(ఆంధ్రభూమి వార పత్రికలో, నేను రాసిన శీర్షిక రూపాయి చెప్పిన బేతాళ కథలకు కొనసాగింపు ఈ ప్రశ్నలు జవాబులు.)
మా బంధువులు కొంతమంది టేకు చెట్ల మీద పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని చాలా డబ్బు పెట్టారు. చివరికి ఆ కంపెనీ లేదు, టేకు చెట్లూ లేవు. ఇలాంటి మోసాలని అరికట్టలేమా? - (ప్రశాంతి, గుంటూరు)
ఒక చెట్టు ఎదగడానికి కొంత కాలం పడుతుంది. అందుకు అవసరమైన
మట్టి, నీరు, ఎండ సకాలం అందాలి. ఇవేవీ లేకుండా ఒక విత్తనం నాటితే రాత్రికి రాత్రే
మొక్క మొలిచి పెద్ద చెట్టు అయిపోవాలని కోరుకోవడంలో ఏమైనా న్యాయం వుందంటారా? ఇది
టేకు చెట్టు గురించి మాత్రేమే కాదు. డబ్బు అనే విత్తనం నాటేసి వెంట వెంటనే లక్షలు,
కోట్లు సంపాదించాలనుకో వచ్చు అని చెప్పే ప్రతి పథకం కూడా అలాంటిదే. డబ్బు
సంపాదించాలన్న కోరిక తప్పు కాదు, కానీ ఒక్కసారిగా లక్షలు వచ్చేయలని కోరుకోవడం
దురాశ అవుతుంది. దురాశ దుఖానికి కారణం అవుతుందని మనందరం చదువుకున్నాం కదా! ఇలాంటి
మోసాలు చేసే సంస్థలకు మనుషుల దురాశే పెట్టుబడి. ఆ దురాశ వదులుకోకపోతే టేకు చెట్లు
అని మోసం చేస్తారు, ఈమూ పక్షులని మోసం చేస్తారు.. ఇంకా అనేకం పుట్టుకొస్తూనే
వుంటాయి.
నా దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు వున్నాయి.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని బట్టీ వాటిని అమ్మేయటం మంచిదా?
సారీ. ఈ శీర్షిక ఉద్దేశ్యం షేర్ టిప్ లు ఇవ్వటం కాదు.
సామాన్య జనానికి ఆర్థిక విషయాల గురించి అవగాహన కల్పించడం వరకే ఈ ప్రశ్నలు జవాబుల
పరిథి. విషయ పరిజ్ఞానం వుంటే ఏ ప్రాడక్ట్ కొనాలో, ఏ షేర్లు కొనాలో స్వంతంగా
నిర్ణయించుకోవచ్చు. అందువల్ల ప్రత్యేకించి ఏ ప్రాడక్ట్ గురించి, పథకాల గురించి
కానీ ప్రశ్నలు వేయకండి.
మీరు చెప్పిన ఆర్థిక సలహాలు చాలా ఉపయోగపడుతున్నాయి.
మీరు చెప్పిన విషయాలను పాటించడం మొదలుపెట్టాము. ఇలాంటివి మనం పిల్లలకు చిన్నప్పటి
నుంచే నేర్పిస్తే ఉపయోగం వుంటుంది కదా? - (రత్నాకర్, ఈ మెయిల్ ద్వారా)
బేతాళ కథలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పింది
అక్షరాలా నిజం. పిల్లలకు ఆర్థిక పాఠాలు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. పాకెట్ మనీ
ఇవ్వడం వరకే చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నారు. వాటికి లెక్కలు అడగటం
(అడగకపోయినా ఫర్లేదు, కనీసం రాయమని చెప్పడం), అందులో కొంత డబ్బు దాచుకోవడం
నేర్పించడం చెయ్యాలి. సంపద సాధించడం వెనక ఆర్థిక పరిజ్ఞానం, ఆదాయ వ్యయాలు, పొదుపు
ముదుపు ఇవన్నీ వున్నాయి. వీటి గురించి క్రమంగా చెప్పడం మంచి పద్దతి. ఈ మూడు
కాకుండా మనిషి స్వభావాన్ని పరీక్షించే అంశాలు చాలా వుంటాయి. ఆశయం, దురాశ లేకపోవడం,
ఓర్పు, సహనం, నియంత్రణ ఇవన్నీ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే లక్షణాలు. ఇవి
పెంపొందేలా పెంచడం ఆర్థికంగానే కాక ఇంకా అనేక విధాలుగా ప్రయోజనాలని ఇస్తుంది.
(రూపాయి అడిగే బేతాళ ప్రశ్నలు మీ దగ్గరా వున్నాయా? వెంటనే రాసి పంపించండి. rupeebethal@gmail.com)
No comments:
Post a Comment