Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, September 6, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 11

ఇప్పుడున్న పరిస్థితిలో ముదుపరులు ఎలాంటి పెట్టుబడి వ్యూహం అనుసరించాలి?

ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే? రెండు రోజుల క్రితం వరకు స్టాక్ మార్కెట్ లాభాల బాటలో వుంది. ఎక్కడో గ్రీసు దేశంలో జరిగిన సంఘటనల కారణంగా నిన్న మార్కెట్ పడిపోయింది. మళ్ళీ ఈ రోజు కోలుకుంది. మీరు ఈ సమాధానం చదివేటప్పటికి ఎలా వుంటుందో చెప్పలేను. చెప్పొచ్చేదేమిటంటే, స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి చేసే ముదుపు ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడి అయ్యుండాలి. ఒక్కరోజులో లాభాలు వస్తాయని పెట్టినా రెండు నెలల్లో షేర్ వాల్యూ పెరిగుతుందని నమ్మినా నష్టపోయే అవకాశం ఎక్కువ. ఏ పరిస్థితిలోనైనా దీర్ఘకాలిక పెట్టుబడి మాత్రమే చెప్పతగిన వ్యూహం.

నేను కొన్న మ్యూచువల్ ఫండ్స్ రెండేళ్ళలో రెట్టింపు కన్నా ఎక్కువయ్యాయి. ఇంత లాభం వస్తున్నప్పుడు నేను ఆదా చేసే డబ్బు మొత్తం ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లోనే పెట్టచ్చు కదా?

పెట్టకూడదు. ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కొన్న మ్యూచువల్ ఫండ్స్ విలువ పెరిగింది. అంతే కానీ లాభం రాలేదు. మీరు ఆ ఫండ్స్ లో వున్న సొమ్మును వెనక్కి తీసుకున్నప్పుడే లాభమో నష్టమో వస్తుంది. ఉదాహరణకి మీరు కొన్నవి టాక్స్ సేవింగ్ ఫండ్స్ అయితే, వాటికి లాకిన్ పిరియడ్ వుంటుంది. సాధారణంగా మూడేళ్ళు. మీరు రెండు సంవత్సరాల క్రితం పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. అంటే మరో సంవత్సరం డబ్బులు అందులో పెడతారు. మీరు ఆఖరుగా పెట్టుబడి పెట్టిన వాయిదా నుంచి మూడేళ్ళకు మాత్రమే మీ డబ్బు పూర్తిగా వెనక్కి తీసుకోగలుగుతారు. అప్పటి మార్కెట్ పరిస్థితిని బట్టి మీరు ఎంత లాభపడతారో తెలియదు. అలాంటప్పుడు ఇంకా అలాంటి పథకాలలోనే డబ్బు పెట్టడం సరికాదు. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలాగూ పెట్టారు కాబట్టి, కొంత ఫిక్స్ డ్ డిపాజిట్లలోనూ, మరి కొంత బంగారం (వీలైతే ఈటీఎఫ్ లేదా కాయిన్స్) లోనూ పెట్టండి. కొంత సొమ్ము మీరు ఎప్పుడూ వాడే బ్యాంక్ లో కాకుండా, వేరే బ్యాంక్ లో ఎమర్జన్సీ ఫండ్ గా వుంచుకోండి.

నేను ఆర్టీసిలో మెకానిక్ గా పనిచేసి రిటైర్ అయ్యాను. ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన ఐదుగ్గురు విద్యార్థులకు 1116 ఇస్తున్నాను. నా తదుపరి ఈ కార్యక్రమం కొనసాగాలంటే నేను ఏం చెయ్యాలి? (గద్దె రవీంద్రరావు, దుగ్గిరాల)

