Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, January 3, 2016

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 28


ఐదు సంవత్సరాల క్రితం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాను. ఈ మధ్య చూస్తే చాలా తక్కువ రిటర్న్స్ వచ్చాయని అర్థం అయ్యింది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కాస్త ఎక్కువగా మాత్రమే రిటర్న్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి?
యూనిట్ లింక్డ్ పథకాలలో మొదటి ప్రీమియంలో చాలా ఎక్కువగా ఛార్జీలు వుంటాయి. ఆ ఛార్జీలు పోగా మిగిలిన మొత్తంలో కొంత ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఖర్చైపోతుంది. మిగిలిన మొత్తాన్ని మార్కెట్ లో పెట్టుబడిగా పెడతారు. ఈ పెట్టుబడి మొత్తం మీరు కట్టిన ప్రీమియంలో సుమారు 40-50 శాతం వుంటుంది. అందువల్ల మీకు వచ్చే రిటర్న్స్ తగ్గుతాయి. అదీ కాక యూనిట్ లింక్డ్ పథకాలలో ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి అన్న విషయం మీరు పాలసీ తీసుకునేటప్పుడు దరఖాస్తులో చెప్పాలి. సామాన్యంగా పాలసీ అమ్మే ఏజంట్లు ఆ విషయం చెప్పకుండా వాళ్ళకు నచ్చిన విభాగాన్ని ఎంపిక చేస్తారు. ఈ విభాగాలలో పూర్తి ఈక్విటీ వున్నవి, కొంత ఈక్విటీ కొంత డెట్ వున్నవి, పూర్తిగా డెట్ లో పెట్టేవి వుంటాయి. మీ పాలసీలో పూర్తి ఈక్విటీ ఎంపిక చేసి వుండకపోతే కూడా మీ రిటర్న్స్ బాగా తగ్గిపోతాయి. అందుకే యూనిట్ లింక్డ్ తీసుకోవడం కన్నా ఒక మ్యూచువల్ ఫండ్ పథకం, ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచిదని చెప్తుంటాము. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది - మీ పాలసీలో ఏ విభాగంలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతోందో తెలుసుకోండి. పూర్తి ఈక్విటీ విభాగంలో లేకపోతే వెంటనే మార్చుకోండి. దీనిని స్విచ్ ఆప్షన్ అంటారు. లాకిన్ పిరియడ్ అయిపోయి వుంటే ప్రీమియం కట్టడం ఆపేసి, ఆ డబ్బుని మ్యూచువల్ ఫండ్ వైపు మళ్ళించండి. మార్కెట్ బాగా వున్నప్పుడు చూసుకోని అవసరమైతే యూలిప్ పథకాన్ని క్లోజ్ చెయ్యండి. తగినంత ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్ ద్వారా తీసుకోండి.

సంపాదిస్తున్నదంతా 30% టాక్స్ కట్టడానికే సరిపోతోంది. ఇది తగ్గించుకోవడం ఎలా?
30% కడుతున్నారని మీరు అనుకుంటున్నారు. దాని మీద వేసే ఎడ్యుకేషన్ సెస్, బయట సర్విస్ టాక్స్, వాట్, ఎక్సైజ్ వగైరా అన్ని రకాల టాక్సులు కలుపుకుంటే సుమారు 50% సంపాదన టాక్సులకే పోతుంది. అది ఈ దేశ ప్రభుత్వ చట్టం. టాక్స్ కట్టకపోవడం చట్టరీత్యా నేరం. కాబట్టి తప్పదు. అయితే టాక్స్ మినహాయింపు వున్న పథకాలు కొన్ని వున్నాయి. ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 80C, 80D, 80G, 80E వంటివి చాలా వున్నాయి. ఇన్సూరెన్స్ పథకాలలో పెట్టిన డబ్బు, కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్, కాల పరిమితి వున్న కొన్ని డిపాజిట్స్, ప్రభుత్వ బాండ్లు, హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల ప్రీమియం, ఇంటి రుణం తీర్చడానికి కట్టే అసలు మరియు వడ్డీ, గుర్తింపు వున్న సంస్థలకు ఇచ్చే డొనేషన్ వంటివి చాలా వున్నాయి. ఎవరైనా టాక్స్ కన్సల్టెంట్ / ఛార్టెడ్ ఎకౌంటెంట్ ని కలిసి ఈ పథకాలలో డబ్బు పెట్టండి. మీరు 30% టాక్స్ బ్రాకెట్ లో వున్నారు కాబట్టి పూర్తిగా టాక్స్ కట్టకుండా వుండే అవకాశం వుండకపోవచ్చు కానీ చాలా వరకు టాక్స్ తగ్గించుకునే అవకాశం వుంటుంది.

