Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, June 14, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 2

బేతాళా, నేను గత ఐదు సంవత్సరాలుగా అనేక మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బు దాచుకుంటున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు తీసి ఒక ఇల్లు కొనుక్కోవాలని... - (శేషుకుమార్, తెనాలి)

మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలిక పెట్టుబడి. ఐదేళ్ళలో డబ్బులు వెనక్కి తీసుకుంటే మీరు తీసుకునే సమయంలో మార్కెట్ పరిస్థితిని బట్టి స్వల్ప లాభమో, ఒకోసారి పెట్టిన పెట్టుబడి కన్నా తక్కువో వచ్చే అవకాశం వుంది. మీ వయసుని బట్టి దీర్ఘకాలిక అవసరాలు ఏవైనా వుంటే వాటికోసం ఈ మ్యూచువల ఫండ్స్ ని అలాగే వుంచండి. ప్రస్తుత అవసరాలకి ప్రత్యామ్నాయం వుందేమో ప్రయత్నించండి.

నేను చిరుద్యోగిని. మరో ఇరవై ఏళ్ళ సర్వీస్ వుంది. రిటైర్మెంట్ నాటికి కాస్త డబ్బు వెనకేస్తే మంచిది అన్న ఆలోచన కూడా వుంది. అయితే ఈక్విటీలో డబ్బులు పెట్టాలంటే భయం. ఏం చెయ్యమంటారు?

మనం దాచుకునే డబ్బుని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. మొదటి పొదుపు, రెండొవది ముదుపు. పొదుపు చెయ్యడం అంటే బ్యాంకులోనో, పోస్టాఫీస్ లోనో, పీపీయఫ్ లోనో పెట్టుకోవడం. వీటి మీద మీకు 8 నుంచి 10 శాతం లోపు వడ్డీ వస్తుంది. సమస్య ఏమిటంటే ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) అంత కన్నా ఎక్కువ వుంటే, మీకు వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ. అందుకే ఈక్విటీలో డబ్బులు పెట్టక తప్పదు. అదే ముదుపు. ఇప్పుడు చాలా మ్యూచువల్ ఫండ్స్ 30 శాతం కన్నా ఎక్కువ రాబడి ఇస్తున్నాయి. 8.8% వడ్డీ ఇచ్చేడిపాజిట్లో నెల నెలా ఒక వెయ్యి రూపాయలు పెడితే ఇరవై ఏళ్ళకి సుమారు ఆరు లక్షలు కూడబెట్టచ్చు. అదే వెయ్యిని 24% వడ్డీ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఇరవై ఏళ్ళకి దాదాపు అరవై లక్షలు అవుతాయి. ఈ తేడాను గమనిస్తే ఈక్విటీలో ఎందుకు డబ్బులు పెట్టాలో అర్థం అవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టినప్పుడు ఈక్విటీలో నష్టం వచ్చే అవకాశం చాలా తక్కువ. అందువల్ల భయం మానుకోండి. మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో అంచనా వేసుకోని తక్కువ మొత్తంలోనైనా ఈక్విటీలో పెట్టండి. మీరు నెల నెలా దాచి పెట్టగలిగిన డబ్బులో, మీ వయసును బట్టి, కనీసం సగం ఈక్విటీలో పెట్టాలని బేతాళుడి సూచన. వయసు పెరుగుతున్నకొద్దీ ఈక్వీటీలో పెట్టే డబ్బు తగ్గించుకుంటే, డిపాజిట్లను పెంచుకుంటూ వేళ్ళండి.

రూపీ బేతాళా, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎంత కవరేజ్ తీసుకోవాలి? ఇప్పుడు నెలకి పాతికవేలు సంపాదిస్తున్న మనిషి తన మరణం తరువాత కుటుంబానికి ప్రతి నెల పాతిక వేలు వచ్చేలా తీసుకుంటే సరిపోతుందా? ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి ధరల పెరుగుదల వల్ల పాతికవేలు సరిపోని పరిస్థితి వస్తుంది కదా? ఇది ఎలా అధిగమించాలి? - (మూర్తి, హైదరాబాద్)

మూర్తిగారూ, మీరన్నది నిజమే. అలా లెక్కేసుకుంటే ఇన్సూరెన్స్ ఎంత తీసుకున్నా సరిపోదు. కానీ ఒక మనిషి లేకుండా పోతే ఆ కుంటుంబం నిలదొక్కుకునే దాకా ఇన్సూరెన్స్ డబ్బులు వుంటే సరిపోతుంది. కుటుంబ ఖర్చుల్లో ముఖ్యమైన పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, జీవిత భాగస్వామి జీవనభృతి వరకు ఇన్సూరెన్స్ డబ్బులు సరిపోవాలి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత వుండాలో నిర్ణయించుకునేటప్పుడు, మీరు సంపాదించిన ఆస్థులను మినహాయించాలి. ఉదాహరణకి మీరు యాభై లక్షలకు సరిపోయే ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే, మీ ఇల్లు, పొలం, భూముల విలువ కోటి రూపాయలు వుంటే, ఇన్సూరెన్స్ ఎక్కువ తీసుకోకపోయినా ఫర్లేదు.

ఈ మధ్యే పెళ్ళి కుదిరింది. ఈ బేతాళ కథలన్నీ కాబోయే శీమతికి చూపించి, ఇంప్రెస్ చేద్దామని అనుకుంటున్నా. మీరేమంటారు బేతాళుడు గారూ...


