Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, August 30, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 10

రూపీ బేతాళా, మీ కథలన్నింటినీ ఒక పుస్తకరూపంలోకి తీసుకురావాలి. పజిల్స్ కత్తిరించడంవల్ల కొన్ని కథలు దాచుకోలేకపోయాము.          (వి. శ్రీవిద్య ప్రకాశిత, కాకినాడ)

డిసెంబర్ లోగా పుస్తకరూపంలో తప్పకుండా వస్తుంది. బేతాళ కథలలో వీలైనంత వివరంగా డబ్బుకి సంబంధించిన చాలా విషయాలను వివరించాను. ఇప్పుడు “మనీ మనీ” శీర్షిక ద్వారా ఇంకా చాలా అనుమానాలు మిగిలే వున్నాయని అర్థం అవుతోంది. అవన్నీ జోడించి, వీలైనంత సమగ్రంగా పుస్తకం తీసుకురావాలంటే కొంత కాలం పడుతుంది. ఏమైనా మీ అభిమానానికి కృతజ్ఞతలు.

రిటైర్ అయ్యి, పెన్షన్ తప్ప ఇతర ఏ ఆదాయామూ లేని 65 సం|| పైబడినవారు ఆదాయం టాక్స్ పరిథిలోకి రాకపోయినా ఇన్కంటాక్స్ రిటర్న్ దాఖలు చెయ్యాలా?  (టి. భారతి, రాజమండ్రి)

ఆదాయపన్ను కట్టడం వేరు, రిటర్న్స్ దాఖలు చేయడం వేరు. పన్ను కట్టినా కట్టకపోయినా, ఆదాయం వున్నా లేకపోయినా పాన్ కార్డ్ వుంటే రిటర్న్ దాఖలు చెయ్యాలి. రిటర్న్ దాఖలు చెయ్యడం అంటే మన ఆదాయం గురించి ఆదాయపన్ను శాఖకి తెలియజేయడమే. పన్ను కట్టి వుంటే ఇంత పన్ను కట్టాము అని ఆ వివరాలు (టీడీయస్, ఫార్మ్ 16 వగైరా) అందులో పొందుపరచాలి. ఆదాయం వుండి, పన్నుకట్టాల్సినంత లేకపోతే (Non-Taxable slab) ఆ వివరాలు పొందుపరచాలి. ఆదాయపన్ను స్లాబులు  సీనియర్ సిటిజన్ కి, సూపర్ సీనియర్ సిటిజన్ (80 ఏళ్ళు పైబడినవారు), మహిళలకి వేరుగా వుంటాయి. ప్రస్తుతం సాధారణ వ్యక్తికి రెండున్నర లక్షల వరకు, 60 సం|| దాటిన సీనియర్ సిటిజన్ కి మూడు లక్షల వరకు, సూపర్ సీనియర్ సిటిజన్ కి ఐదులక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు వుంది.

ఒకప్పుడు రాగి, ఇత్తడి, కంచు, వెండి, బంగారం వంటి పంచలోహాలలో లక్ష్మీదేవి చెలామణి అయ్యేది. ఇప్పుడు ఇనుము(స్టీలు) రూపాయి పేరుతో చలామణి అవుతోంది. ఈ రూపాయి రూపం మార్చుకుంటే మీ సలహాలు ఎంతవరకు పనికొస్తాయో కదా?             చాణుక్య, తాడేపల్లిగూడెం

చాణుక్యగారూ, నలభై వారాలు బేతాళకథల పేరుతో ఎన్నో విషయాలు చెప్పాను. కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మరో నలభై వారాలు పడుతుంది. అడిగారు కాబట్టి చాలా స్తూలంగా వివరిస్తాను. రాతి యుగంలో వస్తుమార్పిడి ద్వారా లావాదేవీలు జరిగేవి. అది అన్ని వేళలా కుదరదు కాబట్టి కొన్ని అరుదైన వస్తువులకు విలువని ఆపాదించి, దానిని కరెన్సీగా వాడటం మొదలుపెట్టారు. రాళ్ళు, గవ్వలు, జంతుకొమ్ములు వగైరా క్రమంలో బంగారం వచ్చి చేరింది. నిజానికి ఈ మధ్యకాలం దాకా బంగారం పరోక్షంగా కరెన్సీగానే వుంది. ఒకదేశం విడుదల చేసే కరెన్సీ (నోట్లు లేదా నాణాలు) ఆ దేశం బంగారు నిధులపైన ఆధారపడి వుండేది. అంటే ఎంత బంగారం వుంటే అంత కరెన్సీనే చెలామణిలో వుండేది. ఇప్పుడు పరిస్థితి అలాకాదు. కరెన్సీ వెనుక ఎలాంటి విలువైన లోహమూ లేదు. ముఖ్యంగా డాలర్ విషయంలో అది కేవలం ఒక కాగితమే తప్ప నిజంగా “డాలర్ విలువ” కలిగిన కాగితం కాదు. ఏదైనా ఇప్పుడు ఏదైనా షాపులో వర్తకుడు చిల్లర లేదని చాక్లెట్ ఇస్తే దాన్ని కరెన్సీలా తీసుకుంటున్నారు కదా. అలాగే ఈ కాగితం కూడా చెల్లుబాటు అవుతోంది. ఇలా ఎంత కాలం నడుస్తుంది అంటే అది ఇంకో పెద్ద కథ. అంచేత ఇక్కడే ఆపేస్తున్నాను. ఇక నా సలహాలంటారా, సంపద ఎలా సాధించాలో చెప్పాను కానీ అది కేవలం రూపాయితోనే అని చెప్పలేదు. బంగారం, షేర్లు, భూమి ఇవన్నీ రూపీ రూపాలే కదా!

