Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, January 10, 2016

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 29

ఇంతింత డబ్బు పెట్టి ఎల్ ఈ డీ టీవీలు, మొబైల్ ఫోన్లు కొంటుంటారు. అంత విలువ చేసే టెక్నాలజీ అందులో వుంటుందా?
ఎలక్ట్రానిక్ వస్తువులలో కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు వాటి ధర చాలా ఎక్కువగా వుంటుంది. కొంత మంది కొత్త టెక్నాలజీ వచ్చింది అనగానే వెంటనే కొనేస్తుంటారు. చేతిలో ఎప్పుడూ లేటస్ట్ ఐ ఫోన్ వుండాలన్నది వారి సరదా అయితే, ఆ సరదాకు ఎక్కువ ధర అనే మూల్యం చెల్లించక తప్పదు. కొంత కాలం ఆగితే ఆ ధరలు కాస్త తగ్గుతాయని గుర్తుంచుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా అందులో వున్న టెక్నాలజీలో మనం వాడేది ఎంత అన్నది గమనించుకోవాలి. చాలా ఎక్కువగా రెజల్యూషన్ వున్న ఎల్ఈడీ టీవి కొని, ఇంట్లో మామూలు కేబుల్ టీవీ పెట్టుకుంటే ఆ టీవీ వల్ల ఎలాంటి ఉపయోగం వుండదు. ఎంత గొప్ప టీవీ అయినా మసకగానే కనిపిస్తుంది. అందువల్ల మన వాడకాన్ని బట్టి టేక్నాలజీని ఎంచుకుంటే, ఖర్చు అదుపులో వుంటుంది, పెట్టిన డబ్బుకి సరిపడా వాడుతున్నామన్న తృప్తి వుంటుంది.

సత్యప్రసాద్ గారూ, ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉపకరిస్తాయా లేక ఈక్విటీలు డెట్ ఫండ్స్ అంటున్నారు అవి బెస్టా. లేక మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగకరమా? ఒక ఐదారేళ్ళ తర్వాత మనం చెల్లించలేక పోతే ఎలా...రిస్క్ కవరేజ్ వుంటుందా.... దయతో వివరిస్తారా 
నారాయణగారూ, మీరు మూడు విషయాలను కలగాపులగం చేసేశారు. ఒకటి ఇన్సూరెన్స్, రెండు డెట్ ఫండ్స్, మూడు ఈక్విటీ ఫండ్స్. ఈ మూడింటి అవసరం వేరు, పని చేసే విధానం వేరు. ముందు ఈ మూడింటి గురించి చెప్తాను. ఇన్సూరెన్స్ ఒక వ్యక్తి మరణిస్తే అతని కుటుంబసభ్యులకు (నామినీకి) డబ్బు ఇస్తుంది. ఇందుకుగాను ప్రీమియం కట్టాలి. మ్యూచువల్ ఫండ్ అంటే మీరు కట్టిన డబ్బుని మీ తరఫున ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర వున్న పథకాలలో మీరు ఇచ్చే డబ్బు మొత్తాన్ని డెట్ మార్కెట్ లోమాత్రమే పెడితే అది డెట్ ఫండ్. ఈక్విటీ మార్కెట్ (షేర్లు) లో పెడితే అది ఈక్విటీ ఫండ్. డెట్ ఫండ్ లో రిస్క్ తక్కువ లాభాలు వచ్చే అవకాశం కూడా తక్కువ. ఈక్విటీలోరిస్క్ ఎక్కువ  (ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడి అయితే) లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇన్సూరెన్స్ తో పాటుగా ఇలాంటి ఫండ్లలో డబ్బులు పెట్టే అవకాశాన్ని యూలిప్ పథకాల ద్వారా ఇస్తున్నాయి. వీటిలో వేటిలో డబ్బు పెట్టాలి అన్న ప్రశ్నకు వస్తే, ఇన్సూరెన్స్ తీసుకోవడం అనివార్యం. యూలిప్ పథకాలు కాకుండా టర్మ్ పథకం తీసుకోవడం మంచిది. ఇక మిగిలిన డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ లలో రెండింటిలోనూ డబ్బు పెట్టాలి. వీటితో పాటు ఫిక్స్డ్ డిపాజిట్, బంగారం వంటి ఇతర మార్గాలలో పెట్టుబడి పెట్టాలి. ఎందులో ఎంత పెట్టాలి అంటే అది వయసుని బట్టి, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి వుంటుంది. తక్కువ వయసులో ఈక్విటీలో ఎక్కువగానూ, వయసు పెరిగిన తరువాత డెట్/డిపాజిట్లలో ఎక్కువగా పెట్టాలని సలహా ఇస్తుంటాము.

