అలకాపురి. అందులో రాజభవనం. అందులో దివ్యమణిఖచితమైన గోడలతో, సర్వాలంకారాలతో భవ్యమైన
కుబేర మందిరం. అన్ని అలంకారాలతో అలరారుతూ అందంగా అక్కడికి నడిచివచ్చింది కుబేరుడి
భార్య చంద్రరేఖ.
“ఏమిటి స్వామీ ఏదో
వ్యాకులత మిమ్మల్ని బాధిస్తున్నట్లుంది?” అడిగింది ఆమె కుబేరుణ్ణి చూస్తూ.
“వ్యాకులత కాదు దేవీ,
ఆత్రుత. సంపద రహస్యాల గురించి మానవులకు ఎంత అవగాహన వుందో తెలుసుకోమని భూలోకానికి
పంపించిన రూపీ బేతాళుడు ఈ రోజు తిరిగి వస్తున్నాడు. అతని కోసమే ఎదురుచూస్తున్నాను.”
అని కుబేరుడు అంటుండగానే రూపీ బేతాళుణ్ణి ఆ మందిరంలోకి అడుగుపెట్టాడు. వస్తూనే
కుబేరుడికి నమస్కరించి -
“ప్రభూ, మీరు
చెప్పినట్లే నేను ఒక మానవుణ్ణి కలిసాను. అతని పేరు మధ్యతరగతి విక్రమార్కుడు. అతని
ఆర్థిక పరిజ్ఞానం ఎంత వుందో, అతను తన జీవితంలో సంపద సాధించగలడో లేడో అని రకరకాల
కథల ద్వారా పరీక్షలు పెట్టాను. అతను చెప్పిన ఆర్థిక పాఠాలన్నీ మీకు మళ్ళీ
వినిపిస్తాను. వినండి” అంటూ ఇలా చెప్పసాగాడు.
1.
సంపాదన వేరు సంపద వేరు. వచ్చేది సంపాదన అయితే నిలిచేది సంపద. ఇదే
ఆర్థిక ప్రగతికి తొలి సూత్రం
2.
సంపాదనని సంపదగా మార్చడం ప్రణాలికతో మొదలౌతుంది. ఇప్పటి ఖర్చులను తెలుసుకోని,
రాబోయే ఖర్చులను అంచనా వేసుకోని ఆ ఖర్చుల ఆధారంగా డబ్బు దాచుకునేందుకు ఒక ప్రణాలిక
వేసుకోవాలి.
3.
ఆర్థిక సలహాలు
ఇచ్చే వారిలో కమిషన్ల కోసం ఆశపడే ఏజంట్లు, నిరుత్సాహపరిచే నిరాశావాదులు, చేతకాక
చేతులు కాల్చుకున్నవారు వుంటారు. వారి మాయలో పడకూడదంటే స్వంతంగా ఆర్థిక అక్షరాస్యత పెంచుకోవాలి
4.
ధరల పెరుగదలనే
ద్రవ్యోల్బణం అంటారు. ధరలు పెరిగే వేగం కన్నా ఎక్కువ వేగంతో పెరిగితేనే డబ్బు
నిజంగా వృద్ధి చెందినట్లు. అలాంటి పథకాలలో తప్పకుండా డబ్బు దాచుకోవాలి.
5.
సంపద
కూడబెట్టాలనుకున్న ప్రతి ఒక్కరూ చక్రవడ్డీ మహత్యాన్ని తెలుసుకొని, అలాంటి వడ్డీలు
ఇచ్చే పథకాలలో తప్పకుండా ముదుపు చేయాలి.
6.
ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోతే అతని స్థానాన్ని తీసుకోని, అతని అర్థిక ప్రణాలికలన్నీ
అమలయ్యేలా చూసే బాధ్యత ఇన్సూరెన్స్ తీసుకుంటుంది. అందుకే ఆర్థిక ప్రణాలికలో
మొదటి మెట్టు బీమా పథకం.
7.
ఆర్థిక ప్రణాలిక
అమలు కావాలంటే మొదట వున్న అప్పులు తీర్చుకోవాలి. ఎక్కువ వడ్డీ కట్టాల్సిన అప్పులను,
మరో చోట తక్కువ వడ్డీకి తెచ్చైయినా సరే త్వరగా తీర్చుకోని అలా మిగిలిన డబ్బుని ఆదా
చేయాలి.
8.