చెట్ల మీద పెట్టుబడి పెడితే మంచిదా? లేక భూమి మీద పెట్టుబడి పెడితే మంచిదా? (కాళహస్తి వెంకటశేషగిరిరావు, నెల్లూరు)

చెట్లు మీద పెట్టుబడి పెట్టాలంటే అది ఏ చెట్టు? ఆ చెట్టుని పెంచడానికి ఎంత ఖర్చౌతుంది? ఆ చెట్లు పెరిగేకాలంలో ఏ పురుగు పడుతుంది? చెట్టు పెరిగాక దాని వల్ల వచ్చే ఆదాయం ఫలమా, కలపా మరొకటా అన్నది తెలియాలి. వీటన్నింటికీ జ్ఞానమూ, స్వయంగా చేసుకునే సమయమూ, శ్రమపడే లక్షణం వుండాలి. ఇప్పుడు ఇదే సమాధానంలో మరేదైనా ఆర్థిక పథకాన్ని పెట్టి చూడండి. మరేదైనా వ్యాపారం చేర్చి చూడండి. ఏ పథకమైనా, స్కీమ్ అయినా అవగాహన, జ్ఞానము, పెట్టుబడిగా కొంత సమయము, కొంత శ్రమ వుండాలి. ఇవన్నీ వుంటే ఏ పథకంలో పెట్టుబడి పెట్టినా మంచిదే. అవగాహన లేకుండా ఎవరో చెప్పిన మాటలని గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టుబడి పెడితే ఫలితం వుండదు. మీ చెట్టుని మీరే పెంచుకోవాలి. ఇంకెవరో మీ చెట్టుని పెంచి దాని ఫలాలను మీకే తెచ్చి ఇస్తామని చెప్తే ఎలా నమ్మగలం చెప్పండి?


Sunday, August 23, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 9

నా మొదటి జీతం ఏడు వందల యాభై. రిటైరయ్యేనాటికి అరవై వేలు వచ్చేవి. నా కొడుకు మొదటి జీతమే లక్షన్నర. నేను చేసినంత పొదుపు కూడా వాడు చేస్తున్నట్లు లేదు. వాడు ఒక్కడనే కాదు, చాలా మంది ఇలాగే… (మాధవరావు, నెల్లూరు)

మాధవరావుగారూ, మీరు చెప్పిన మాట నిజం. కానీ దీనిని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ప్రపంచీకరణ నుంచి కార్పొరేట్ ధనదాహం దాకా చెప్పాలి. సులభంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే – ఇదే మార్పు. మంచికా చెడుకా అన్న మీమాంస అనవసరం. పరిస్థితి ఎలా వున్నా, కాస్త ఆలోచన వుంటే చాలా సందర్భాలని అనుకూలంగా మార్చుకోవచ్చు. అందువల్ల మార్పు మంచికి జరిగిందా లేదా అన్నది వ్యక్తిగత విషయం అవుతుంది. అయితే ఇక్కడ సమస్య వచ్చేది వ్యక్తుల మీద పడే ప్రభావాల వల్ల. ఇప్పుడు మన చుట్టూ వుండే ప్రపంచం మనల్ని ఖర్చు పెట్టడానికి, అప్పులు చెయ్యడానికి ప్రేరేపిస్తోంది. కార్పొరేట్ పోటీలు కావచ్చు, ఇప్పటి యువత ఆదాయాలు వల్ల కావచ్చు, పెరిగిపోయిన కన్జూమరిజం కావచ్చు ఇంకేన్నో కారణాలు కావచ్చు. ఇదంతా పెద్ద మాయాజాలం. దానిని అర్థం చేసుకోవడం అంత సులభంగా కాదు. ఒకవేళ అర్థం చేసుకున్నా, వాటన్నింటినీ కాదని బ్రతకాలంటే ఎంతో దృఢచిత్తం కావాలి. ఇదంతా జరిగాక, అలా బ్రతకడానికి కుటుంబసభ్యుల (ముఖ్యంగా జీవితభాగస్వామి) సహకారం కావాలి. చెప్పొచ్చేదేమిటంటే, ఇది ఒక ప్రవాహం. దీనిలో పడి కొట్టుకుపోవడమే కానీ, ఎదురీదాలన్న స్పృహ కూడా రాదు. ఒకవేళ వచ్చినా అది చాలా కష్టసాధ్యమైనదనిపిస్తుంది. ఆర్థిక విషయాల గురించి అవగాహన పెంచుకోవడమే మార్గం.