ఆన్ లైన్ లో కొన్ని వెబ్ సైట్లు వాళ్ళ దగ్గర కొన్న వస్తువులపై క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి. వీటి ధరలు కూడా బయట కన్నా తక్కువగానే వుంటున్నాయి. ఇదెలా సాధ్యమౌతోంది? వీటి వల్ల లాభమేనా?
వెబ్ సైట్లో అమ్మే వస్తువుల ధర తక్కువగానే వుంటుంది. వాళ్ళకు పెద్ద పెద్ద షాపులు పెట్టి, వాటి అద్దెలు కట్టి, సేల్స్ మెన్ పెట్టి అమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ మేరకు ధర తగ్గుతుంది. అయితే క్యాష్ బ్యాక్ అనేది రకరకాలుగా ఇవ్వబడుతుంది. కొన్ని వాళ్ళు అమ్ముతున్న ప్రాడక్ట్ ఉత్పత్తి చేసిన సంస్థే ఇచ్చే డిస్కౌంట్ ని క్యాష్ బ్యాక్ గా ఇవ్వడం, కొన్ని బ్యాంకులు వారి కార్డును వాడినందుకు ఇచ్చే డిస్కౌంట్ వంటివి కొన్ని. అమ్ముతున్న వెబ్ సైటే కొన్ని సార్లు డబ్బు వెనక్కి ఇస్తుంది. అయితే ఇక్కడ ఒక తిరకాసు వుంది. మీకు వెనక్కి ఇచ్చే డబ్బుని డబ్బు రూపంలో ఇవ్వరు. పాయింట్ల రూపంలోనో, కూపన్ల రూపంలోనో ఇస్తారు. ఆ పాయింట్లు/కూపన్లతో వారి సైట్ లోనే షాపింగ్ చెయ్యాలన్న నిబంధన వుంటుంది. అలా కొన్నప్పుడు మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇస్తారు. అంటే మీ చేత అదే సైట్ లో పదే పదే కొనిపించే పథకం అన్న మాట. డబ్బు అదే తిరుగుతుంటుంది. ఇందులో మోసం ఏమీ లేదు. కానీ మీరు అదుపులో లేకపోతే పదే పదే కొంటూ అనవసరమైనవన్నీ కొనే అవకాశం వుంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వుండాలి.

బ్యాంక్ మేనజర్ మోసం చేశాడు. ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఇచ్చిన డబ్బుని ఇన్సూరెన్స్ పథకంలోకి బదలాయించాడు...

బ్యాంకింగ్ ఒంబుడ్స్ మెన్ అన్న సంస్థ వుంది. ఏదైనా బ్యాంక్ గురించి లేదా బ్యాంక్ ఉద్యోగి గురించి ఫిర్యాదు చెయ్యాలంటే వీరికి రాయవచ్చు. వీరి పూర్తి వివరాలు మీ బ్యాంక్ బ్రాంచ్ నోటీస్ బోర్డు పైనే వుంటాయి. బ్యాంక్ ని నమ్మాలి కానీ వ్యక్తులని కాదు. మీ సంతకం లేకుండా ఇన్సూరెన్స్ పథకం మీకు అమ్మడం అసాధ్యం. ఫోర్జరీ చేస్తే అది వేరే సంగతి. మీరు సంతకం చేసిన డాకుమెంట్స్ లో ఏముందో చదవకపోవటం మీ తప్పే అవుతుందని గుర్తుంచుకోవాలి.

No comments:

Post a Comment