మా ఆయనకు ఒకటే డబ్బు పిచ్చి.
మీరు రాసిన కథలు చదివాక ఆ పిచ్చి ఇంకా ముదిరింది. ఒక సరదా లేదు, ఒక సంతోషం లేదు...
అమ్మో!! అంటే తప్పంతా నా మీదకు నెట్టేస్తున్నారా?
డబ్బు ఖర్చు పెట్టకూడదని నేను ఎప్పుడూ చెప్పలేదండీ! సరదా, సుఖం, సంతోషం సాధించలేని
డబ్బు వున్నా వృధాయే. ఈ రోజు కడుపు మాడ్చుకోని రేపటికి దాచుకోవడం అవివేకం. ప్రముఖ
హాస్య నటుడు రేలంగిగారు అనేవారట – “రాళ్ళని కూడా అరాయించుకునే రోజుల్లో డబ్బులు
వుండేవి కావు, ఇప్పుడు డబ్బులున్నాయి కానీ మరమరాలు కూడా అరగట్లేదు” అని. రేపటి
సుఖం కోసం డబ్బు దాచుకోమని సలహా ఇస్తున్నానే తప్ప ఈ రోజు సుఖాన్ని వదులుకోమని
చెప్పటం లేదు. సరే, అదలా వుంచి మీ సమస్యకు పరిష్కారం ఆలోచిద్దాం. కుటుంబం అంతా
కలిసి చేస్తేనే సంపద సాధ్యమౌతుంది. ఆ విషయం మీ వారికి చెప్పండి. ఏ ఆర్థిక ప్రణాలిక
అయినా, ఖర్చు అయినా ఇద్దరూ కలిసి చర్చించుకున్న తరువాతే జరగాలని నియమం పెట్టండి.
వృధా ఖర్చులను ఆపడంలో మీరు సహాయం చేయండి. కుటుంబం ఆనందం కోసం పెట్టాల్సిన ఖర్చులను
మీ చేతిలోకి తీసుకోని, ఖర్చుపెట్టండి. అలాగే ఆయన ఆదా చేసే పథకాల గురించి కూడా
తెలుసుకోని వాటి అవసరాన్ని గుర్తించండి. సంసారమైన, సంపద సాధన అయినా భార్యాభర్తల
అన్యోన్యతతోనే సాధ్యమౌతుంది.
రూపీబేతాళా, నేను గత రెండు సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్
చేశాను. నేను కొన్న షేర్లు అన్నీ బాగా పెరిగి నాకు లాభాలనే ఇచ్చాయి. దాదాపు
ఎప్పుడూ నా అంచనాలు తప్పలేదు. ఇప్పుడు బ్యాంక్ నుంచి కొంత డబ్బు లోన్ తీసుకోని మరీ
మార్కెట్ లో పెట్టాలని అనుకుంటున్నాను. మీలాగే నేను కూడా స్టాక్ మార్కెట్ లో
డబ్బులు ఎలా సంపాదించవచ్చో నేను కూడా సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను.
మీరు చెప్పినదాని ప్రకారం స్టాక్ మార్కెట్ వల్ల డబ్బులు ఎలా నష్టపోవచ్చో
చెప్పగలరు అనిపిస్తోంది. గత కొంతకాలంగా సెన్సెక్స్ పెరుగుతూ వస్తోంది. అందువల్ల
లాభాలు రావటం సహజం. దాన్ని చూసుకోని స్టాక్ మార్కెట్ గురించి మొత్తం తెలిసిపోయింది
అనుకోవడం భ్రమ. ఇప్పుడు మీరు బ్యాంక్ వడ్డీకి డబ్బులు తెచ్చి పెడతానంటున్నారు.
పర్సనల్ లోన్ పైన ప్రస్తుతం బ్యాంకులు పధ్నాలుగు నుంచి పద్దెనిమిది శాతం వడ్డీ
వేస్తున్నాయి. అంటే స్టాక్ మార్కెట్ లో మీరు అంతకన్నా ఎక్కువ లాభాలు సంపాదించాలి.
అది నిజంగా సాధ్యమయ్యే పనేనా? అందులోనూ మీరు ట్రేడింగ్ చేస్తున్నారు. ఒక్క పొరపాటు
చేసినా మొత్తం డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ తరువాత తెచ్చిన అప్పుకు ఈ.ఎమ్.ఐ లు
కట్టాలని మర్చిపోకండి. పూర్తి అవగాహన లేకుండా నేరుగా స్టాక్ మార్కెట్ లో డబ్బు
పెట్టడం ఒక తప్పు. అప్పు తెచ్చిన డబ్బు పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పటికి
సంపాదించిన డబ్బును (కనీసం లాభాన్నైనా) తీసి మ్యూచువల్ ఫండ్ మార్గంలో వెళ్ళండి.
