్నా ముంది మీకు వున్న అప్పులు మొత్తం తీర్చేయండి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ వుంటే వాటిని వదిలించుకోండి. అప్పులు లేకపోతే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. ఇన్సూరెన్స్ లేకపోతే సరిపడా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ మూడూ అయిపోతే, మీకు ఇల్లు కట్టాలి/కొనాలి అన్న ఆలోచన వుంటే డౌన్ పేమెంట్ కట్టేయండి. కొంత బంగారం కొన్నా మంచిదే. మొత్తం ఒకేసారి స్టాక్ మార్కెట్లో పెట్టడం, అంతా బంగారమే కొనడం చేయకండి. కారు కొనాలని వుంటే ఈ సొమ్ముని డౌన్ పేమెంట్ గా కట్టేయండి. ఇదే వరుసలో బోనస్ ని ఉపయోగించండి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా బోనస్ వచ్చేలా కష్టపడండి.

నాలుగు సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం సుమారు పన్నెండు వేలు కడుతున్నాను. ఒక్కసారి కూడా క్లెయిమ్ చెయ్యలేదు. ఇన్సూరెన్స్ తీసుకునే బదులు ఏ మ్యూచువల్ ఫండ్ లోనో పెడితే వచ్చే ఆదాయం, అవసరమైనప్పుడు హాస్పిటల్ ఖర్చులకి వాడుకోవచ్చు కదా?

మీ వయసు చెప్పలేదు. పన్నెండొందలు కడుతున్నారంటే మీ కుటుంబం మొత్తానికీ హెల్త్ పాలసీ (మెడీక్లెయిమ్) తీసుకోని వుంటారని ఊహిస్తున్నాను. నాలుగేళ్ళుగా ఒక్కసారి కూడా క్లెయిమ్ చెయ్యలేదంటే, ఒక్కసారి కూడా హాస్పిటల్ లో అడ్మిట్ కాలేదన్నమాట. ఇది సంతోషించాల్సిన విషయమే కదా? ఇన్సూరెన్స్ ప్రీమియమ్ కట్టేటప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు తిరిగి రాకూడదనే కోరుకోవాలి. అవి వచ్చాయంటే మీకు ఏదో నష్టం జరిగిందనే కదా అర్థం. ఇక మీరడిగిన రెండో ప్రశ్న. క్లెయిమ్ లేనంత మాత్రాన మీకు ఏ ఉపయోగం లేదని అనుకోకూడదు. మీరు క్లెయిమ్ చెయ్యకపోవడం వల్ల మీరు ఆరోగ్యవంతమైన కుటుంబం అని ఇన్సూరెన్స్ కంపెనీ గుర్తిస్తుంది. తదనుగుణంగా ప్రీమియం రేట్లు తగ్గుతాయి. మీరు మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెట్టాచ్చు కానీ, ఈక్విటీ ఆధారిత పెట్టుబడిలో రిస్క్ వుంటుంది. దీర్ఘకాలం డబ్బుని ఉంచితేనే లాభం వస్తుంది. ఈలోగా అనారోగ్యం వస్తే? లేదూ హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజే స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే? ఈక్విటీ పెట్టుబడి వేరు, అత్యవసరానికి పనికొచ్చే ఇన్సూరెన్స్ వేరు. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు వార్థక్యం వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఎవరూ ఇవ్వరు. ఇచ్చినా దాని ప్రీమియం చాలా ఎక్కువగా వుంటుంది. అదీకాక హెల్త్ ఇన్సూరెన్స్ కి కట్టిన ప్రీమియం సెక్షన్ 80D కింద ఆదాయపు పన్ను రాయితీ కూడా లభిస్తుంది. అందువల్ల యుక్త వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోని జీవితాంతం కొనసాగించడం మంచిది.

చాలా రోజుల నుంచి కుటుంబం మొత్తం కలిసి సరదాగా విదేశీయాత్ర చేయాలని అనుకుంటున్నాము. అందుకు తగ్గట్టుగా నెల నెలా కొంత డబ్బు పక్కనపెట్టాలని ఆలోచన. ఎక్కడ పొదుపు చేస్తే మంచిదో చెప్తారా?

మీ ఆదాయాన్ని బట్టి విదేశీయాత్ర షార్ట్ టర్మ్ గోల్ లేదా మీడియం టర్మ్ గోల్ కిందకు వస్తుంది. అంటే సుమారుగా సంవత్సరం లేదా మూడు సంవత్సరాలలో నెరవేర్చుకోవాల్సిన కోరిక. అందువల్ల డబ్బుని లిక్విడిటీ వున్న మార్కెట్ ఆధారితం కాని పథకాలలో పెట్టడం మంచిది. అంటే రికరింగ్ డిపాజిట్, తక్కువ కాలానికి మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ ఇలాంటివన్నమాట. కానీ అసలు సమస్య అది కాదు. మీరు ఫారిన్ టూర్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? కుటుంబంతో కలిసి సరదాగా గడపాలనే కదా? అందుకు విదేశాలకే వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? చాలాసార్లు మీరు పెట్టే ఖర్చు వల్ల ఆనందం రాదు. మీరు పెట్టిన ఖర్చు వల్ల కుటుంబం సంతోషంగా వున్నప్పుడే మీకు ఆనందం కలుగుతుంది. అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు కొత్త ప్రదేశాన్ని చూశామన్న ఆనందం మీ భార్యా పిల్లలకు కలిగినప్పుడే మీకు ఆనందం కలుగుతుంది. అదే నిజమైతే విదేశాలకే వెళ్ళాలని నియమం ఏమీ లేదు కదా? మన దేశంలోనే ఎన్నో ఆహ్లాదకరమైన ప్రదేశాలు వున్నాయి. విహారానికి మీరు స్విజర్లాండ్ వెళ్ళినా సిమ్లా వెళ్ళినా ఆనందంలో పెద్ద తేడా రాదు. తక్కువ చార్జీల కారణంగా మిగిలిన డబ్బుని అక్కడ ఖర్చు చేయటం వల్ల ఇంకా ఎక్కువ ఆనందాన్ని అనుభవించవచ్చేమో గమనించండి.

మనిషి తయారు చేసిన డబ్బు మనిషినే ఆడిస్తోంది. డబ్బుకి ఇంత విలువ ఇవ్వటం అవసరం అంటారా?

అవసరం లేదు. కానీ మీ చుట్టుపక్కల వున్న వాళ్ళు మీకు విలువ ఇవ్వటం మానేస్తే మీకు ఫర్లేదా? మరొకరు కోట్లకు కోట్లు సంపాదిస్తుంటే మీరు అసూయ చందకుండా వుండగలరా? డబ్బు లేని కారణంగా కోరికలు తీరటంలేదని బాధపడకుండా వుండగలరా? అనారోగ్యమో, ప్రమాదమో, అత్యవసరమో వచ్చినప్పుడు చేతిలో డబ్బు లేకుండా దాన్ని దాటేయగలరా? ఇలాంటి వాటికి అతీతంగా మీరు ఉండగలిగితే డబ్బుని తుఛ్ఛమైనదిగా భావించి తిరస్కరించవచ్చు. అక్కడికి చేరటం కూడా ఒక యోగమే.

మీ కథలన్నింటినీ కలిపి మూడు ముక్కల్లో చెప్పాలంటే....

సంపాదించే ప్రతి రూపాయికి ఒక పరమార్థం వుండాలి. ప్రతి ఖర్చుకి ఒక లెక్క వుండాలి. ప్రతి పెట్టుబడికి ఒక లక్ష్యం వుండాలి.

No comments:

Post a Comment