అనుకోని ఆర్థిక
అవసరాల కోసం అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. వైద్య అవసరాలకు ఆరోగ్య, ప్రమాద బీమాలు
తీసుకోవాలి. మిగిలిన ఖర్చుల కోసం డబ్బు అందుబాటులో వుండేలా చూసుకోవాలి.
9.
రాబోయే ఆర్థిక అవసరాలను దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలుగా
విభజించుకోని, రిస్క్, ఆదాయం, లిక్విడిటీ ఆయా విభాగాలకు సరిపోయేలా పొదుపు చేయాలి. ఏ
అవసరానికి ఆ విభాగంలో డబ్బులే వాడుకోవాలి.
10.
డబ్బులు ఎంత
ఎక్కువ కాలం పొదుపు చేస్తే అంత ఎక్కువగా లాభాలు వస్తాయి. ఎక్కువ కాలం పొదుపు
చేయాలంటే చిన్న వయసులోనే ఆదా చేయడం మొదలుపెట్టాలి.
11.
డబ్బు మూడు రకాలు - వచ్చే డబ్బు, పోయే డబ్బు, దాచే డాబ్బు. వచ్చే డబ్బుని
పెంచుకోవాలి, దాచే డబ్బుని పెంచుకోవాలి, పోయే డబ్బుని తగ్గించుకోవాలి. దాచే
డబ్బుని దాచగా మిగిలిన డబ్బునే ఖర్చులు పెట్టాలి.
“ఇవి ప్రభూ నా మొదటి
పరీక్షలో విక్రమార్కుడు చెప్పిన ఆర్థిక పాఠాలు. ఇవన్నీ ఆర్థిక అక్షరాస్యతకు (Financial
Literacy) సంబంధించినవి. ఇవన్నీ సంతృప్తికరంగా వుండటంతో ఆ తరువాత ఖర్చుల గురించి
చర్చించాను. వాటి సంగతులు కూడా చెప్తాను వినండి” అని రూపీ బేతాళుడు కొనసాగించాడు.
12.
ఆదాయం పెరిగేకొద్దీ జీవనశైలి మెరుగౌతూ వుంటుంది. మెరుగౌతున్న జీవన శైలి వల్ల
ఖర్చులు కూడా పెరుగుతూ వుంటాయి. ఈ జీవనశైలిని పెంచే ఖర్చుల (Lifestyle
expenses) విషయంలో నియంత్రణ అవసరం.
13.
అప్పు అంటే
రాబోయే సంపాదనను ఖర్చుపెట్టడమే. అప్పు తీర్చడానికి కట్టే అసలు వడ్డీలు కలుపుకోని,
నెల జీతంలో నలభైశాతానికి మించకూడదన్న సూత్రాన్ని పాటిస్తే అప్పులు అదుపులోకి
రావచ్చు.
14.
ఖర్చులు తగ్గించుకుంటూ ఆర్థికంగా ఎదగాలి. పెద్ద ఖర్చుల కన్నా చిన్న ఖర్చులను నియంత్రించడం
సులభం. అలా ఆదాచేసిన చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా దాచుకోగలిగితే అవే సంపదగా
మారుతాయి.
15.
వ్యాపారులు ఎప్పుడూ మన చేత ఎలా ఖర్చుపెట్టించాలా అని ఆలోచిస్తారు. వారిని అధిగమించి,
అవసరమైన వస్తువులను మాత్రమే కొనడం అలవాటు చేసుకుంటే చాలా డబ్బును ఖర్చు కాకుండా
కాపాడుకోవచ్చు.
16.
“ఇంపల్స్” ఖర్చులను గుర్తించి నియంత్రించాలి. కొనాలని ప్రేరేపణ కలిగినప్పుడు ఆ
వస్తువు అవసరం నిజంగా వుందా లేదా అని గమనించుకోవాలి. వీలైతే ఆ కొనుగోలును ఓ నెల
రోజులు వాయదా వేయాలి.
17.
మనం అవసరాలు
అనుకున్నవన్నీ నిజమైన అవసరాలు కాకపోవచ్చు. అదంతా మార్కెటింగ్ మాయాజాలం కావచ్చు.
అది తెలుసుకుని, ఆ మాయలో పడకుండా చూసుకోగలిగితే, చాలా ఖర్చులు అదుపులోకి వస్తాయి.
18.
మనం చేసే ప్రతి
అనవసరపు ఖర్చు కుటుంబంలో మరొకరికి భారం అయ్యే అవకాశం వుంటుంది. క్షణికానందాన్ని
ఇచ్చే ఖర్చులు తరువాత రాబోయే ముఖ్యమైన ఖర్చులకు డబ్బులేకుండా చేస్తాయి.