ఈ మధ్య ఒక కంపెనీవాళ్ళు తమ ప్రాడక్ట్ కొంటే ఉచితంగా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తామని ఫోన్ చేశారు. ఇది నమ్మచ్చా? (పద్మ, భోపాల్)

పది లక్షలు అనగానే పెద్ద మొత్తంలా అనిపిస్తుంది. దానికోసం ఏమైనా చేస్తారని, రకరకాల వస్తువులు అమ్మేస్తారు. పది లక్షల ఇన్సూరెన్స్ అంటే ఏంటి?అది జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్సా)? ఆరోగ్య బీమానా? ప్రమాద బీమానా? అన్నింటికన్నా తక్కువ ధరకి దొరికే ఇన్సూరెన్స్ ప్రమాద బీమా. విడిగా తీసుకుంటే కుటుంబం మొత్తానికి పది లక్షల బీమా ఏడెనిమిది వందల్లో దొరుకుతుంది. అదే గ్రూప్ గా తీసుకుంటే, కుటుంబం మొత్తానికి నూటాయభైలోనో ఇంకా తక్కువలోనో దొరికినా దొరకచ్చు. వాళ్ళి ఇస్తామనేది కూడా అదే. ఒక నూటాయాభై ఎర వేసి, మీ చేత వేలకు వేలు ఖర్చుపెట్టిస్తారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఏదీ నిజంగా ఫ్రీగా రాదు. దాని ధర కూడా కలపబడే వుంటుంది. లేదా ముందు ముందు మీ నుంచి రాబోయే ఆదాయం కోసం వేసిన ఎర అయ్యుంటుంది.

ఆన్ లైన్ షాపింగ్ లో వస్తువులు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి. బయట వెయ్యి రూపాయాలు చేసే చీర ఏడొందలకే దొరికింది. ఆ సైట్ వల్ల మూడొందల ఆదా అయినట్లే కదా? (రాగిణి, హైదరాబాద్)
నేను ఆ సైట్ చూడలేదు. నాకు వెయ్యి రూపాయలు ఆదా అయ్యాయి కదా?

బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ లో ఎంత డబ్బుని వేసుకుంటే టీడీయస్ కట్టావలసి ఉంటుంది? ఒకవేళ 15G ఫారమ్ నింపి ఇస్తే ఎంత మినహాయింపు ఇస్తారు? (అబ్బగాని భాస్కర్, మహబూబాబాద్)

ఫిక్స్ డ్ డిపాజిట్ లో డబ్బులు పెట్టినంత మాత్రాన టీడీయస్ కట్టనవసరం లేదు. బ్యాంక్ లో డబ్బు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినప్పుడు, ఆ డిపాజిట్ పైన వచ్చే వార్షిక వడ్డీ పదివేల కన్నా ఎక్కువైనప్పుడు మాత్రమే, ఆ బ్యాంకు మీ వడ్డీ పైన పది శాతం టాక్స్ విధించి, మిగిలిన సొమ్ముని మాత్రమే మీ ఖాతాలో జమ చేస్తుంది. అంటే ఇప్పుడున్న వడ్డీ రేట్లను బట్టి సుమారు లక్షా పాతికవేలకు పైన డిపాజిట్ వున్నవాళ్ళకు ఇది వర్తిస్తుంది. వడ్డీ కూడా ఒక రకమైన ఆదాయమే కాబట్టి దానిపైన పన్ను విధిస్తుందన్నమాట. అయితే టాక్స్ పరిధిలోకి రానంత స్వల్ప ఆదాయం వున్నవాళ్ళు ఆ విషయాన్ని బ్యాంక్ కు తెలియజేసి టాక్స్ పడకుండా చూసుకునేందుకు 15G ఫారమ్ నింపి ఇవ్వచ్చు. ఉదాహరణకి మీకు బ్యాంకులో నాలుగు లక్షల డిపాజిట్ వుండి, వార్షిక ఆదాయం లక్షన్నరే వుందనుకోండి. మీ ఆదాయం (ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ కలుపుకోని కూడా) టాక్స్ పరిధిలోకి రాదు. ఆ విషయాన్ని బ్యాంక్ కు సంవత్సరం మొదట్లోనే తెలిపితే ఆ పన్ను విధించరు. సీనియర్ సిటిజన్లు 15H ఫారమ్ వాడాలి. 