దీర్ఘకాల ముదుపు మాత్రమే లాభాలను ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. రోజూ స్టాక్
మార్కెట్ లో మీరు చేస్తున్నది ముదుపు కాదు, కాస్త కాలిక్యులేటెడ్ జూదం మాత్రమే.
మొన్ననే కొడుకు పుట్టాడు. వాడు పెద్దయ్యేసరికి వాడికంటూ ఒక ఇల్లు వుండాలి.
అందుకే హోమ్ లోన్ పెట్టి ఇల్లు కొనాలనుకుంటున్నాను.
పిల్లల కోసం ఆస్థి సంపాదించడం అంత మంచి ఆలోచన కాదు. మీ కోసం కావాలంటే కొనుక్కోండి. మీరు కొన్న ఇంట్లో మీ అబ్బాయి వుంటాడని మీరు ఎలా అనుకుంటున్నారు. మీ నాన్నగారు వున్న ఇంట్లో మీరు వుంటున్నారా? ఇంతకు ముందు తరం పల్లెల నుంచి పట్టణాలకు వచ్చారు, ఈ తరంలో అంతా రాజధానుల వైపే వెళ్తున్నారు. రాబోయే తరం ఈ దేశంలో వుంటుందో లేదో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు వాళ్ళు అనుభవించాలని ఇళ్ళు, స్థలాలు కొనడం సమంజసం కాదేమో ఆలోచించండి. అప్పుడు అవసరం అయితే ఆ ఇంటిని అమ్ముకోని ఆ డబ్బుతో వాళ్ళకు నచ్చిన చోట కొనుక్కుంటారు అని మీరు అనచ్చు. ఇళ్ళు అమ్ముకోవడం అంత సులభం కాదు. అందుకు సెంటుమెంటు నుంచి రియల్ ఎస్టేట్ ఒడిదుడుకుల దాకా ఎన్నో అవాంతరాలు వుంటాయి. అలాంటి పెట్టుబడి కోసం హోమ్ లోన్ కూడా చేయల్సి వస్తే అది
ఇంకా ఇబ్బందికరం. దాని కన్నా మీరు తీసుకోవాలనుకుంటున్న
లోన్ ఈ.ఎమ్.ఐ ఎంతౌతుందో అంత వేరే చోట ఇన్వెస్ట్ చేయండి. మీ అబ్బాయి ఇల్లు
కొనాలనుకునే నాటికి కొన్ని కోట్లు సేకరించి ఇవ్వచ్చు. ముందే ఇల్లు కొంటే దాని విలువ ఇంత పెరుగకపోవచ్చు.
మార్కెట్ పడిపోతుందని,
ఇప్పట్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు వస్తాయని, కనీసం ఇంకో ఆరు నెలలు ఆగితే మంచిదని నా
స్నేహితుడు అంటున్నాడు. మీరేమంటారు?
మీరు ఆరు నెలల తరువాత డబ్బులు పెడితే మార్కెట్ పడిపోదని ఆయన గ్యారంటీ ఇస్తారేమో
కనుక్కోండి. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పడిపోతుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ
అలా తెలుసుకోగలిగిన వ్యక్తి వుంటే అతను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిపోయేవాడు.
మార్కెట్లో రేటు తక్కువలో వున్న సమయం కనిపెట్టి పెట్టుబడి సరిగ్గా అదే సమయానికి పెట్టి,
మళ్ళీ మార్కెట్ పూర్తిగా పెరిగిన సందర్భాన్ని గుర్తుపట్టి అమ్మేసుకోవడం దాదాపు అసాధ్యమైన
పని. అసలు విషయం వినండి - మార్కెట్ లో నేరుగా షేర్లు కొని, డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి
మార్కెట్ పడిపోతే నష్టం వస్తుంది కానీ దీర్ఘకాలిక పెట్టుబడి, (ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్
SIP ద్వారా) పెట్టినవాళ్ళని మార్కెట్ ఒడిదుడుకులు దాదాపుగా ఏమీ చెయ్యలేవు. కనీసం పది
సంవత్సరాలపాటు పెట్టుబడి పెట్టేట్లైతే మార్కెట్ పడుతుందా లేస్తుందా అని ఆలోచించకండి.
అనవసరం. ట్రేడింగ్ కోసం మార్కెట్ లో డబ్బు పెట్టి మార్కెట్ పడుతుందా లేస్తుందా తెలుసుకోవాలని
అనుకోకండి. అది అసాధ్యం.