19.
కొనాలనిపించగానే
కొనకపోతే అసహనం కలుగుతుంది. కొన్న తరువాత ఎందుకు కొన్నానా అని అసహనం కలుగుతుంది. మొదటి
అసహనాన్ని కొద్దిసేపు భరిస్తే, మరో అసహనమూ వుందదు, ఖర్చూ వుండదు.
20.
ఖర్చు పెట్టడంలో ఆనందం వుంటుందన్నది భ్రమ. చాలా సార్లు ఖర్చులో ఆనందానికి
కారణం ఆప్తులు కానీ ఖర్చు కాదు. అందుకే ఖర్చు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఆనందాన్ని
ఇస్తోందా లేదా అని ప్రశ్నించుకోవాలి.
21.
డబ్బు వచ్చినా
నిలవదు. నిలిచినా సంతోషాన్ని ఇవ్వదు. ఖర్చు పెట్టినా ఆనందాన్ని ఇవ్వదు. కేవలం
ఇతరుల సంతోషం కోసం పెట్టిన ఖర్చే ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి వ్యక్తి తన సంపాదనలో
కొంత భాగాన్ని మరొకరి సంతోషానికి వాడాలి.
“ఇక్కడి దాకా వ్యయం సంగతులు చెప్పాను కదా ఇక
ఆదాయం గురించి మాట్లాడిన విశేషాలు చెప్తాను వినండి” అని బేతాళుడు కొనసాగించాడు.
22.
దురాశ లేకుండా
చట్టరీత్యాకానీ, నైతికంగా కానీ తప్పు చేయకుండా ఎంత సంపాదించినా తప్పు లేదు. అందువల్ల
డబ్బుని సంపాదించేటప్పుడు సమాజం ఏమనుకుంటుందో అన్న భయాన్ని, అనుమానాన్ని పక్కన
పెట్టాలి.
23.
సంపాదన వేరు ఆదాయం వేరు. శారీరక లేదా మేధోశ్రమ ద్వారా వచ్చే డబ్బు సంపాదన.
డబ్బు పెట్టుబడిపెట్టడం ద్వారా వచ్చే వడ్డీ, లాభం ఆదాయం కిందకు వస్తుంది. ఇలాంటి
ఆదాయాన్ని పెంచుకొవాలి.
24.
పన్నులు మనకి
లాభాన్ని ఇవ్వకపోగా, సంపద వైపుకెళ్ళే నడకను నెమ్మది చేస్తాయి. వీటి తెలివిగా ఉపయోగించుకుంటే
అవే వేగాన్ని పెంచి, సంపద లక్ష్యాలను త్వరగా చేరేందుకు దోహదపడతాయి.
25.
ముందుచూపుతో సరైన చదువులుతో, కొత్త అవకాశాలను అందుకుంటూ సంపాదనను సుస్థిరం
చేసుకోవాలి. వ్యాపకంగానో, కళగానో వున్నవాటిని అదనపు సంపాదనకు ఉపయోగించుకోవాలి.
26.
సంపాదన స్థిరం
కాదు. సంపాదన లేనప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రత్యమ్నాయాలని ఏర్పాటు
చేసుకోవాలి. వస్తున్న ఆదాయంలోనే కొంత తీసిపెట్టాలి. వేరే ఆదాయమార్గాలను సిద్ధం చేసుకుంటూ
ఉండాలి.
ఇక్కడిదాకా విన్న కుబేరుడు “బేతాళా, నీ
ప్రయత్నం చాలా బాగుంది. ఇక అతి ముఖ్యమైన పొదుపు, ముదుపు గురించి ఏం
మాట్లాడుకున్నారో తెలియజెప్పు” అన్నాడు. బేతాళు “సరే”నంటూ కొనసాగించాడు.
27. డబ్బు తిరిగి రాకుండా వాడుకుంటే
అది ఖర్చనీ, రాబోయే ఖర్చు కోసం దాచుకుంటే పొదుపు అనీ, లాభాలు ఆశించి లావాదేవీలు
జరిపితే అది పెట్టుబడి అనీ గుర్తించాలి. ఏ రకంగా ఎంత డబ్బు వాడాలో
నిర్ణయించుకోవాలి.
28.