Sunday, August 16, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 8

మొన్ననే మూడు లక్షలు పెట్టి మా ఆవిడకి బంగారు నగలు చేయించాను. బంగారం రేటు పెరిగిదేకానీ తరిగేది కాదు కాబట్టి ఇది మంచి పెట్టుబడే అనుకుంటున్నాను…

అయ్యా! మీరు కొన్న బంగారం వల్ల రెండు ముఖ్యమైన ఉపయోగాలు వున్నాయి. ఒకటి మీ ఆవిడ చాలా సంతోషించడం వల్ల మీ సంసారం సంతోషంగా సాగిపోతుంది. అయితే ఇది మార్కెట్ లో కొత్త మోడల్ నగలు వచ్చేంత వరకే అని గుర్తుపెట్టుకోండి. రెండో ఉపయోగం – మీకు ఎప్పుడైనా డబ్బులకి బాగా ఇబ్బంది అయినప్పుడు ఈ నగలను తాకట్టు పెట్టుకోవచ్చు. తక్కువ వడ్డీతో, అత్యవసర పరిస్థితిలో అందివచ్చే డబ్బుని బంగారం మాత్రమే ఇవ్వగలదు. ఈ రెండు తప్పు ఇంకే ప్రయోజనమూ వుండదు. బంగారం పెరిగేదేకానీ తరిగేది కాదు అంటున్నారు, మరి తరుగు అనేది ఎందుకు వుందో ఒకసారి ఆలోచించండి. మీరు అనుకుంటున్నట్లు ఇది పెట్టుబడి కాదు ఖర్చు. ఇంకా అనుమానం వుంటే మీ ఆవిడ దగ్గరకెళ్ళి బంగారం రేటు పెరిగింది, ఈ నగలు అమ్మేస్తాను అని చెప్పి చూడండి.

సత్యప్రసాద్ గారూ, లోన్ కోసం అప్లై చేస్తే క్రెడిట్ స్కోర్ తక్కువగా వుందని తిరస్కరించారు. క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి? (జగదీశ్, కనిగిరి)

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (CIBIL – సిబిల్) అనే ఒక ప్రభుత్వ సంస్థ వుంది. వీళ్ళు యముడి దగ్గరున్న చిత్రగుప్తుడు లాంటి వాళ్ళు. మన ఆర్థిక పాపాలన్నీ చిట్టాగా రాసిపెడతారు. వాటి ఆధారంగా ప్రతి మనిషికి ఒక స్కోర్ ఇస్తారు. దీనినే సిబిల్ ట్రాన్స్ యూనియన్ స్కోర్ ఎండ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. వాడుక భాషలో క్రెడిట్ స్కోర్ అంటారు. ఈ స్కోర్ మూడొందల నుంచి తొమ్మిదొందల మధ్యలో వుంటుంది. మనం కావాలనుకుంటే వారి వెబ్ సైట్ కి లో దరఖాస్తు చేసుకోని, ఐదువందలు కట్టి మన స్కోర్ తెప్పించుకోవచ్చు. మనం ఏదైనా బ్యాంక్ లోన్ కి అప్లై చేసినప్పుడు ఆ బ్యాంక్ వారు మన సిబిల్ స్కోర్ గురించి ఎంక్వైరీ చేస్తారు. ఈ స్కోర్ కనీసం ఏడువందల యాభై లేకపోతే అప్పులు ఇవ్వరు. అందువల్ల మంచి క్రెడిట్ స్కోర్ వుండేలా చూసుకోవడం చాలా అవసరం. తీసుకున్న అప్పులకు నెలసరి వాయిదాలు సమయానికి కట్టడం, చెక్ బౌన్సులు లేకుండా చూసుకోవడం, క్రెడిట్ కార్డులు పరిమితంగా వాడటం, ఇలాంటి ప్రయత్నాలు చేసి క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవచ్చు. అలా పెంచుకున్న తరువాత మళ్ళీ లోన్ కోసం అప్లై చేస్తే, శాంక్షన్ అయ్యే అవకాశాలు మెరుగౌతాయి.

మా అమ్మాయికి ఎంతో ఖరీదు పెట్టి బొమ్మలు కొనిచ్చాను. ఒక్కదాంతో కూడా ఆడదు. ఆమెకి డబ్బు విలువ తెలిసేలా అలా చెయ్యాలి? (విద్యాధర్, విజయవాడ)

మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీకు ఒక ప్రశ్న. మీరు ఎప్పుడైనా  జిమ్ కి వెళ్దామని డబ్బులు కట్టి మూడు రోజులు వెళ్ళి ఆ తరువాత మానేశారా? ఎగ్జిబిషన్లలోనో, ఆన్ లైన్ షాపింగ్ లోనో వస్తువులు కొని వాడకుండా వుంచేశారు? వీటికి మీ సమాధానం అవును అయితే ఇంకా ఇలాంటివి చాలా వుంటాయి. ఇప్పుడు మీకు మీ అమ్మాయి తేడా ఏముందో చెప్పండి? అదలా వుంచండి. వస్తువుకు విలువ దాని ధరని బట్టి రాదు. ఒకోసారి మనం మంచి షోరూమ్ లో కొన్న డ్రస్ కన్నా, ఫుట్ పాత్ పైన కొన్న డ్రస్ ని ఎక్కువ ఇష్టపడతాము. మన ఇష్టాఇష్టాలను బట్టి వస్తువులకు విలువలను ఆపాదిస్తామే తప్ప, దాని ధరని బట్టి కాదు. అందువల్ల కొనుక్కున్న తరువాత ఖర్చుపెట్టాం కాబట్టి అది విలువైనది అనుకోకుండా, మనకి (వాడుకునేవాళ్ళకి) విలువైనది అనిపించిన వస్తువులే కొనుక్కోవడం మంచిది. మీ అమ్మాయి అలాంటి ఇష్టాన్ని గుర్తించి దానికి అనుగుణంగా ఖర్చుపెట్టండి. అప్పుడు మీరు పెట్టిన ఖర్చుకున్నా ఎక్కువ విలువ ఆ వస్తువులకు మీ అమ్మాయి ఇస్తుంది. మరో విషయం. ఒక మనిషి లేదా వస్తువు విలువ ఆ మనిషి లేదా వస్తువు లేనప్పుడే తెలుస్తుంది తప్ప, వున్నప్పుడు తెలియదు. అన్ని కొనిచ్చేస్తే విలువ తెలియదు. మీ అమ్మాయికి కావాలనిపించి, మీరు కొనివ్వని వస్తువు విలువ ఎక్కువగా వుంటుందని గుర్తించండి.

ఎస్.బీ.ఐ. మాగ్నమ్ మిడ్ కాప్ బాగుందని… (రాజారావు, మిర్యాలగూడ)


ఇలాంటి ప్రశ్నలకు ఇక్కడ అవకాశం లేదని ఇంతకు ముందే చెప్పాను. పరిమితమైన ఈ పేజీని వీలైనంత ఎక్కువమందికి ఉపయోగపడేలా చెయ్యాలి. పూర్తిగా వ్యక్తిగతమైన ప్రశ్నలకోసం వృధా చేయకూడదని మా ఉద్దేశ్యం. ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎంత రాబడిని ఇస్తున్నాయి, ఏ బ్యాంకులు ఏ డిపాజిట్ కు ఎంత వడ్డీ ఇస్తున్నాయి… వగైరా విషయాలు బిజినెస్ పత్రికల్లోనూ, వెబ్ లోనూ వున్నాయి. వాటిని పరిశీలించి నిర్ణయించుకోండి.

Sunday, August 9, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 7

మాకు ఇద్దరు పిల్లలు. చదువుకుంటున్నారు. వాళ్ళిద్దరి పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకుందామనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లల చదువులకోసం ఏవో పథకాలు వచ్చాయని విన్నాను. వాటి గురించి చెప్తారా?  - అనీల, కావలి

అనీల గారూ, మీరు కొంచెం కన్ఫూజ్ అయినట్లున్నారు. మొదట మీరు చెప్పినది పిల్లల ఇద్దరి పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకుంటాను అంటున్నారు. ముందు దీని గురించి మాట్లాడుకుందాం. పిల్లల పేరు మీద ఇన్సూరెన్స్ చేయడం అంటే దురదృష్టం కొద్దీ వాళ్ళు లేకుండా పోతే వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ డబ్బు తల్లిదండ్రుల చేతికి ఇవ్వడం. పిల్లలే లేకుండా పోతే వాళ్ళ పేరు మీద వచ్చే డబ్బుని ఏ తల్లిదండ్రులైనా తీసుకుంటారా? తీసుకోవాల్సింది పిల్లల్ని నామినీగా పెట్టి తల్లిదండ్రులు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. విధివశాత్తు తల్లిదండ్రులు చనిపోతే పిల్లలకు ఆర్థికంగా ఉపయోగపడేది ఆ డబ్బే. పిల్లలకు ఇరవై ఏళ్ళు రాగానే, లేదా ఉద్యోగంలో మొదటి జీతం అందగానే వాళ్ళ పేరుమీద ఇన్సూరెన్స్ తీసుకోమని ప్రోత్సహించండి. ఆ వయసులో ప్రీమియం చాలా తక్కువగా వుంటుంది. ఇక చదువులకోసం చేసే పాలసీల విషయానికి వస్తాను. మీకు మీ పిల్లల్ని బాగా చదివించాలన్న పట్టుదల వుంటే, అందుకు తగ్గ ఆర్థిక ప్రణాలిక చేయాలని నిశ్చయం వుంటే, ఈ పథకాలు అనవసరం. ఎడ్యుకేషన్ ప్లాన్ పేరుతో ఇచ్చే ఇన్సూరెన్స్ పథకాలలో చాలా డబ్బు ఛార్జీలకు, మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడానికి ఖర్చైపోతాయి. మిగిలిన డబ్బుని పొదుపు చేసి మీకు పిల్లల చదువులకోసం ఇస్తారు. దాని బదులు మీకు సరిపడ ఇన్సూరెన్స్ ఒక టర్మ పాలసీతో తీసుకోని, దాచిపెట్టాలనుకున్న మొత్తం కొంత మ్యూచువల్ ఫండ్స్ లోనూ, కొంత ఫిక్స్ డ్ డిపాజిట్ లోనూ, మరి కొంత బంగారు కాయిన్స్ / బార్స్ రూపంలో దాచిపెట్టండి.