నాకు రోజుకి ఆరొందలు ఆదాయం వచ్చే పని చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు ఎలాంటి సేవింగ్స్ చెయ్యలేదు. ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నాను. త్వరగా లాభాలు వచ్చే మార్గాలు చెప్పగలరు. మ్యూచువల్ ఫండ్స్ మంచివేనా? - సనత్ రెడ్డి (ఈమెయుల్ ద్వారా)
త్వరగా లాభాలు వచ్చే మార్గాలు లేవు. వుండవు. ఆర్థిక ఎదుగుదల క్రమంగా జరగాలి. ఉన్నట్టుండి వచ్చి పడే డబ్బు గురించి తెలుగులో నడమంత్రపు సిరి అన్న సామెత వుంది. శ్రమ, ఆలోచన, అవగాహన, ప్రయత్నంతో పాటు ఓపిక లేకుండా డబ్బులు కూడబెట్టలేరు. మీ సంపాదన విషయానికి వస్తే సుమారు నెలకి పదిహేను నుంచి పద్దెనిమిది వేలు సంపాదిస్తున్నారని అర్థం అయ్యింది. అయితే మీ వయసు ఎంతో రాయలేదు. మీ ఆదాయం, ఇంతవరకు ఎలాంటి సేవింగ్స్ చెయ్యకపోవడం చూస్తుంటే సుమారు పాతికేళ్ళ వయసు వుండచ్చని, ఇంకా పెళ్ళి కాలేదని ఊహిస్తున్నాను. అదే నిజమైతే మీరు నెలకి మూడు నుంచి ఐదు వేలదాకా పొదుపు చేసేలా పథకం వేసుకోండి. అన్నింటికన్నా ముఖ్యమైనది లైఫ్ ఇన్సూరెన్స్. సుమారు యాభై లక్షల కవర్ ఇచ్చే టర్మ్ ప్లాన్ తీసుకోండి. నెలకి ఐదొందలు ఖర్చౌతుంది. తరువాత సుమారు పదిహేను వందలు టాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి. ఇంకొక పదిహేను వందలు పిపీయఫ్ లేదా పెన్షన్ ఫండ్ లో పెట్టండి. మిగిలిన డబ్బుని బంగారం వంటి పెట్టుబడులకు, ఫిక్స్డ్ డిపాజిట్లకు వాడండి. మీ ఆర్థిక స్థిరపడటానికి మరో ఐదేళ్ళు పడుతుందని గుర్తుపెట్టుకోండి.

నేను ఈ మధ్య నాలుగు బ్యాంకులలో లోన్ అప్లై చేశాను. మూడు బ్యాంకులు తిరస్కరించాయి. ఒక బ్యాంక్ లోన్ సాంక్షన్ చేసింది. ఇలా బ్యాంక్ కి బ్యాంక్ కి ఎందుకు వ్యత్యాసం వుంటుంది.
వ్యత్యాసం సంగతి బ్యాంకులు చూసుకుంటాయి. మీరు ఇంకా పెద్ద సమస్యలో వున్నారు. మీరు లోన్ అప్లై చేస్తే మూడు బ్యాంకులు తిరస్కరించాయంటే మీ సిబిల్ స్కోర్ బాగాలేదని అర్థం. మీ పాత బకాయిల విషయంలో, మీ ఆర్థిక లావాదేవీలలో ఏదో తేడా వుంది. వెంటనే అది బాగుపడేలా చూసుకోండి. మీరు పదే పదే లోన్లకోసం నాలుగైదు బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్నా మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. ఇదంతా ఒకెత్తు. మీకు ఒక బ్యాంక్ లోన్ సాంక్షన్ చేసిందని చెప్తున్నారు కదా. ఒకసారి వాళ్ళ వడ్డీ రేటు చూసుకోండి. అది చాలా ఎక్కువగా వుంటుంది. బ్యాంకులు సిబిల్ రేటింగ్ ఆధారంగా మీకు లోన్ ఇవ్వాలా లేదా అని నిర్ణయించుకుంటాయి. కొన్ని బ్యాంకులు రిస్క్ తీసుకోడానికి సిద్ధపడి సిబిల్ స్కోర్ తక్కువగా వున్నా లోన్లు ఇస్తుంటాయి. అయితే ఆ రిస్క్ కారణంగా వడ్డీ రేటు పెంచేస్తారు. మీరు అత్యవసరంగా ఈ విషయాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం వుంది.