రిస్క్, రివార్డ్
రెండూ ఒకదానికొకటి అనుబంధంగా నడుస్తాయి. ఆర్థిక ఒడిదొడుకులు తట్టుకునే సామర్థ్యం (రిస్క్
ఎపిటైట్) వయసుతో పాటు తగ్గుతూ వెస్తుంది. అందువల్ల వయసులో వున్నప్పుడు రిస్క్
ఎక్కువ వున్న పథకాలలో, వయసు మీదపడ్డ తరువాత తక్కువ రిస్క్ వుండే పథకాలలో ముదుపు
చెయ్యాలి
29.
రాబోయే అవసరాల కాల వ్యవధి, రిస్కు తీసుకునే సామర్థ్యం, వయస్సు, ఆయా పథకాల
లిక్విడిటీ వంటివి పరిగణన చేసుకుంటూ అన్ని రకాల ఆర్థిక పథకాలతో ఒక పోర్ట్ ఫోలియో
నిర్మించుకోని, దానిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అవసరమైన మార్పులు చేసుకుంటూ
పోర్ట్ ఫోలియే ఎదిగేలా చూసుకోవాలి..
30.
ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ముందు ముందు అతని సంపాదన
ఎలా వుండబోతోందో ఊహించి, దానిలో నుంచి సంపాదించిన ఆస్థుల విలువ తగ్గించి,
అప్పుల విలువ జోడించి తన ఆజీవిత ఆర్థిక విలువ (Human Life
Value) లెక్క వేసుకోవాలి. దాని ఆధారంగా ఇన్సూరెన్స్ కవర్ ఎంతుండాలో
నిర్ణయించుకోవాలి.
31.
ఇన్సూరెన్స్ పథకాలలో అన్నింటికన్నా ఉత్తమమైనది, చౌకైనది
టర్మ్ పాలసీ. మనిషి జీవితకాలపు ఆర్థిక విలువకు సరిపడేలా టర్మ్ పాలసీ తీసుకోని
మిగిలిన డబ్బుని వేరే ఏవైనా పథకాలలో పెట్టవచ్చు
32.
సంపద సాధించడంలో
అత్యంత కీలకమైనది, అత్యంత లాభదాయకమైనది – పెట్టుబడి. ఏదైనా ఒక కంపెనీలో డబ్బులు
పెట్టుబడిగా పెట్టడం అంటే ఆ కంపెనీ ఆర్థిక ప్రగతికి మన ఆర్థిక ప్రగతిని
ముడెయ్యడమే. అయితే అందులో నష్టం వచ్చే అవకాశం కూడా వుంది అని గుర్తెరిగి వుండాలి.
33.
నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి, అవగాహన లేకుండా, అత్యాశతో
వ్యవహరించడం మంచిది కాదు. ఇలాంటి పెట్టుబడులలో తక్కువకాలంలో ఎక్కువలాభాలు
సంపాదించాలనుకోవడం అవివేకం.
34.
ఒక కంపెనీ గురించి, ఆ కంపెనీ చేసే వ్యాపారం గురించి, ఆ వ్యాపారాన్ని ప్రభావితం
చేసే అంశాల గురించి సమగ్రంగా విశ్లేషించగలిగితేనే షేర్ మార్కెట్ లో లాభాలు
పొందవచ్చు.
35.
స్టాక్ మార్కెట్ పనితీరుని తెలుసుకోడానికి సెన్సెక్స్ ఉపయోగపడుతుంది. షేర్లలో
దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టి, మార్కెట్ ఎగుడుదిగుడులను చూసి భయపడకుండా స్థిరంగా
వుంటే నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ అని సెన్సెక్స్ నిరూపిస్తుంది.
36.
ఈక్వీటీలో డబ్బు పెట్టాలంటే అందుకు స్టాక్ మార్కెట్ కాకుండా, మ్యూచువల్ ఫండ్
మార్గంలో వెళ్ళడం మంచిది. రిస్క్ తక్కువ తీసుకుంటూనే మంచి లాభాలను పొందవచ్చు.
అలాంటి ఫండ్స్ లో కూడా డైవర్సిఫైడ్ ఫండ్స్ లో, టాక్స్ ఆదా చేసే ఫండ్స్ లో ముదుపు
చేయడం లాభదాయకం.
37.
షేర్ పెట్టుబడిలో
నష్టం మన పొరపాటు వల్ల రావచ్చు, ఆ సంస్థ లోపాల వల్ల రావచ్చు, వీటికి బాహ్య
ప్రపంచంలోని ఊహించలేని ప్రభావాల వల్ల కూడా రావచ్చు. వీటిని సంసిద్ధంగా వుండాలి. విశ్లేషించుకునే సమర్థత
వుండాలి.