కాలేజీ చదువులు అయిపోగానే వుద్యోగం వచ్చింది. చాలా తక్కువ జీతం. వచ్చినదంతా ఇంటి అద్దెకి, నెల ఖర్చులకి సరిపోయేది. జీతం కొంచెం పెరగగానే పొదుపు చేద్దామని అనుకున్నాను. ఐదేళ్ళుగా ఆదాయం పెరుగుతూనే వుంది కానీ ఒక్క రూపాయి కూడా ఆదా చెయ్యలేదు. నన్ను ఏం చెయ్యమంటారు?

ఆదా చెయ్యాలి అనుకున్న తరువాత, ముందు ఆదా చెయ్యాల్సిన డబ్బుని తీసి మిగిలిన డబ్బునే ఖర్చుపెట్టుకోవాలి. జీతం రాగానే కనీసం 10% డబ్బుని తీసి దీర్ఘకాలిక పెట్టుబడిగా పక్కన పెట్టండి. అలా చేస్తేనే పొదుపు చెయ్యగలరు. ఇప్పటికి ఐదేళ్ళుగా ఉద్యోగం చేస్తూ, ఒక్క రూపాయి కూడా దాచిపెట్టలేదు అంటే మీరు ఇప్పటికే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ ఉచ్చులో పడిపోయారనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ముందు క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చేయండి. ఆ తరువాత పర్సనల్ లోన్ తీర్చండి. చిన్న మొత్తంలో పొదుపు మొదలుపెట్టి, పర్సనల్ లోన్ తీరగానే పొదుపు మొత్తం పెద్దది చెయ్యండి. క్రెడిట్ కార్డ్ వాడకుండా, వేరే ఏ అప్పు చెయ్యకుండా మిగిలిన డబ్బుతో సంతోషంగా వుండటానికి ప్రయత్నించండి.

ఈ మధ్య ఒక లోన్ కొసం అప్లై చేశాను. బాంక్ లోన్ ఇవ్వడానికి నిరాకరించింది. కారణం ఏమై వుంటుంది?
మీ ప్రశ్న చాలా స్థూలంగా వుంది. ఏ లోన్ అప్లై చేశారో చెప్పాలి. అలాగే బ్యాంక్ లోన్ నిరాకరించిన కారణం బ్యాంక్ వారినే అడిగితే చెప్తారు. ఎలాగూ ఈ ప్రశ్న వేశారు కాబట్టి కాస్త వివరంగా చెప్తాను. బ్యాంక్ లోన్ కి మీరు దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకు మీ ఆర్థిక భూత, వర్తమాన, భవిష్యత్తులను అంచనా వేస్తుంది. అంటే గతంలో మీరు ఏమైనా అప్పులు చేశారా? వాటికి కట్టాల్సిన ఈయంఐలు క్రమం తప్పకుండా కట్టారా? మీ ఆర్థిక చరిత్రలో ఏవైనా ఆర్థిక అవకతవకలు వున్నాయా పరిశీలిస్తారు. రెండొవది వర్తమానం. ఇప్పుడు మీ ఆదాయం ఎంత వుంది? వచ్చే ఆదాయంలో ఎంత అప్పులు తీర్చడానికి వాడుతున్నారు?ప్రస్తుత ఉద్యోగం, అందులో మీ హోదా, మీ కంపెనీ వివరాలు చూస్తారు. ఒకరకంగా ఈ రెండూ చూసి భవిష్యత్తులో మీరు అప్పులు సక్రమంగా తీర్చగలరా లేదా అని అంచనా వేస్తారు. ఈ మూడు విభాగాలు సంతృప్తికరంగా వుంటేనే మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. ఒకసారి మీ ఆర్థిక పరిస్థితిలో ఈ మూడు విభాగాలలో ఎక్కడైనా సమస్య వుందేమో చూసుకోండి. ముఖ్యంగా గత ఆరునెలల్లో ఏదైనా చెక్ బౌన్స్, ఈయంఐ బౌన్స్ అయ్యాయేమో చూసుకోండి. పూర్తి వివరాలు చెప్పమని బ్యాంక్ వారిని అడగండి.