ముందు రూపీ బేతాళుడి అభినందనలు అందుకోండి. పెళ్ళికి ముందు ఆర్థిక విషయాలు మాట్లాడుకోవాలనుకోవటం చాలా మంచి ఆలోచన. అది చాలా అవసరం కూడా. పెళ్ళిలో దుబారా తగ్గించుకోడానికి, పెళ్ళి తరువాత డబ్బులు ఎలా ఆదా చెయ్యాలో, ఏ ఏ ఆర్థిక లక్ష్యాలను సాధించాలో, ఇవన్నీ నిర్ణయించుకోడానికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. రెండు వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చి ఒకటౌతున్న మీ ఇద్దరి ఆర్థిక అలవాట్లు, డబ్బు గురించి అభిప్రాయాలు వేరుగా వుండే అవకాశం వుంది. అవన్నీ పెళ్ళికు ముందే తెలుసుకుంటే మంచిదే కదా! అలాగని ఎప్పుడూ అవే విషయాలు మట్లాడకండి... అసలుకే మోసం వస్తుంది.

Wednesday, June 10, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 1

(ఆంధ్రభూమి వార పత్రికలో, నేను రాసిన శీర్షిక రూపాయి చెప్పిన బేతాళ కథలకు కొనసాగింపు ఈ ప్రశ్నలు జవాబులు.)

మా బంధువులు కొంతమంది టేకు చెట్ల మీద పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని చాలా డబ్బు పెట్టారు. చివరికి ఆ కంపెనీ లేదు, టేకు చెట్లూ లేవు. ఇలాంటి మోసాలని అరికట్టలేమా?
- (ప్రశాంతి, గుంటూరు)

ఒక చెట్టు ఎదగడానికి కొంత కాలం పడుతుంది. అందుకు అవసరమైన మట్టి, నీరు, ఎండ సకాలం అందాలి. ఇవేవీ లేకుండా ఒక విత్తనం నాటితే రాత్రికి రాత్రే మొక్క మొలిచి పెద్ద చెట్టు అయిపోవాలని కోరుకోవడంలో ఏమైనా న్యాయం వుందంటారా? ఇది టేకు చెట్టు గురించి మాత్రేమే కాదు. డబ్బు అనే విత్తనం నాటేసి వెంట వెంటనే లక్షలు, కోట్లు సంపాదించాలనుకో వచ్చు అని చెప్పే ప్రతి పథకం కూడా అలాంటిదే. డబ్బు సంపాదించాలన్న కోరిక తప్పు కాదు, కానీ ఒక్కసారిగా లక్షలు వచ్చేయలని కోరుకోవడం దురాశ అవుతుంది. దురాశ దుఖానికి కారణం అవుతుందని మనందరం చదువుకున్నాం కదా! ఇలాంటి మోసాలు చేసే సంస్థలకు మనుషుల దురాశే పెట్టుబడి. ఆ దురాశ వదులుకోకపోతే టేకు చెట్లు అని మోసం చేస్తారు, ఈమూ పక్షులని మోసం చేస్తారు.. ఇంకా అనేకం పుట్టుకొస్తూనే వుంటాయి.

నా దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు వున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని బట్టీ వాటిని అమ్మేయటం మంచిదా?

సారీ. ఈ శీర్షిక ఉద్దేశ్యం షేర్ టిప్ లు ఇవ్వటం కాదు. సామాన్య జనానికి ఆర్థిక విషయాల గురించి అవగాహన కల్పించడం వరకే ఈ ప్రశ్నలు జవాబుల పరిథి. విషయ పరిజ్ఞానం వుంటే ఏ ప్రాడక్ట్ కొనాలో, ఏ షేర్లు కొనాలో స్వంతంగా నిర్ణయించుకోవచ్చు. అందువల్ల ప్రత్యేకించి ఏ ప్రాడక్ట్ గురించి, పథకాల గురించి కానీ ప్రశ్నలు వేయకండి.

మీరు చెప్పిన ఆర్థిక సలహాలు చాలా ఉపయోగపడుతున్నాయి. మీరు చెప్పిన విషయాలను పాటించడం మొదలుపెట్టాము. ఇలాంటివి మనం పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పిస్తే ఉపయోగం వుంటుంది కదా? - (రత్నాకర్, ఈ మెయిల్ ద్వారా)

బేతాళ కథలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. పిల్లలకు ఆర్థిక పాఠాలు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. పాకెట్ మనీ ఇవ్వడం వరకే చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నారు. వాటికి లెక్కలు అడగటం (అడగకపోయినా ఫర్లేదు, కనీసం రాయమని చెప్పడం), అందులో కొంత డబ్బు దాచుకోవడం నేర్పించడం చెయ్యాలి. సంపద సాధించడం వెనక ఆర్థిక పరిజ్ఞానం, ఆదాయ వ్యయాలు, పొదుపు ముదుపు ఇవన్నీ వున్నాయి. వీటి గురించి క్రమంగా చెప్పడం మంచి పద్దతి. ఈ మూడు కాకుండా మనిషి స్వభావాన్ని పరీక్షించే అంశాలు చాలా వుంటాయి. ఆశయం, దురాశ లేకపోవడం, ఓర్పు, సహనం, నియంత్రణ ఇవన్నీ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే లక్షణాలు. ఇవి పెంపొందేలా పెంచడం ఆర్థికంగానే కాక ఇంకా అనేక విధాలుగా ప్రయోజనాలని ఇస్తుంది.


(రూపాయి అడిగే బేతాళ ప్రశ్నలు మీ దగ్గరా వున్నాయా? వెంటనే  రాసి పంపించండి. rupeebethal@gmail.com)