38.
చిన్న వయసులోనే రిటైర్మెంట్ కోసం ప్రణాలిక వేసుకోవాలి. ఎంత
త్వరగా పొదుపు మొదలుపెడితే అంత త్వరగా సంపద సాధించవచ్చు.
39.
ఇల్లు కొనుక్కోవాలంటే - ఆర్థిక స్థితిని అంచనా వేసుకోని, డౌన్ పేమెంట్ నుంచి
ఫోర్ క్లోజర్ దాకా పూర్తి ప్రణాలిక వేసుకోని ముందుకి అడుగెయ్యాలి. ఏ ఆలోచన లేకుండా
ఇంటి రుణం తీసుకుంటే దీర్ఘ కాలం పాటు అప్పుల ఊబిలో ఉండిపోవాల్సి వస్తుంది.
40.
సంపాదనని సంపదగా మార్చుకోవాలంటే ఆ డబ్బులో రిటైర్మెంట్ కోసం సుమారుగా 20%,
నిత్య అవసరాల కోసం 40%,
పొదుపు ముదుపులకోసం 15%,
లైఫ్ స్టైల్
ఖర్చులకోసం 20% ఖర్చుపెడితే మంచిది.
41.
సంపద అంటే కేవలం
డబ్బు మాత్రమే కాదు. ఆరోగ్యం, అనుబంధం, జ్ఞానం వంటివి కూడా సంపదే. ఆర్థిక
విషయాలలోనే కాక మిగిలిన విషయాలలో కూడా సంపద సాధిస్తేనే నిజమైన సంపద సాధించినట్లు.
అని చెప్పి నమస్కరిస్తూ నిలబడ్డాడు రూపీ బేతాళుడు. ఈ ఆర్థిక పాఠాలన్నీ విన్న
కుబేరుడు ఎంతగానో సంతోషించాడు.
“అద్భుతం బేతాళా! నిన్ను భూమి మీదకు పంపించేటప్పుడు మానవులంతా ఆదాయాన్ని
పెంచుకునేందుకు లక్ష్మీకటాక్షం కోసమే తపిస్తున్నారు కానీ సంపద పెంచుకునేందుకు
నన్ను ఎవరూ గుర్తించడం లేదు అని అనుకున్నాను. కానీ నువ్వు కలిసిన మధ్యతరగతి
విక్రమార్కుడు నా ఆలోచన తప్పని నిరూపించాడు. అతను అత్యంత ప్రతిభాశాలి. డబ్బు
గురించి అన్న రహస్యాలను తెలుసుకున్నాడు. అతను తప్పకుండా అమోఘమైన సంపదను
సాధిస్తాడని నాకు కూడా నమ్మకం కలుగుతోంది. అలా జరగాలని నేను మనస్ఫూర్తిగా
ఆశీర్వదిస్తున్నాను కూడా.
ఇక నీ విషయానికి వస్తే, నువ్వు తిరిగి భూలోకానికి వెళ్ళి అక్కడి మానవులంతా
సంపద సంపాదించుకునేలా సహాయపడు. లోకా స్సమస్తా సుఖినోభవంతు” అంటూ
ఆశీర్వదించాడు.
బేతాళుడు మానవుల ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు "రూపాయి చెప్పిన బేతాళ కథలు" అనే పుస్తకంగా మారి భూలోకం వైపుకు
బయల్దేరాడు.
(సమాప్తం)
Nenu rupee bethal kathalu modhati baagam nundi chadhivanu.
ReplyDeleteDabbu gurinchi theliyani chala vishayalanu nerchukunnanu..
ధన్యవాదాలు రవి గారూ
Deleteఅదేంటోగాని చదివినప్పుడువున్న ఊపు తర్వాత వుండదు,:)(
ReplyDeleteచదివినదంతా ఒకేసారి చేసేయాలని అనుకోకండి. పైన వున్న నలభైపై ఆలోచనలలో మీకు సరిపోయే రెండో మూడో ఎన్నుకోని కనీసం మూడు నెలలు పాటించండి. ముఖ్యంగా అప్పులు వుంటే వాటిని తగ్గించుకునేవి, ఖర్చులు తగ్గించేవి ఎన్నుకోండి. మీరు చెయ్యాలనుకుంటున్న ఆలోచన మీ కుటుంబసభ్యులతో ముఖ్యంగా (వుంటే) జీవిత భాగస్వామితో, మిత్రులతో పంచుకోండి. ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్ళండి. జయీభవ.
Delete