నమస్కారం సార్! ఇప్పుడు ఒక పేరున్న సాఫ్ట్ వేర్ కంపెనీలో వున్నాను. మరో చిన్న కంపెనీకి మారుతున్నాను. నిజానికి మా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఈ కంపెనీ పెట్టారు. పెద్ద కంపెనీలో చిన్న పొజిషన్ నుంచి చిన్న కంపెనీలో పెద్ద పొజిషన్ కి మారుతున్నాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? – జి. కల్యాణ్, బెంగుళూరు


కల్యాణ్ గారు, ముందుగా అభినందనలు. చిన్న కంపెనీ, అది కూడా మీ స్నేహితులతో కలిసి పని చెయ్యబోతున్నారు కాబట్టి చాలా సంతోషంగానూ, ఉత్సాహంగానూ ఉంటుంది. ఈ హడావిడిలో కొన్న ముఖ్యమైన ఆర్థిక విషయాలను మర్చిపోకండి. మొదటిది జీతం. ఇప్పుడు వస్తున్న జీతం కన్నా తక్కువ జీతానికి వెళ్ళడం మంచిది కాదు. ఖర్చులు తగ్గించుకోవచ్చు అనుకుంటారేమో, అది చాలా అరుదుగా మాత్రమే సాధ్యపడుతుంది. పాత జీతాన్ని కొత్త జీతాన్ని పోల్చుకునేటప్పుడు, సీటీసి కాకుండా చేతిలోకి ఎంత వస్తుందో దాని మీద పోల్చుకోండి. కొత్త కంపెనీ కాబట్టి ఒకో నెల జీతం రావటం ఆలస్యం అవ్వచ్చు. కనీసం రెండు నెలల జీతం డబ్బు విడిగా, లిక్విడ్ గా వుంచుకోండి. పాత కంపెనీలో రావాల్సినవన్నీ అప్లై చేసుకోండి. ముఖ్యంగా గ్రాట్యుటీ (మీరు ఐదేళ్ళు పనిచేసి వుంటే), పీఎఫ్ (వీలైతే కొత్త పీఫ్ పథకంలోకి మార్పించుకోండి), టాక్స్ లెక్కల కోసం టీడీయస్, ఫార్మ్ 16లు తప్పకుండా తీసుకోండి. కొత్త కంపెనీలో ఇన్సూరెన్స్, ముఖ్యంగా మెడీక్లెయిమ్ వంటి సదుపాయాలు వుండకపోవచ్చు. వెంటనే కుటుంబం మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. తరువాత పెన్షన్ పథకం ఏదైనా ఎంచుకోని అందులో డబ్బులు ఆదా చెయ్యండి. ఇవన్నీ ఆర్థికపరంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కుటుంబపరంగా, కెరీయర్ పరంగా రాగలిగిన ఇబ్బందులు వున్నాయా అని కూడా ఆలోచించుకోని, సిద్ధంగా వుండండి. 

Sunday, August 2, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 6

డబ్బులు ఛారిటీకి ఇవ్వాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఆ డబ్బు నిజంగా అవసరం వున్నవాళ్ళకి చేరనప్పుడు ఇచ్చినా ఏం లాభం చెప్పండి. సగానికి సగం ఎన్జీవోలు డబ్బులు మింగేస్తున్నాయే తప్ప నిజంగా సేవ చేస్తున్నాయా అనిపిస్తుంది.

మన దేశంలో చాలా స్వచ్చంద సేవా సంస్థల పనితీరు అనుమాస్పదంగానే వుంది. అలాగే చాలా గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థలు ఎన్నో వున్నాయి. వాటి గురించి కొంత పరిశోధించి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఇంటర్ నెట్ వుంటే అన్నీ తెలుసుకోవచ్చు. పైగా నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాల వల్ల మీరు వేరే ఎక్కడో వున్న సంస్థలకు కూడా డబ్బులు ఇవ్వచ్చు. ఇదలా వుంచండి. కేవలం ఒక చెక్కు రాయడంతో అది ఛారిటీ అయిపోదు. ఒక అనాథ శరణాలయానికి భోజన ఖర్చులకి డబ్బులు ఇవ్వడం కన్నా భోజనం వండుకోని తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టడంలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. వాళ్ళతో మీరు కూడా కలిసి తింటే ఆ తృప్తి ఎక్కువ. ఇలా చేస్తే డబ్బులు పక్కదారి పట్టే అవకాశమూ తక్కువ. వీటన్నింటి కంటే ముఖ్యమైనది మరొకటి వుంది. అసలు మనం దానధర్మాలు ఎందుకు చేయాలి? అన్న ప్రశ్న. చాలా మంది పేరు కోసం, పాపులారిటీ కోసం చేస్తారు. డబ్బులు ఇచ్చిఅందుకు తగినంత ప్రచారం కావాలనుకుంటారు. కొంతమంది భక్తి, లేదా దేవుడంటే భయం వల్ల చేస్తారు. ఇంకొంతమంది సామాజిక ఒత్తిడి వల్ల, కుటుంబసభ్యుల వత్తిడి వల్ల దాన ధర్మాలు చేస్తారు. ఇవన్నీ ఏ ప్రయోజనాన్ని ఇవ్వవు. డబ్బుని ఒక మంచి పని కోసం ఇస్తున్నాను అన్న భావన కోసమే డొనేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆత్మసంతృప్తి కోసం దానం చెయ్యండి. అప్పుడు మీకు డబ్బు ఇవ్వడంలోనే ఆనందం కలుగుతుంది. ఆ తరువాత డబ్బు ఏమౌతోంది అన్న ఆలోచన బాధించదు.