రవీంద్రరావుగారు మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. అందుకు ముందుగా అభినందనలు. మీలాగే ఎంతో మంది తమ దగ్గర వున్న డబ్బుతో స్వఛ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళ తదనంతరం కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగాలని కోరుకోవటం అరుదుగా జరుగుతుంది. అలా జరగాలంటే చాలా సులభం. మీరు చేస్తున్న పనిని ఒక చట్టాబద్ధమైన సంస్థ ద్వారా చెయ్యండి. మనుషులు మరణించినా సంస్థలు ఉంటాయి. మీరు చేస్తున్నది లాభాపేక్షలేని పని కాబట్టి మీరు సొసైటీస్ ఆక్ట్ కింద సంస్థని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా నమోదు చేయించండి. ఆ సంస్థకి నమ్మకమైన, సేవా భావం వున్న కొంత మంది మిత్రులను ట్రస్టీలుగా ఏర్పాటు చేసుకోండి. మీరు చేసే సేవా కార్యక్రమాలు ఆ సంస్థ ద్వారా చేయండి. మీ తదనంతరం ఈ కార్యక్రమం కొనసాగాలంటే, ఆ సంస్థలో కొంత డబ్బు వుండాలి. అందువల్ల మీతో చేయి కలపడానికి సిద్ధంగా వున్న వ్యక్తులను, సంస్థలను కలిసి కొంత కార్పస్ ఏర్పాటు చేయగలిగితే ఇక మీ తదనంతరం కూడా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే ఎవరైనా ఛార్టెడ్ అకౌంటెంట్ ని కలవండి.


నా మనవరాలు(కూతురి కూతురు) వయస్సు 22 సం|| నిండినవి. పీజీ కోర్సు చేస్తున్నది. తండ్రి లేడు. తల్లి నెలసరి జీతంలో ఒక ఏడువేలు పెట్టుబడి పెట్టగలదు. ఎక్కడ పెట్టుబడి పెడితే మంఛిదో సలహాఇవ్వండి. (పి. అనసూయ, చెన్నై)

అనసూయ గారు, మీ అమ్మాయి వయసు, సంపాదన, ప్రస్తుతం వున్న ఆస్థులు, ఆర్థిక పరిస్థితి మొదలైన వివరాలు ఏమీ తెలియకుండా డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో చెప్పడం కష్టం. అయినా ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పిన వివరాలను బట్టి మీ కూతురు ఆర్థికంగా ఏమంత స్థిరంగా లేదని అర్థం అవుతోంది. పెళ్ళీడుకు వచ్చిన కూతురు వుంది. అందువల్ల చదువుకు సంబంధించిన ఖర్చులు దాదాపు అయిపోయాయి. ఇక మిగిలిన ఏకైక ఖర్చు పెళ్ళి. భర్తలేరు కాబట్టి, ఆమె తన కూతురి వివాహానంతరం బతకడానికి కావాల్సిన ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కూతురు పెళ్ళి అనే స్వల్పకాలిక లక్ష్యం, రిటైర్మెంట్ అనే దీర్ఘకాలిక లక్ష్యం కనపడుతున్నాయి. దీని బట్టి ప్రణాలిక ఇలా వుంటే మంచిది – అన్నింటికన్నా ముందు ఇన్సూరెన్స్. సరిపడా కవరేజ్ లేకపోతే దీంతోనే మొదలుపెట్టాలి. లైఫ్ ఇన్సూరెన్స్ వద్దనుకున్నా ఫర్లేదు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోమనండి. కూతురు పెళ్ళి కోసం నెల నెల అరగ్రాము బంగారు కాసు కొనడం చెయ్యచ్చు. వెయ్యి రెండు వేలు ఏదైనా పెన్షన్ పధకంలో పెట్టడం మంచిది. ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజనలో ప్రస్తుతం ప్రభుత్వం అదనంగా డబ్బులు ఇచ్చే సౌకర్యం వుంది. అది వాడుకోవడం మంచిది. మీ మనవరాలు పెళ్ళి అయ్యేదాకా డబ్బులు లాక్ కాకుండా వుండే పథకాలు –ఆర్ డీ,పోస్టాఫీస్ పథకాలు –వంటివాటిలో పెట్టి, అమ్మాయి పెళ్ళి తరువాత ఫిక్స్ డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్ వంటి పథకాలు మొదలుపెట్టచ్చు.

No comments:

Post a Comment