అమ్మో మీకు ఎన్ని ఆర్థిక రహస్యాలు తెలుసో… ఇవన్నీ ఉపయోగించి మీరు కూడా లక్షలు సంపాదించి వుంటారు. మా లాంటి వాళ్ళకి అప్పేమైనా దొరుకుతుందా గురువుగారూ?

ఇవన్నీ చెప్పాలంటే అంత సంపాదించాలా? డబ్బులు పోగొట్టుకున్న అనుభవం చాలదూ? అర్జెంటుగా డబ్బు కావాలి. అప్పేమైనా దొరుకుతుందా శిష్యుడు గారూ??

స్టాక్ మార్కెట్ కన్నా రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడితే సేఫ్ కదా?

రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడితే సేఫ్ అనీ, ఎక్కువ లాభాలు వస్తాయనీ చాలా మంది అంటుంటారు. రియల్ ఎస్టేట్ లో అయితే ఇది అందరి విషయంలో జరగదు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 2007 నుంచి 2014 వరకు 195 నగరాల రియల్ ఎస్టేట్ లాభాలను లెక్కేసింది. వాటిలో 89 నగరాలలో రియల్ ఎస్టేట్ మీద వచ్చిన ఆదాయం బ్యాంక్ వడ్డీల కన్నా తక్కువ వుంది. రియల్ ఎస్టేట్ విషయంలో ఇతర సమస్యలు కూడా వున్నాయి. కబ్జా కేసులు, సివిల్ కేసులు, గొడవలు ఇలాంటి సమస్యలు చాలా వున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా డబ్బు అవసరం వచ్చినప్పుడు అమ్ముకోడానికి చాలా సమయం పడుతుంది. అంటే ఇది ఏ మాత్రం Liquidity లేని పెట్టుబడి అన్నమాట. ఇదంతా భూములు కొనద్దు అని చెప్పడానికి కాదు. పెట్టుబడి పెట్టే ముందు ఈ సమస్యలను గుర్తించమని చెప్పడానికే. అలాగే మీ దగ్గర వున్న మొత్తం డబ్బుని రియల్ ఎస్టేట్  లో పెట్టడం కూడా మంచిది కాదు.

రూపాయి చెప్పిన బేతాళ కథలు అన్నీ క్రమం తప్పకుండా చదివాను. ఎంతో ఉపయోగపడే విషయాలను చాలా సులభమైన శైలిలో రాశారు. అభినందనలు. దయచేసి ఈ కథలు మొత్తం కలిపి సాఫ్ట్ కాపీగా నాకు పంపించగలరా?

అశోక్ గారూ, బేతాళ కథలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం. అవి మీ ఆర్థిక అభివృద్ధికి సహాయపడతాయని నమ్ముతున్నాను. సాఫ్ట్ కాపీ పంపడం సాధ్యపడదు. త్వరలో ఈ కథలన్నీ కలిపి పుస్తకరూపంలో వెలువరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అప్పటిదాకా ఆగాల్సిందే..!!

డబ్బులు ఆదా చెయ్యాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ చెయ్యలేకపొతున్నాను. ఏదైనా సలహా చెప్పగలవా బేతాళా?

నేను చెప్పాల్సిన సలహా మీ ప్రశ్నలోనే వుంది. డబ్బులు ఆదా చెయ్యాలి ’అనుకోవడం’ మానేసి, ఆదా చెయ్యడం మొదలుపెట్టండి. అంతే! అయితే అది అంత సులభమైనదేమీ కాదు. డబ్బు విషయమే కాదు ఇంకా చాలా విషయాలలో చెయ్యాలి అనుకుంటాం కానీ చెయ్యం. “వచ్చే నెల నుంచి సిగరెట్ మానేస్తాను.” అంటారు. వచ్చే నెల వస్తుంది, పోతుంది. “ఇక నుంచి బరువు తగ్గడానికి స్వీట్లు తినడం మానేస్తాను” అంటారు. “ఈ రోజు చిన్నా బర్త్ డే కదా… ఈ రోజు తింటాను” అని తమకి తామే సర్దిచెప్పుకుంటారు. ఒక అలవాటు లేని పని చెయ్యాలని ఒక వైపు మనసు చెప్తున్నా, ఏదో ఒక సాకుతో చెయ్యకుండా తప్పించుకుంటారు. మంచిరోజు చూడాలంటారు, ఇంకెవరినైనా సలహా అడగాలంటారు, బోనస్ రావాలంటారు… ఇంకా ఎన్నో. ఇవన్నీ మనకి మనమే చెప్పుకునే అబద్ధాలు. మనల్ని మనమే మోసం చేసుకునే సాధనాలు. ఈ కారణాలను గుర్తించడానికి ప్రయత్నించాలి. వాటిని అదుపు చేస్తే మీరు అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. ఇది డబ్బుకే కాదు, ఏ ఆశయాన్ని సాధించడానికైనా పనికొస్తుంది.